ᐅఅజాత శత్రువులమవుదాం



అజాత శత్రువులమవుదాం! 

మానవుడు ఈ ప్రపంచంలో సర్వదా తన శుభమే కోరుకుంటాడు. ఎదుటివారి శుభం కూడా కోరుకోవడం తనకు మరింత శ్రేయస్కరమనే సత్యాన్ని చాలామంది గ్రహించడంలేదు. లోకకల్యాణాన్ని కాంక్షించేవాడు ఆత్మతత్వాన్ని అతి శీఘ్రంగా అవగాహన చేసుకోగలుగుతాడు. 'జీవించు, జీవించనివ్వు' అన్న ఆర్ష సిద్ధాంతానికి తమ జీవిత సర్వస్వాన్నీ ధారబోసిన మహానుభావులు ఆవిర్భవించిన పుణ్యభూమిలో జన్మించడం మన సుకృతం.
అశరీరం, మహాంతం అయిన ఆత్మను అర్థం చేసుకున్న ధైర్యశాలికి జీవితంలో పరితాపమే ఉండదు. ఇతరులకు మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి లభిస్తుంది. అపకారికి కూడా ఉపకారమే చేయాలని భారతీయ ఆర్ష సంస్కృతి ఒక మహోన్నత సందేశాన్నందిస్తోంది. మనకు అపకారం చేసినవారికి తిరిగి ఉపకారమే చేయాలి. అతని అపకారానికి తగిన ప్రాయశ్చిత్త ఫలితమెలాగూ అతడు అనుభవించి తీరవలసిందే. తన సుఖంకోసం, తన స్వార్థం కోసమే జీవించేవాడు భూమికి భారమవుతాడు. ఇతరులకు తినిపించడంలోను, వాళ్లను నవ్వించడంలోను, వాళ్ల సుఖశాంతులకై యత్నించడంలోను ప్రాప్తించే ఆనందానుభూతి వర్ణనాతీతం. సుఖం ఆదిభౌతికమైనదైతే, ఆత్మానందం ఆధ్యాత్మికమైనది. తనవంతు ధర్మాన్నీ, బాధ్యతనూ, కృషినీ విస్మరించి- కీర్తి ప్రతిష్ఠల కోసం పైకం వెచ్చిస్తూ వెంపర్లాడేవాడు సచ్చిదానందలోకానికి దూరమైపోతాడు. సర్వులకూ సుఖశాంతులు కలగడం కోసం నిష్కామ దేవతార్చన చేయాలి. ధర్మపరిపోషణ చేయాలి. 'దుష్కర్మలకు స్వస్తి పలకనివాడు ఇంద్రియ సంయమనం లేనివాడు ఏకాగ్రత లేనివాడు అశాంత మనస్కుడు ఎంతటి విజ్ఞాని అయినా ఆత్మజ్ఞానం పొందలేడంటోంది భగవద్గీత. 'నీవు ఎవరికోసం?' అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు- నేను నా కోసమే కాదు, పరుల కోసం కూడా అన్న సమాధానం చెప్పుకోగలవాడే ఈ నేల మీద జీవించడానికి అర్హుడు. అటువంటివాడు ఎప్పుడూ తనకున్నదానితోనే సంతృప్తి చెందుతూ, అదనంగా ఉన్నదాన్ని ఇతరులకు వితరణ చేస్తాడు. సంతృప్తిని మించిన సంపదేలేదు లోకంలో. తృప్తి చెందక మహేంద్రుడు, విశ్వామిత్రుడు, రావణుడు, కైక, శూర్పణఖ, మొదలైనవారెంతటి అపఖ్యాతి మూటకట్టుకున్నారో సర్వవిదితమే! సంతృప్తి చెందినవాడి దగ్గరికి నారికేళంలో నీరు చేరినట్లు సంపదలు తమంతట తామే వరించి దరిచేరతాయన్నది పెద్దలమాట.

ఒక భక్తుడు ఓ ముని దగ్గరికి వెళ్ళి 'స్వామీ! నేను రోజూ భగవంతుణ్ని పూజిస్తాను, ప్రార్థిస్తాను. అయినా నాకు సుఖశాంతులు లభించడం లేదేమిటి?' అని అడిగాడు. అందుకాముని 'నీవు ప్రార్థన చేస్తూ దేవుణ్ని ఏం కోరుకుంటావు?' అని ప్రశ్నించాడు. 'నాకు ధనమిమ్మనీ, నా కుటుంబాన్ని సుఖంగా ఉంచమనీ, పేరు ప్రఖ్యాతులిమ్మనీ కోరుకుంటాను' అని బదులిచ్చాడా భక్తుడు.

అప్పుడాముని 'నీ భక్తి కుటిలమైనది. స్వార్థపూరితమైనది, నీకేమివ్వాలో తెలియనివాడా భగవంతుడు? పరులంతా సుఖంగా ఉండాలని కోరుకో, లోకకల్యాణం కోరుకో, అందరినీ ప్రేమించే, సేవించే శక్తి కావాలని కోరుకో! అదే నీ ధర్మం. అలాంటి సంకల్పాన్ని బలంగా మనసులో నిలుపుకొని పరోపకారం చెయ్యి. సుఖపడతావు' అని హెచ్చరించాడు.

భక్తుడికి జ్ఞానోదయమైంది. నిస్వార్థంగా పరులను ప్రేమించేవాడు, సేవించేవాడే ఈ లోకంలో అసలైన అజాత శత్రువు. మనమంతా అజాత శత్రువులం కావాలని అంతర్యామిని అర్థిద్దాం!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి