ᐅశ్రీ పంచమి



శ్రీ పంచమి 

సకల సిరులకు మూలాధారం విద్య. అలాంటి విద్యను అనుగ్రహించే తల్లి వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణి సరస్వతీదేవి. వాగ్దేవి ఆవిష్కారమైన మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమిగా జరుపుకొంటారు. శుద్ధ సత్వరూపిణి అయిన వాణిని ఆరాధించే శుభ పర్వదినం శ్రీ పంచమి. ఇదే వసంత పంచమి. సరస్వతీదేవి పరమ సాత్త్వికమూర్తి. అహింసాదేవి. వీణాపాణిని బ్రహ్మవైవర్తపురాణం అహింసకు అధినాయికగా చెబుతోంది.
శ్రీ పంచమినాడు భారతిని ఆరాధించాల్సిన విధివిధానాల్ని నారదుడికి శ్రీమన్నారాయణుడు వివరించిన వైనాన్ని దేవీ భాగవతం వెల్లడించింది. శ్వేత పుష్పాలతో వాగేశ్వరిని పూజించి, క్షీరాన్నం, నారికేళ కదళీ ఫలాలు, శుక్ల వస్త్రాలు, శ్రీ చందనాన్ని అమ్మకు సమర్పించాలి. విధాత బ్రహ్మ ఆదిశక్తిని సరస్వతీ రూపంలో దర్శించి, ఆరాధించి, ఆమె కరుణా వైభవంవల్ల సృష్టిని నిర్వహించే దక్షత పొందాడంటారు. వాల్మీకి, వ్యాసులు శారదోపాసన వల్ల మహాకావ్యాల రచన చేయగలిగారని పురాణాలు చాటుతున్నాయి.

వాగ్వాదినీ విలాసం మహిమోపేతం. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం వంటి ఉదాత్త అంశాల్ని సరస్వతి అనుగ్రహిస్తుందంటారు. 'సరః' అంటే కాంతి. కాంతినిచ్చేది సరస్వతి. అంటే విజ్ఞానమనే వెలుగుల్ని అమ్మ ప్రసాదిస్తుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థమూ ఉంది. ప్రవాహం చైతన్యానికి సంకేతం. జలం జీవశక్తికి ప్రతీక. ఉత్పాదకతకు సూచిక. ఈ ఉత్పాదక శక్తి సృష్టిలో వసంత పంచమి నుంచే ఆరంభమవుతుంది. మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘ మాసం వసంతరుతు శోభకు స్వాగత గీతిక ఆలపిస్తుంది. ఆ రుత సంరంభానికి వసంత పంచమి శుభ శ్రీకారం చుడుతుంది. ఉత్పాదకుడైన విరించి బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంతపంచమి నాడు వాగ్దేవిని ఆరాధించడం మంచిదంటారు. ప్రాణశక్తిగా, జ్ఞానదాయినిగా వేదాల్లోని సూక్తాలు శ్రీవాణిని స్తుతిస్తున్నాయి. 'ప్రణోదేవి సరస్వతీ' అంటూ రుగ్వేదం శ్రీమాతను శ్లాఘించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ రూపాల సమ్మేళన ఆకృతిగా సరస్వతి గోచరమవుతుంది.

శ్రీ అంటే సంపద. సరస్వతీ ఆరాధనం వల్ల అజ్ఞాన తిమిరం పటాపంచలవుతుందంటారు. వసంతోత్సవాల ఆరంభ సూచకంగా నిర్వహించే శ్రీ పంచమిని రతికామ దినోత్సవంగానూ వ్యవహరిస్తారు. రుతురాజు అయిన వసంతానికీ, కాముడికీ అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు సేవించడంవల్ల వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు వర్ధిల్లుతాయని చెబుతారు. జీవన మార్గాన నవ్యకాంతికి, శోభకు ప్రతిఫలనం... శ్రీ పంచమి పర్వదినం.

- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్