ᐅఈ సృష్టిలో అంతా సమానులే!
ఒక ఇంటి కిటికీ పక్కనే మూడు చెట్లున్నాయి. ఒక చెట్టు ఉండటం వరమని, రెండు చెట్లు ఉండటం దైవకృప అని, మూడు చెట్లు ఉండటం ఒక అద్భుతమని ఆ ఇంటి ఇల్లాలు అనుకుంది. ఒకరోజున ఆమె కిటికీ పక్కన తన దొడ్లో అలాంటి భాగ్యం ప్రసాదించినందుకు దైవానికి కృతజ్ఞత తెలుపుకొంటూ నిలబడింది. అప్పుడే ఆ చెట్లు తమలో తాము మాట్లాడుకోవటం ఆమెకు వినిపించింది.
తన ఆకులు పెళుసుగా ఉంటాయని, కొమ్మలనిండా ముళ్ళుంటాయని, తాను అందవికారంగా ఉంటానని, తనకు పూలు పూయవని, కాయలు కాయవని, తానెందుకూ పనికిరానని వాపోయింది కసివింద చెట్టు. 'నువ్వెంతో అదృష్టవంతురాలివి. వసంత కాలంలో నీ పూలు పుష్పిస్తాయి. నీ పళ్లను పక్షులు ప్రియమార ఆరగిస్తాయి. నీవల్ల మనుషులకు ఔషధాలు తయారవుతాయి. ఈ సృష్టిలో నీ అంత విలువైనది మరొకటి లేదుకదా' అని వేపచెట్టుతో అంది.
కసివిందవైపు జాలిగా చూసి 'నువ్వలా బాధపడకు. పిచ్చుకలకు నీవల్ల ఎంతో లాభం. నీ చెట్టుకొమ్మల మీదనే అవి గూళ్ళు కట్టుకుంటాయి. వాటికి నువ్విస్తున్నంత రక్షణ మరేచెట్టూ ఇవ్వలేదు. నీ ముళ్ళే గద్దలనుంచి వాటిని కాపాడుతున్నాయి. నీ ఆకులే ఆ పిచ్చుకలకు మంచి ఆహారం. ఒంటెలకు నీ రసం అమృత సమానం. నీ గొప్పతనం నీకు తెలియదు' అంది వేపచెట్టు.
వేప ఎంత సముదాయించినా తన దీనస్థితికి, వాస్తవంలో తనకు మనుషులనుంచి కలుగుతున్న నిరాదరణకు సమాధానపడలేదు కసివింద. వేపగురించి మనుషుల మెప్పు వింటోంది కనుక, తన గొప్పతనం గురించి ఊహించుకోలేకపోయింది.
'కసివిందా! నన్నుచూసి అసూయపడకు. మండుటెండల్లో కూడా వాడిపోకుండా నిటారుగా నిలబడగల శక్తి నీకొక్కదానికే ఉంది. దానికి నువ్వెంతగా గర్వపడాలని! ఇదంతా నీ మానసిక స్త్థెర్యం ప్రసాదించిన వరం!' అంది.
వీటి సంభాషణ వింటున్న బూరుగుదూది చెట్టు 'నా ఉపయోగమెవరికుంది? నా కొమ్మలు నల్లగా ఉంటాయి. నా పూలు ఏప్రిల్, మే నెలల్లో తప్ప మరెప్పుడూ పుష్పించవు. ఎండలు ముదిరితే నా మృదుత్వం హరించిపోతుంది. కసివింద, పిచ్చుకలకైనా ఉపయోగపడుతుంది. నేనెవరికి పనికివస్తాను? నాకు బతికే హక్కులేదు' అని వాపోయింది.
'ఎందుకలా దిగులు పడతావు? అందానికి ప్రతీకవని నువ్వు గ్రహించటంలేదు. నువ్వు చిత్రకారుడికి స్ఫూర్తి. వర్ణచిత్రాల్లో నీ కొమ్మలు ఆకాశంవైపు చూస్తూ పిల్లలకు ఎంతో ఆనందాన్నిస్తాయి. చేతులెత్తి దైవాన్ని ఆరాధిస్తున్నట్టు నీ కొమ్మలొక్కటే పైకి మొనతేలి ఉంటాయి. నీ కళ్ళు కాటుక పెట్టినట్టుంటాయి. నీ రెప్పలపై మంచు కురిసినట్టు మెరుస్తుంది. నీ కాయలు ఎర్రని పెదవుల్లా ఉంటాయి. నీ వేదన అంతా వానకోసం నువ్వుపడే ఆరాటమే. ఆ సమయం రాగానే నీవు స్వర్గపుటంచుల్ని అందుకుంటావు. ఇంతకన్న నీకేం కావాలి?' అంది వేప.
వీటి సంభాషణ వింటున్న భూమాత అనుకుందట- 'మీరంతా నా అపురూప సంతానం. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఈ ప్రకృతికి సౌందర్యాన్ని చేకూరుస్తున్నారు. ప్రయోజనాన్ని సమకూరుస్తున్నారు. భగవత్ప్రసాదితమైన ఈ అద్భుత సృష్టికి పరిపూర్ణత సంతరింపజేయటంలో మీరంతా సమభాగస్తులే! ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదు!'
- తటవర్తి రామచంద్రరావు