ᐅసత్సంప్రదాయాల సంవత్సరాది
సంవత్సర కాలగణనలో ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ వారి వారి పద్ధతుల్ని ఏర్పరచుకున్నాయి. భారతదేశంలో ప్రధానంగా ఒకే సనాతన సంస్కృతి ఉన్నప్పటికీ, ఆచారవ్యవహారాల్లో సంప్రదాయాల్లో కొద్దిపాటి భేదాలు కనిపిస్తుంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశంలో కొన్ని వైవిధ్యాలున్నా- ప్రధాన జ్యోతిశ్శాస్త్రం, గణనసూత్రం ఒక్కటే.
ఉత్తరాదిలో బార్హస్పత్యమానం, దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చాంద్రమానాన్ని అవలంబిస్తారు.
చంద్రమానం ప్రకారం చైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తయ్యే సంవత్సరానికి ఈరోజు (చైత్రశుద్ధ పాడ్యమి) ఆది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. 'ఉగం' అంటే 'నక్షత్ర గమనం' అనే అర్థం ప్రకారం ఏడాదిని 'ఉగం'గానూ, దాని తొలిదినాన్ని 'ఉగాది'గానూ వ్యవహరిస్తారు. అదేవిధంగా రెండు అయనాలు ఉన్న సంవత్సరాన్ని 'యుగం' అంటే, మొదటిరోజున 'యుగాది' అనవచ్చు. దాన్ని 'కల్వాది'గా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ తిథినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని వాటి కంఠోక్తి. వసంత రుతువులో 'తొలి'తనం, శిశిరంలో 'చివరి' లక్షణం ప్రకృతిలో ప్రత్యక్షమయ్యే గమనం. ఈ రెంటి నడుమ ఏడాదికాలాన్ని పరిగణించడం చక్కని ప్రాకృతిక సమన్వయం. అరవై సంవత్సరాల పేర్లు సూర్య విజ్ఞానాన్ని సూచిస్తున్నవే.
ఈ 'ఖర' వత్సరానికి రుద్రుడు అధిదేవత- అని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. శుభాశుభ మిశ్రమమే జీవితం. జీవితాన్ని నడిపే కాలానిదీ ఇదే లక్షణం. అయితే మంచి సంకల్పాలతో, మంచి క్రియలతో ఏడాది తొలిని స్వాగతిస్తే, ఆ సంవత్సర కాలం శుభంగా పరిణమిస్తుందనే శాస్త్ర, సంప్రదాయాల్లోని 'సద్భావనాసూత్రా'న్ని అభినందించి, ఆదరించి, ఆచరించవలసిందే. యుగాల గణనం నుంచి అత్యంత సూక్ష్మకాలం వరకు లెక్కించగలిగే, అద్భుతమైన జ్యోతిర్విజ్ఞానం మనకు అనాది నుంచి అనూచానంగా వస్తున్నది. గ్రహ నక్షత్రాదుల భౌతిక అస్తిత్వంతోపాటు, వాటివలన సమస్త జీవరాశిపై ఉన్న సూక్ష్మప్రభావాలని నిశితంగా పరిశోధించి, ఆ శోధన (తపః)ఫలంగా జ్యోతిర్విజ్ఞానాన్ని అత్యంత ప్రాచీనకాలంనాడే ఏర్పరచుకొంది భారతజాతి.
ఆ శాస్త్రప్రకారంగా- తిథి, వార, నక్షత్ర, యోగి, కరణాలు- కేవలం కాలవిభజనలోని సౌకర్యం కోసం ఏర్పడినవేకాక, వాటికి ప్రత్యేక అధిదేవతలున్నారనీ, వాటి స్మరణవలన శుభప్రభావాలుంటాయనీ సంప్రదాయం.
సంవత్సరఫలాన్ని ముందే సూచనప్రాయంగా తెలుసుకోవాలనే, మానవసహజమైన కుతూహలాన్ని, వివిధ పంచాంగాలు ఎన్నోరకాలుగా సంతృప్తిపరుస్తున్నాయి.
కాలాన్ని సూర్యోదయాదులబట్టి ఒక దినంగా స్వీకరించి, దాన్ని ఆధారం చేసుకునే పక్ష, మాస, అయన, సంవత్సరాలను ఏర్పరచుకున్నాం. రుతుచక్రం సంపూర్తి జరిగే కాలాన్ని ఆధారంగా 'సంవత్సరా'న్ని స్వీకరించాలి. ఆ రుతువుల మార్పుల్లో జరిగే రెండు (మంచి, చెడు) పరిణామాలు మనకు, మన పరిసరాలకు శుభంగానే పరిణమించాలని కోరుకోవడం చక్కని శుభాకాంక్ష. ప్రభవాది అరవై సంవత్సరాల్లో 25వదైన ఈ 'ఖర' తీవ్రతను సూచించినా, చెడును పోగొట్టే తీవ్రతను స్వాగతించవలసిందే. బ్రాహ్మీ ముహూర్తం(తెల్లవారుజామున)లో నిద్రలేచి, కాలకృత్యాల అనంతరం విధిగా 'అభ్యంగ స్నాన'మాచరించాలని శాస్త్రం నిర్దేశిస్తున్న ఉగాది ఆచారం. నూతన వస్త్రాలను ధరించి, నిర్మల శుభ్ర వాతావరణంలో దీపజ్యోతిని వెలిగించి, ఆనందకరమైన మనసుతో, ప్రసన్నవదనంతో విఘ్నేశ్వరుని, ఇష్టదేవతలను పూజించి, పంచాగాన్ని పఠించడమో, శ్రవణం చేయడమోచేసి, ఆపై 'నింబసుమా'న్ని (వేపపూత) తినాలనీ ఉగాది విధులలో చెబుతారు. ఈ పంచాంగ శ్రవణంతో, భగవదర్చన వలన- శుభయోగాలు లభిస్తాయని ఆర్షవచనం.
వేపపూత, బెల్లం, నేయి, (మామిడి) పులుపు... కలబోసిన ప్రసాదాన్ని (పచ్చడిని) 'పూర్వయామం' (మొదటిజాము)లోనే స్వీకరించాలనీ, ఇది సౌఖ్యదాయకమనీ, యజ్ఞఫలాన్ని ప్రసాదిస్తుందనీ పురాణ శాస్త్రోక్తి.
- సామవేదం షణ్ముఖశర్మ