ᐅనరసింహుడి బ్రహ్మోత్సవాలు
దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. నిరంతరం తన నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుని అతని తండ్రి హిరణ్యకశిపుడి బారి నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి నరమృగ శరీరుడై అవతరించాడు. అందుకే ఆ అవతారాన్ని నరసింహావతారం అంటారు. మిగిలిన అవతారాలకు భిన్నంగా నరసింహావతారం రెండు ఘడియలపాటు మాత్రమే కొనసాగిందని వ్యాస భాగవతం చెబుతోంది. ఒక పరమభక్తుని కాపాడటం కోసమే అవతరించిన నరసింహుణ్ని భక్తవరదునిగా పూజిస్తారు. దాదాపు మరణం లేని వరం బ్రహ్మవల్ల పొందిన హిరణ్యకశిపుడు శ్రీహరిని సైతం ధిక్కరించాడు. వైకుంఠపురాన్నే జయించాలని ప్రయత్నించాడు. శ్రీహరిని తన విరోధిగా భావించుకొని తన రాజ్యంలో ఎవరూ హరి నామస్మరణ చేయకూడదని శాసించాడు. హిరణ్యకశిపుడికి పుట్టిన ప్రహ్లాదుడే శ్రీమన్నారాయణుడి పరమభక్తునిగా వర్థిల్లాడు. కొడుకుపైనా క్రోధం పెంచుకొని ప్రహ్లాదుని నానాహింసలకు గురిచేసి సంహరించాలని ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. వైకుంఠునికి తన భక్తుని కాపాడటం కోసం అవతరించాల్సి వచ్చింది. నరునిగా కాక, మృగంగా కాక, రాత్రి పగలు సంధికాలంలో నేలపై కాక ఆకాశంపై లేక తిన్నెపై కూర్చుని హిరణ్యకశిపుని సంహరణ జరిగింది. 'ఎక్కడరా నీ హరి' అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే- ఇందు కలడు, అందులేడనే సందేహం వద్దని ప్రహ్లాదుడు చెప్పాడు. ఆ పరిస్థితిలో అంతటా వ్యాపించి ఉన్న అంతర్యామి ఒక ఆకారం దాల్చాల్సి వచ్చింది. 'ఈ స్తంభంలో ఉన్నాడా?' అని ప్రశ్నించగానే- ఆ స్తంభంలో సాకారుడై ఉండాల్సి వచ్చింది. అలా నరసింహావతారం అకస్మాత్తుగా జరిగింది.
శ్రీనృసింహ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మనరాష్ట్రంలో అహోబిలం, సింహాచలం దేవాలయాలతోపాటు యాదగిరిగుట్టలో నారసింహుడు స్వయంభువుగా పూజలందుకొంటున్నాడు. ఈ దైవాన్ని యాదగిరిగుట్టలో ఏకశిఖర వాసుదేవుడనీ పిలుస్తారు.
యాదగిరిగుట్టలో ఒకే శిలపై వెలసిన దైవం నరసింహస్వామి! నల్గొండ జిల్లా భువనగిరికి అతి సమీపంలో ఉన్న యాదగిరి గుట్టలో ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం శుద్ధ తదియ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వైభవోపేతంగా పదకొండు రోజులు కొనసాగుతాయి. ఉత్సవ విగ్రహాలను ప్రతిరోజూ పంచభూత అధిపతులతో పాటు వూరేగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుడోత్సవం, రథోత్సవం, లక్ష్మీనృసింహ కల్యాణోత్సవాలు నయనానందకరంగా ఉంటాయి.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల ఇక్కట్లను ఈ స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తీరుస్తాడని ప్రతీతి. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సమయంలో భూమిపైని అన్ని నృసింహ దేవాలయాల అలౌకిక శక్తులు యాదగిరిగుట్టపై ఏకీకృతమై ఉంటాయని స్థలపురాణం తెలుపుతోంది. అందుకే బ్రహ్మోత్సవాల కాలంలో నరసింహుడు భక్తుల కొంగుబంగారమై ఉంటాడని ఎందరో విశ్వసిస్తారు.
త్రేతాయుగంలో రుష్యశృంగుడి కుమారుడైన యాదరుషి ఈ గిరిపైనే తపస్సు చేశాడని బ్రహ్మవైవర్త పురాణం తెలుపుతోంది. ఈ గుట్ట పవిత్రతను తెలిపి నరసింహస్వామికోసం తపస్సు చేయడానికి పవిత్రమైనదిగా సూచించింది ఆంజనేయుడనే కథ ప్రచారంలో ఉంది. యాదరుషికి ప్రత్యక్షమై మోక్షం కలిగించిన నృసింహుడు ఈ కొండపైని ఏకశిలపై లక్ష్మీసహిత నరసింహస్వామిగా అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో యాదగిరిగుట్ట నరసింహస్వామిని చూసి తరించాల్సిందే!
- అప్పరుసు రమాకాంతరావు