ᐅమనసు భద్రం




మనసు భద్రం

ధర్మమే సకల జగత్తుకీ ఆధారం అని తైత్తరీయారణ్యకం అంటుంది. అభ్యుదయాన్ని కలిగించేది ధర్మం అంటారు వైశేషికులు. వేదాల్లో చెప్పిన యాగాదులే ధర్మమంటారు మీమాంసకులు. చలనాన్ని నియతం చేసేది, గుణసంబంధం లేనిది, రూపంలేనిది, అజీవమైనది ధర్మమని రుషుల నిర్వచనం.
అసలు ధర్మమనే మాటే చిత్రమైనది. ధర్మమే ప్రజలను ధరిస్తుంది, ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దల నిశ్చయం అంటాడు మహాభారతం కర్ణపర్వంలో శ్రీకృష్ణుడు.

అతి పురాతనమైన ధర్మసారాన్ని ఏ వ్యక్తో, ఏ ప్రవక్తో కనిపెట్టలేదు. అనేక అనుభవాల నుంచి కాలం కనుగొన్న సంపూర్ణ మతమే ధర్మం. కాలక్రమంలో జనవ్యవహారంలో అనేక రూపాలు ధరించింది. వర్ణాశ్రమ ధర్మాలను ధర్మమన్నారు కొందరు. వంశాచారాలూ ధర్మమే. లోకంలో మనం పాటించే ఆచార వ్యవహారాలనే ధర్మంగా పరిగణిస్తున్నారు. లోకనీతి కూడా ధర్మం కన్న భిన్నం కాదు. న్యాయప్రవర్తన ధర్మమే. మన విధి నిర్వహించడమూ ధర్మమే. మంచి శీలం, అహింస మొదలైన గుణాలను, మనం చేసే పుణ్యకర్మలు, దానాలను ధర్మంగా వ్యవహరిస్తున్నారు.

స్థూల దృష్టికి విభిన్న అర్థాల్లో, రూపాల్లో గోచరిస్తున్నా- సూక్ష్మదృష్టి ప్రసరింపజేస్తే, ఇవన్నీ ఒకే పరమధర్మం తాలూకు రూపాలు. మనిషి మనసు విశృంఖలంగా యథేచ్ఛగా సంచరించాలనుకుంటుంది. ఇష్టంవచ్చినట్లు జీవితంలో అనుభవాలు పొందమంటుంది. ధర్మం మనసును నియంత్రిస్తుంది. ఇతరులకు హాని కలిగించని రీతిలోనే కోరికలు అనుభవించాలని శాసిస్తుంది ధర్మం. ధనం సంపాదించమంటుంది మనస్సు. కానీ న్యాయమైన మార్గంలోనే అవసరం మేరకే సంపదను ఆర్జించమంటుంది ధర్మం. అంతేకాదు- సంపాదించిన దానిలో కొంత దానం చేయాలనీ చెబుతుంది. ఇలా ధర్మం మనస్సు విచ్చలవిడితనాన్ని కట్టడి చేస్తుంది. మన సంప్రదాయంలో ధర్మానిది తొలిస్థానం. అదే, మొదటి పురుషార్థం. మనం మనస్సు అదుపులో లేకుండా మనసును మన అదుపులో ఉంచుకోవడం నీతి. నీతి కూడా ధర్మ స్వరూపమే. నీతిని తప్పకుండా ఉండటానికి అనేక సదాచారాలు ఏర్పడ్డాయి. మనోవాక్కర్మల ద్వారా మనిషి పతనం కాకుండా ఉండేందుకు మన సంప్రదాయం నీతిని నియమాలను ఏర్పరచింది. వ్యక్తిగత నీతి, సామాజిక నీతి, వాణిజ్య నీతి, రాజనీతి, యుద్ధనీతి... ఇలా మనిషి మనసును అడుగడుగునా నియంత్రించే నీతులు ఉన్నాయి. ఇతర సంస్కృతుల్లో నీతులు కేవలం భద్రత నిమిత్తం ఉంటాయి. దొంగతనం చేయరాదు, చేస్తే ఇతరులకు బాధ కలుగుతుంది, అన్నట్లుగా వారి నీతులు ఉంటాయి. కాని మన నీతులన్నీ స్వహిత దృష్టి కలిగి ఉంటాయి. ఇతరులను బాధపెడితే అది చివరకు మనల్ని బాధపెడుతుందని మన నీతి చెబుతుంది. ధర్మంవల్ల మనస్సు నియతమైఉన్నప్పుడు ఈర్ష్య, కోపం, దురాశ మొదలైనవి మనసులో చేరవు. క్షమ, కరుణ, కోపరాహిత్యం, సత్యభాషణం, ధైర్యం, ఇంద్రియ నిగ్రహం మొదలైన గుణాలు మనలో చోటు చేసుకుంటాయి. మనస్సు నిగ్రహించినవాడే జీవితంలో వచ్చే ఒడుదొడుకులను తట్టుకోగలడు!

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు