ᐅపుష్కర పట్టాభిషేకం
మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగయుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజల్ని అభిమానిస్తూ, ఆదరిస్తూ రాముడు ధర్మ నిరతితో, నిజాయతీ, నిబద్ధతలతో పాలన సాగించాడు. సర్వకాల సర్వావస్థల్లో ధర్మావలంబనతో రాఘవేంద్రుడు ధర్మరక్షకుడిగా వినుతికెక్కాడు. అలాంటి జగదేక సార్వభౌముడికి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని భద్రాచల దివ్యక్షేత్రంలో చైత్ర శుద్ధ దశమినాడు నిర్వహిస్తారు. రాముడికి పట్టాభిషేకం జరపడమంటే, ధర్మానికి పట్టం కట్టడం. ప్రజలంతా ధర్మాచరణకు కట్టుబడి ఉంటామని ప్రతిన బూనడం. అలనాటి రామరాజ్య పరిస్థితుల్ని మళ్ళీ ఆహ్వానించడం. అందుకే ఈ సంబరం... ఈ సంరంభం.
పట్టాభిషేక మహోత్సవమనేది కేవలం శ్రీరామచంద్రుడికి తప్ప మరే ఇతర దైవానికీ జరపని కమనీయ వేడుక. నవమినాడు కల్యాణరాముడిగా, దశమినాడు పట్టాభిరాముడిగా రఘువీరుడు భాసిల్లుతాడు. రామపట్టాభిషేక వేడుక నాలుగు విధాలుగా విలసిల్లుతుంది. శ్రీమద్రామాయణ నిత్యపారాయణను అనుసరించి ప్రతినెలా పుష్యమి నక్షత్రంనాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమినాటి మరుసటి రోజు శ్రీరామ మహాపట్టాభిషేకం జరుపుతారు. ప్రతి పుష్కరానికి అనగా పన్నెండేళ్లకోసారి శ్రీరామ మహాసామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్నీ, అరవై సంవత్సరాలకోసారి ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. 1999 సంవత్సరంలో ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరపగా, ఇప్పటిది రెండో పుష్కర పట్టాభిషేకం. జగదానంద కారకుడైన, జనప్రియుడైన, జానకీ వల్లభుడైన రామచంద్ర మహాప్రభువుకే మళ్లీ పాలనను అప్పగించడం, శ్రీరామ కరుణ, కృపాకటాక్షాల్ని అర్థించడం- ఈ పట్టాభిషేక నిర్వహణలోని ఆంతర్యం.
త్రేతాయుగంలో విభవావతారమూర్తిగా సంచరించిన శ్రీరాముడు, అర్చావతార మూర్తిగా వెలసిన అపూర్వ సన్నిధానం భద్రాచల క్షేత్రం. తెలుగువారి అయోధ్యాపురిగా పరిఢవిల్లుతున్న భద్రాద్రిలో రాముడు వైకుంఠరామునిగా, రామనారాయణమూర్తిగా గోచరిస్తున్నాడు. ఈ క్షేత్రంలో జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం 'నవాహ్నిక పంచకుండాత్మక పంచేష్టి సహిత చతుర్వేద హవన పురస్కృత శ్రీరామాయణ మహా క్రతువు'గా ఆవిష్కృతమవుతుంది. పన్నెండు పుష్కర నదులనుంచి, నాలుగు సముద్రాలనుంచి పావన జలాల్ని తీసుకొచ్చి సార్వభౌమ వర్చస్కంగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారు. నవాహ్నిక దీక్షతో, 108మంది రుత్విక్కులతో, రామచంద్రుడికి సమస్త రాజలాంఛనాలతో సాగే ఈ వేడుక ఆసాంతం ఓ నేత్రోత్సవం. సకల గుణాభిరాముడి గుణగణాల్ని మనం అన్వయించుకోవడం కోసం, రామరాజ్యం నాటి ఆహ్లాదకర పరిస్థితులు వర్తమానంలో కూడా వర్ధిల్లాలని సంభావించడం కోసమే ఈ పట్టాభిషేక మహోత్సవం.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్