ᐅఆదివైద్యం
ఒకానొక వేదనకు ఆదివైద్యం భక్తి. ఇంకా కర్మయోగం, ధ్యానయోగం, క్రియాయోగం, ఈ అన్నింటికీ మకుటాయమానమైన జ్ఞానయోగం... పేర్లు ఏవైతేనేం అన్ని యోగాలూ సత్యాన్వేషణా మార్గాలే. ఆధ్యాత్మిక శక్తి ప్రేరణలే. వైద్యం అంటే? వేదనా నివారణ. రుగ్మత పోవటం. బాధ ఉపశమించటం. ఏ బాధ, ఏ రోగం? భవరోగం. భవరోగాన్ని మించిన గంటురోగం మరోటి లేదు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి చిన్నచిన్న రోగాలకు బెంబేలెత్తిపోయే మనం ఇంత పెద్ద గంటురోగాన్ని, అంటురోగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అందులోనే ఆబగా ఆనందాన్ని వెదుక్కుంటున్నాం. ఆర్తిగా, కక్కుర్తిగా దాని కోసం చేయరాని పనులు చేస్తూ జీవితాన్ని కకావికలం చేసుకుంటున్నాం. చవకబారు చేసేసుకుంటున్నాం. ఇది తగునా? భౌతిక రోగాలు రాకముందే నివారణ చర్యలు, వచ్చీరాకముందే చికిత్సలు చేసుకునే మనం ఈ భయంకర భవరోగాన్నెందుకు కావాలని కావలించుకుంటున్నాం!? దీని గురించి ఎప్పుడైనా లోతుగా ఆలోచిస్తున్నామా? చాలామంది భావిస్తున్నట్లు భగవంతుడంటే కేవలం మొక్కులు మొక్కుకునేందుకు, కోరికలు తీరితే మొక్కులు తీర్చుకునేందుకు కాదు. మనలోని మాలిన్యాలను కడిగివేసే శుభ్ర జలం ఆయన. మనల్ని అమృతమయం చేసే సుధాసారం ఆయన. దయాసాగరం ఆయన. భక్తి ఉన్నవాడే పాపభీతి కలిగి ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడే లోకంపట్ల ఏకాత్మానుభూతి కలిగిఉంటాడు. సాధకుడే సర్వభూతదయ కలిగి ఉంటాడు. ఈ అన్నీ భగవత్ స్పృహతో మాత్రమే సాధ్యం.
భగవంతుడంత గొప్పవాడా? ఆయన స్మరణతో, స్పృహతో... అరిషడ్వర్గాలతో రాటుతేలిపోయిన మనిషి అంత సులభంగా ఆర్ద్రమైపోతాడా, మార్దవమైపోతాడా? ఔను. మనిషి దేనికి మాలిమి అవుతాడో, దేనితో మమేకమైపోతాడో... చివరికదే అయిపోతాడు. ఇది ఆధునిక విజ్ఞానశాస్త్రం నిరూపించింది. భగవంతుడు సర్వ శక్తిమంతుడు. విమలం, విశుద్ధం, అత్యంత పవిత్రం అయిన సర్వోన్నత సుగుణ గని అయిన ఆయన సాన్నిహిత్యం, సమక్షం, ఆయనను పొందే తీవ్ర సాధన మనల్నీ అలాంటి స్థాయికి తీసుకువెళతాయి. అందుకే జ్ఞానికి, ఆయనకు అభేదం అంటుంది గీత. మరి వ్యక్తి ఒక శక్తి కావాలంటే, భగరోగ విముక్తి కావాలంటే దైవీ స్పర్శ ఉండాలి. చాలామంది అపోహ పడుతున్నట్లు ఆధ్యాత్మికత ఒక నిర్వేదం కాదు. ఒక నిరాశావాదం కాదు. ఒక నిష్క్రియత్వం కాదు. ఓడిపోయినవారు ఆశ్రయించే తీసికట్టు ఆశ్రమం అంతకంటే కాదు. అదో అభ్యుదయం. అధునాతనం. అమృతమయం. అవశ్యం అనుసరణీయం. జీవిత ప్రమాణాన్ని ఉన్నత స్థాయికి చేర్చే ఉత్తమోత్తమ మార్గం. జీవితంలో అన్ని కోణాలను విశుద్ధం చేసి, అంతరంగాన్ని విమలం చేసే మహోన్నత పుణ్యావచన జలం. అగ్నితప్తం చేసే విశుద్ధాగ్నిగుండం. తుప్పు పట్టిపోయిన ఈ పంచభూత పంచకోశ దేహ-మనోమయ ఇనుప అస్థిపంజరాన్ని స్వర్ణమయం చేసే పరుశువేది. సర్వపాపాలను సాధుసత్వంగా, తత్వంగా, సమదర్శిత్వంగా మలిచే విబూది.
భక్తి, జ్ఞానం, విశుద్ధ జీవనం, విమలతర సాధనం... ఇవన్నీ ఆధ్యాత్మికతలో భాగం. ఇవన్నీ కలిసినదే ఆధ్యాత్మికత. భగవదనురక్తే భక్తి. భక్తి పరిణతి చెందితే జ్ఞానం. ఆత్మజ్ఞాని అయిన సాధకుడికి వ్యాధి లేదు. ఇక వైద్యంతో పని లేదు. అతడే భవరోగ చికిత్సకుడై అజ్ఞానపూరితమైన ప్రపంచానికి ఆదివైద్యం ప్రారంభిస్తాడు.
- చక్కిలం విజయలక్ష్మి