ᐅసత్యవాక్కు



సత్యవాక్కు 

'మేము సత్యాన్నే పలుకుతాం. సత్యమంటే పరమాత్మ. దానికోసమే మేము వాక్కును వినియోగిస్తాం' అంటాడు మహాభారతంలో ఒక మహర్షి. సత్యనిర్వహణ చాలా కష్టమైన విషయం. పూర్వం సత్యవ్రతుడనే మహాపురుషుడు ఉండేవాడు. అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలుకుతాడు. అతనికొకసారి ఒక సమస్య ఎదురైంది. ఆయన కూర్చున్న ప్రదేశానికి ఒక జింక పరుగెత్తుకొని వెళ్లింది. దాన్ని తరుముకొని వస్తున్న వేటగాడు 'స్వామీ! ఈ వైపు జింక పరుగెత్తుకొచ్చిందా' అని అడిగాడు. సత్యవ్రతుడు నిజం చెబితే జీవహింసలో తనకూ భాగం ఏర్పడుతుంది. లేదంటే అసత్యదోషం వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా 'చూసిన కంటికి చెప్పే శక్తిలేదు. చెప్పగల నోటికి చూసేశక్తి లేదు' అని పలికి ఊరుకున్నాడు. ఆ బోయకు ఈ మాటలు అర్థంకాక వాడిదారిన వాడు వెళ్లిపోయాడు.
చక్రవర్తి హరిశ్చంద్రుడు సత్యవాక్పాలకుడై విశ్వామిత్ర మహర్షి కల్పించిన అనేక పరీక్షల్లో కష్టాలు ఎదురైనా, సత్యదీక్షను విడవలేదు. శుక్రాచార్యుడు చక్రవర్తి క్షేమంకోరి ఎప్పుడెప్పుడు అసత్యమాడవచ్చో చెప్పినా బలిమాత్రం వచ్చినవాడు వామనుడని, జరగబోయేది తన వినాశనమని తెలిసినా- సత్యమార్గం విడవకుండా మానధనులు మాటతిరగరాదన్నాడు. సత్యమహిమను వక్కాణిస్తూ భూదేవి ఎలాంటి పాపాత్ముడినైనా భరిస్తాను గాని సత్యహీనుని మోయజాలనని బ్రహ్మతో పలికిందని గురువుకు గుర్తుచేస్తాడు బలి. మహాభారతంలో శకుంతల నోటివెంట సత్యప్రాశస్త్యాన్ని గురించి మనోహరమైన వాక్కులు పలికించారు- స్వచ్ఛమైన నూరు నూతుల కంటే ఒక బావి మేలు. నూరు బావుల కంటె ఒక యజ్ఞం గొప్పది. వంద యజ్ఞాలకన్నా మంచి కుమారుడు ఉండటం మేలు. వందమంది పుత్రులకన్నా ఒక సత్యవాక్కు మేలు!

పులివాత పడుతున్న ఒక గోవు ప్రమాణంచేసి ఇంటికి వచ్చి దూడకు పాలిచ్చి మరల తిరిగివెళ్ళి సత్యసంధతకు ప్రతిఫలంగా ఆపదనుంచి బయటపడి శాశ్వతంగా సుఖాలు అనుభవించిందని 'భోజరాజీయం' కావ్యంలో ఒక నీతికథ ఉంది.

సత్యం మూడు విధాలని పండితులు చెబుతారు. మొదటిది వ్యావహారిక సత్యం. మన జ్ఞానేంద్రియాల పరిధిలోనికివచ్చే విషయాలను యథాతథంగా చెప్పడం సత్యం. ఈ చరాచర ప్రపంచమంతా సత్యమే. రెండోది ప్రాతిభాషిక సత్యం. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అసత్యమైనా సత్యాల్లా కనిపిస్తాయి. వేదాంతులు దీన్ని 'భ్రాంతి' అంటారు. తాడును చూసి పాము అనుకోవడాన్ని 'రజ్జు సర్ప భ్రాంతి' అంటారు. ప్రపంచ వ్యవహారాల్లో భ్రాంతులు కొల్లలు. నిత్యం ఎందరో భ్రాంతివల్ల మోసపోతుంటారు. మూడోది పారమార్థిక సత్యం. అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో ఒకే స్థితిలో ఉండేది 'బ్రహ్మసత్యం, జగం మిథ్య'. ప్రాపంచిక విషయాలన్నీ అసత్యమే.

'సత్యంవద ధర్మంచర' అని తైతిరీయోపనిషత్తు చెబుతోంది. సత్యవంతులు తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా చివరకు సత్ఫలితాలే పొందుతారంటోంది. అందుకే, క్షణిక సుఖాలకోసం అసత్యం పలకరాదన్నది పెద్దల మాట.

- డాక్టర్ డి.వి.సూర్యారావు