ᐅజీవితం అపురూపం





జీవితం అపురూపం 

జీవితం జీవించేందుకు. గెలిచేందుకు. గెలిపించేందుకు. అపురూపమైనవి లభించినప్పుడు అపురూపంగానే చూసుకుంటాం. గడ్డిపువ్వును పట్టించుకోని మనం గులాబీ పువ్వు దొరికితే ఆనందపడిపోతాం. అపురూపంగా చూస్తాం. జీవితం లోకంలోని అన్నింటిలోకీ అపురూపమైంది. దాన్ని ఆ ఎత్తునే స్వీకరించాలి. గౌరవించాలి. ఆస్వాదించాలి. మన రుషులు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక 'వర'సమానంగా, మహాప్రసాదంగా భావించారు. నిజానికి, జీవితంలోని ప్రతి క్షణానికి శాస్త్రమే, వేదమే ప్రమాణం. రుషులు చేసిందదే. శాస్త్రప్రమాణంతో, వేదవిహితంగా జీవించారు. అది రుషి సంస్కృతి. అదే వేదవిహిత సంస్కృతి. మరి మనం ఏం చేస్తున్నాం, మనకేది ప్రమాణం? జీవితం తాలూకు విలువల్ని తెలిపే ప్రమాణం ఏది? సమయం విలువ తెలీదు. శాస్త్రం విలువ తెలీదు. జీవితం విలువ అసలే తెలీదు.
ప్రకృతిని చూడండి. ఎంతో సామరస్యత, స్వారస్వత కనిపిస్తుంది. పరస్పర ఆధారత, పరస్పర సహకారం కనిపిస్తాయి. నిర్ణీత ఆహారం కోసం తప్ప అనవసరంగా శత్రుప్రాణిని సైతం హింసించటం కనిపించదు. ప్రకృతి, ప్రపంచం మొత్తం ఏకాత్మతా భావంతో కనిపిస్తాయి. సూర్యుడు రాగానే తామరలు తమ రేకుల కళ్లను విప్పార్చుకుని చూస్తాయి. రవికిరణాల స్పర్శతో పులకించిపోతాయి. చంద్రుడు ఉదయించగానే 'వెన్నెల జలపాతం'లో స్నానమాడుతున్నట్లు కలువలు కమనీయంగా వికసించి కలకలం చేస్తాయి. సూర్యుడు కనిపించనంత మేరా ఉదయం నించి సాయంకాలం దాకా పొద్దుతిరుగుడు పువ్వు అటే చూస్తూ ఆ దిక్కుకే ముఖాన్ని ఎత్తిపెట్టుకుని ఉంటుంది. ఎక్కడి సూర్యుడు! ఎక్కడి పొద్దుతిరుగుడు పువ్వు! ఆకాశంలోంచి జాలువారే స్వాతి చినుకు, సముద్రంలోని ఆల్చిప్ప కలసి పొదిగే ఆణిముత్యం! కాకి గూటిలో పురుడు పోసుకునే కోకిల పాపాయి! ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఉరుకులు పరుగుల పరవశాలతో వచ్చే నది, నిబ్బరంగా నిలకడగా ఉన్నచోటు నుంచే ఆకర్షించే గంభీర సముద్రం... ఈ రెంటి సంగమవైభవం! ఈ ప్రేమ, ఈ అనుబంధం, ఈ ఆత్మైక్య భావన... ప్రకృతి ప్రతి అణువులో కనిపిస్తుంది. ప్రకృతి సహజంగా అనిపిస్తుంది. మనం మాత్రమే ప్రకృతి నుంచి విడిపోయి ఉన్నాం- ముఖ్యంగా వేదవిహిత జీవనానికి విముఖంగా.

నిజమే. ఇది కలియుగం. ఇరవై ఒకటో శతాబ్దం. పూర్వంలా లేదు. ఉండదు. నేడు రోజూ నదీస్నానాలు చేయలేం. యజ్ఞయాగాదులూ సంతర్పణలూ నిర్వహించలేం. కనీసం మట్టిపొయ్యి అలికి కట్టెలతో వంట చెయ్యలేం. ఇంటి ముందు ఆవుపేడతో కళ్లాపి చల్లి ముగ్గులు వెయ్యలేం. కానీ ఎన్నో చేయవచ్చు. కేవలం మెదడుతో కాకుండా హృదయంతో బతకవచ్చు. బ్రాహ్మీముహూర్తంలో లేవవచ్చు. ఉదయం కాసేపు- షోడశోపచార పూజ కాకపోయినా- ప్రార్థన చేసుకోవచ్చు. సాత్వికాహారం తీసుకోవచ్చు. దరిద్ర నారాయణుల సేవ చేయవచ్చు... మనం రుషులం కాదు. నిజమే. కానీ రుషి అంటే ఏమిటి? జఠాధారులా, అరణ్యవాసులా? కాదు. అంతమాత్రమే కాదు. అబద్ధాలాడనివాడూ రుషే. ఇతరులకు హాని చేయనివాడూ రుషే. సామాజిక స్పృహతో జీవించేవాడూ రుషే. నిజమైన భారతీయుడిగా చరించేవాడూ రుషే. ఆధునిక జీవన విధానంతోనే అయినా జీవిత సార్థక్య దృష్టితో జీవించేవాడు రుషే. ప్రతి క్షణాన్నీ అమృతకణంగా భావించేవాడూ, భాసించేవాడూ నిజమైన రుషి.

- చక్కిలం విజయలక్ష్మి