ᐅమోహనాశం
ఉండటం ఎంత సహజమో, లేకపోవడమూ అంతే సహజం. కానీ ఉన్నది అనిపించినప్పుడు సంతోషించడం, లేదనిపించగానే దుఃఖించడం మానవనైజం. నిజానికి శాశ్వతంగా ఉండేది ఏదని ప్రశ్నించుకుంటే 'ఏదీకాదు' అనే సమాధానం వస్తుంది ఆలోచిస్తే. దేహం, జీవం, సంసారం, బంధనాలు, సంపదలు, సంపాదనలు లాంటివన్నీ మిథ్యేనని తేలుతుంది. 'లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనిపించడమే' మిథ్య. దీనికి మరోపేరు మాయ. ఆ మాయనే నిజమనుకుని మోహంలో పడుతుంటారు. దానివల్లనే రాగద్వేషాలకు లోనవుతుంటారు. వాటి ఫలితం దుఃఖం. మోహాన్ని వీడితేనే దుఃఖానికి అతీతులవుతారు.
ఒకచోట ఇంటిల్లపాదీ దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. అటుగా వెళుతున్న గౌతమబుద్ధుడు ఆ ఇంటిలో అడుగుపెట్టి 'ఎందుకు ఏడుస్తున్నారు?' అని అడిగాడు. ఆ ఇంటిలో ఇటీవలే జన్మించిన బిడ్డ, పురిటిరోజులైనా తీరకముందే మరణించాడని చెప్పారు వారు. 'మీలో ఎవరైనా చావు సంభవించని ఇంటిలోనుంచి చిటికెడు ఆవాలు తీసుకురండి. మంత్రించి చల్లుతాను. మీ బిడ్డడు ఇట్టే బతికిలేస్తాడు' అన్నాడు బుద్ధుడు. 'ఆవాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. చావు సంభవించని ఇల్లు ఎక్కడ దొరుకుతుంది' అని వెంటనే స్ఫురించింది వారికి. వారందరినీ ఆవరించిన మాయ దానంతట అదే తొలగిపోయింది. ముఖ్యమైన వ్యక్తులు మరణించడంవల్ల ఎందరో, ఎన్ని విధాలుగానో బాధపడ్డారు. ఆ నష్టం అలాగే కొనసాగిందా? లేదు. ఆ స్థానాల్ని భర్తీచేస్తూ మరొకరు తయారవుతూనే ఉన్నారు. వారి పాత్ర ముగిసిపోగానే వారూ సమసిపోతున్నారు. నిరంతరంగా సాగే ఈ చర్యనే వ్యావహారిక సత్యం అంటారు.
'వచ్చినప్పుడు ఏమి తీసుకువచ్చావని పోయినందుకు బాధపడతావు? పోయినప్పుడు ఏది తీసుకుపోగలుగుతావని ఇంతలా ఆత్రుతపడుతున్నావు?' ఈ రెండు ప్రశ్నలూ ఎవరికివారు వేసుకుంటే దుఃఖానికి కారణమైన అజ్ఞానం తొలగిపోతుంది. దీన్నే ప్రాతిభాసిత సత్యం అంటారు. కలలో కనిపించే దృశ్యాలు, తెరపై కనిపించే అందాలు, ఒకదాన్ని చూసి మరొకటిగా భ్రమపడటం ఇవన్నీ ప్రాతిభాసిత సత్యాలే. నిజానికి అది సత్యంకాదు. అలా భ్రమింపజేస్తుంది. అది భ్రమ మాత్రమే అని తెలుసుకుని మనగలిగితే ప్రశాంతత చేకూరుతుంది.
ఒక బాటసారికి దారిలో ఒక మూట కనబడింది. నిర్మానుష్యమైన బాటలో కనబడిన మూటలో ఏముందోనని తీశాడు. బంగారు నాణాలు కనిపించాయి. వాటితో ఏమేం చేయాలో మనసులోనే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇంతలో ఆ మూట పోగొట్టుకున్న వ్యక్తి మూట ఆనవాళ్ళు చెప్పి ఇమ్మన్నాడు. అయిష్టంగానే ఇచ్చాడు. తరవాత రకరకాలుగా ఆలోచించి బాధపడ్డాడు. ఆ ఆలోచనల పరంపరలోనే వచ్చిన మరో ఆలోచన- దాన్ని సంపాదించడానికి తానేం కష్టపడ్డానని? అనిపించింది. ఒకవేళ అది తనకు దొరికి ఉండకపోతే... అప్పుడు ఈ బాధే ఉండేదికాదు కదా అనిపించింది. ఆ ఆలోచన వచ్చాక మనసు స్థిమితపడింది. దీనినే గౌడపాదుడు (శంకరాచార్యుల గురువు) 'జాగ్రత్‌స్వప్నం' అన్నారు. లోకరీతి చాలావరకు ఇలాంటిదే. సంపదలు, సంసారం, గౌరవ ప్రతిష్ఠలు, విలాసాలు, సౌకర్యాలు వద్దనుకున్నా సమకూరతాయి. 'అన్నీ అవసరమైనవేనా?' అని ప్రశ్నించుకుంటే స్ఫురించే సమాధానం, అనవసరమే అని. ఈ విషయాన్ని తెలుసుకోవడాన్నే 'పారమార్థిక సత్యజ్ఞానం' అంటారు. దాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఆది శంకరాచార్యులు 'బ్రహ్మసత్యం-జగన్మిథ్య' (ప్రపంచమంతామిథ్య- బ్రహ్మమేసత్యం) అన్నారు. అంతటి జ్ఞానసంపన్నులు కనుకనే బ్రహ్మం గురించి చక్కని విశ్లేషణ ఇచ్చారు. సర్వకాల సర్వావస్థల్లోను కాదనలేనిది, లేదనడానికి వీలులేనిది; పరిమితి, సంకుచితత్వం, వివాదం లేనిది' ఎవరి ప్రమేయం లేనిది (అప్రమేయమైనది) స్వతంత్రమైనదీ బ్రహ్మం. ఆ బ్రహ్మం కోసం అన్వేషణ సాగించాలంటే సూక్ష్మదృష్టి కావాలి. రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు దృష్టిపథంలో పడేది వేరు. నిజానికి చూడాలనుకునేది వేరు. అలాంటప్పుడు దృష్టిపథంలో పడినదానినంతా కాకుండా, తనకు అవసరమైనదానిమీదే మనసు కేంద్రీకరించాలి. అలా... అలా... సూక్ష్మస్థితికి వచ్చాక ఒకానొక కేంద్రానికి చేరాక దానిమీద మనసు నిలపగలగాలి. అలా నిలపగలిగినప్పుడు గోచరమయ్యేదే శుద్ధమైన సత్యం. అదే సూక్ష్మదృష్టి. అదే బ్రహ్మం. అప్పుడు ఎన్ని, ఏమి, ఎంత ఉన్నా, కావాలనిపించేది ఏదీ ఉండదు. అదే బ్రహ్మజ్ఞానం.
- అయ్యగారి శ్రీనివాసరావు