ᐅనమ్మకం




నమ్మకం

మానవ సంబంధాల్లో నమ్మకం ప్రధానపాత్ర పోషిస్తుంది. భార్యాభర్తల మధ్య సదవగాహనకు ఈ నమ్మకమే ఇంధనం. 'మాతృత్వం నిజం... పితృత్వం ఓ నమ్మకం' అన్నది నానుడి. వయసొచ్చిన పిల్లలు బయటకు వెళ్లినా ఎంతో క్రమశిక్షణతో ఉంటారన్న నమ్మకం కన్న తల్లిదండ్రులకు ఉండాలి. వారు తమను ఎంతో ప్రేమతో పెంచుతున్నారనీ, వారి నమ్మకాన్ని వమ్ముచేయరాదన్న భావన పిల్లల్లో కలగాలి. ఈ భావనకు ఆ నమ్మకమే పునాది. ఒక సంస్థలోని సిబ్బందికీ యాజమాన్యానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అపనమ్మకం అపోహలకూ, అభద్రతాభావనలకు దారితీస్తుంది. నమ్మకమనేది ఉభయపక్షాల్లో ఉంటేనే సామరస్యం కలుగుతుంది. శ్రీరాముడు కరుణామయుడు, ఆర్తజనరక్షకుడు, శరణాగతులను నిరాశపరచడన్న నమ్మకంతోనే విభీషణుడు నిస్సంకోచంగా ఆ రాఘవుని శరణు కోరాడు. ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడడు అన్న నమ్మకం అందరిలో ఉండబట్టే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అతనితో 'అశ్వత్థామ హతః...' అనిపించాడు.
నమ్మకం పెరగాలంటే బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఈ వ్యక్తిత్వమే మనిషిని అమరుణ్ని చేస్తుంది. బలి, శిబి, హరిశ్చంద్రుడు, ప్రవరుడు వంటివారు పురాణపురుషులయ్యారు. ఆధునికకాలంలో కూడా 'అతను చస్తే లంచంతీసుకోడు... ఇతడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు... అతడు గొప్ప నిజాయతీపరుడు' లాంటి వ్యాఖ్యానాలు తరచూ వినిపిస్తుంటాయి. కుటుంబంలో, సమాజంలో ఇలాంటి నమ్మకం కలిగించాలంటే- ఎంతో సహనం, నిగ్రహం అవసరం. జీవితాంతం ఇదే సుగుణాన్ని నిలుపుకొనే దృఢదీక్ష కావాలి. ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా అదరక బెదరక నిలవాలి. ఒక్కోసారి కొన్ని ప్రలోభాలు మనిషిని భ్రమింపజేస్తాయి. కొందరు ఆ వ్యక్తిని దిగజార్చే ప్రయత్నం చేయనూవచ్చు. స్వార్థపరులు పెద్దమొత్తంలో ధనాన్ని ఎరగా చూపవచ్చు. నిజాయతీపరుడు అలాంటి పరీక్షా సమయంలోనే చలించకూడదు. ఏమాత్రం లొంగినా అతని వ్యక్తిత్వం మసకబారుతుంది. సమాజానికి అతడిపై నమ్మకం సడలుతుంది. చివరికి చెడ్డపేరు మిగులుతుంది.

- కిల్లాన మోహన్‌బాబు