ᐅత్రికరణశుద్ధి
'త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును- లోకము మెచ్చును' అంటాడు సంకీర్తనాచార్యుడు.
మనం చేసే ఏ పని అయినా మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే సత్ఫలితం కలుగుతుంది. తోటి మనిషికి మనమీద అచంచలమైన విశ్వాసం కుదురుతుంది. మనసులో మన ఆలోచన ఒక విధంగా ఉండి, నాలుక మీదకు మాటరూపంలో వేరే విధంగా వచ్చి, క్రియారూపాన్ని సంతరించుకొనేసరికి ఇంకో రకంగా ఉంటే- మనిషికి నిబద్ధత ఉన్నట్లేకాదు. మనం బతికే సమాజంలో నీతితో, నియతితో గడపాలని, సర్వవేళలా పక్కవ్యక్తికి మంచే జరగాలని కోరుకోవాలి. మన చేష్టలు జనహితం కోరేవిగా ఉండాలి. నలుగురికీ ప్రయోజనకరం కావాలి.
చరిత్రలో ఘనతను సాధించిన వారందరూ పాటించిన మార్గాన్ని సునిశితంగా పరిశీలిస్తే, మనకు ఇదే విషయం అవగతమవుతుంది. మనం చేసే పని సులభమైనదా, కష్టసాధ్యమైనదా అన్న విషయాన్ని నిర్ణయించేది పరిస్థితులు కాదు, మన ఆత్మవిశ్వాసం మాత్రమే! దృఢచిత్తంతో, త్రికరణశుద్ధితో నేను తలచిన పనిలో విజయాన్ని సాధించగలను- అన్న విశ్వాసంతో ముందడుగు వేస్తే, విజయం మనను తప్పక వరిస్తుంది. దీనికి ఉదాహరణగా సనందుడినే మనం చెప్పుకోవచ్చు.
ఆదిశంకరుల శిష్యుల్లో ఒకరు సనందుడు. ఒకసారి నదికి ఆవల ఒడ్డున గురువుగారు, మరికొందరు శిష్యులు ఉన్నారు. ఒడ్డుకు ఇవతలివైపున కొందరు శిష్యులున్నారు. గురువుగారు ఆత్రుతలో శిష్యులను ఒడ్డుకు రమ్మని కేక వేశారు. దాటడానికి పడవ లేదు. నది అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంది. సనందుడి మనసులో, మాటలో, క్రియలో ఒక్కటే నమ్మకం, విశ్వాసం- 'నదిని దాటాలి, దాటగలను, దాటుతాను'. అంతే, వడివడిగా నీటిమీద అడుగులు వేశాడు. ఆయన పాదాల కదలికలో ఉన్న వేగం, దృఢత్వంతో గురువుగారిని అత్యంత సులువుగా చేరాడు. ఇక్కడ సనందుడిలో ఉన్న గురుభక్తి కన్నా, అతని క్రియాశీలత్వంలోని స్వచ్ఛమైన త్రికరణశుద్దే అతణ్ని అవతలి ఒడ్డుకు చేర్చిందనటంలో సందేహం లేదు.
అతనో బిడియపడే, మొహమాటస్థుడైన న్యాయవాది. దక్షిణాఫ్రికాలో నల్లవారి మీద జరుగుతున్న అరాచకాలు అతని మనోధైర్యాన్ని, ఆలోచనా సరళిని కొత్తపుంతలు తొక్కించాయి. అందులోంచి పుట్టిందే సత్యాగ్రహం. ఆయనే మహాత్మాగాంధీ. సత్యాగ్రహంతో బ్రిటిష్‌వారిని సైతం గడగడలాడించి భరత జాతి స్వాతంత్య్ర సముపార్జనలో ప్రధాన భూమికను నిర్వహించి 'జాతిపిత'గా నిలిచిపోయారు. దీనికంతటికీ ప్రధాన కారణం గాంధీజీ తన జీవితాంతం మనసా, వాచా, కర్మణా తాను అనుకున్నదే పాటించారు. సదాశయంతో విజయం సాధించి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ప్రతి వ్యక్తీ త్రికరణ శుద్ధిగా తన లక్ష్యంవైపు అడుగులు వేస్తే, నిరంతర సాధనతో విజయం తప్పక వశమవుతుంది.
-వెంకట్ గరికపాటి