ᐅగురు 'పరమహంస'




గురు 'పరమహంస' 

ఒక ఆదర్శ ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏ విధంగా ఉంటాడు అనే ప్రశ్నకు సరైన సమాధానం రామకృష్ణ పరమహంస (క్రీ.శ. 1836- 1886). నరేంద్రుడిని వివేకానందుడిని చేసి అతని ద్వారా మన సనాతన భారతీయ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు రామకృష్ణ పరమహంస.
'నరేంద్రా! నేడు నా ఆధ్యాత్మిక శక్తి సర్వస్వాన్ని నీకు ధారపోసి నేను ఆధ్యాత్మిక సంపద్విహీనుడనయ్యాను' అన్న పరమహంస పలుకులు ఆయన త్యాగశీలానికి, శిష్యుడి పట్ల అభిమానానికీ, అతని శక్తియుక్తుల పట్ల విశ్వాసానికీ పరమ నిదర్శనాలు.

'శంకరాచార్యుడి అఖండ ధీశక్తి, చైతన్యదేవుడి వినిర్మల ప్రేమ, బుద్ధ భగవానుడి సర్వజీవ కారుణ్యమూ ఏకమై గురుదేవుని రూపం దాల్చా'యన్నాడు వివేకానందుడు. ప్రతి గురువు ధీమంతుడై ఉండాలి. శిష్య వాత్సల్యం కలిగి, కారుణ్యమూర్తిగా ఉండాలని దీని తాత్పర్యం.

పరమహంసలోని గొప్పతనమంతా వివేకానందుడి లాంటి శిష్యుడిని తయారుచేయటంలోనే ఉన్నది. 'అసలు దేవుడనేవాడున్నాడా? మీరు స్వయంగా చూశారా?' అని నరేంద్రుడు అడిగితే 'ఉన్నాడు, నేను చూశాను. నీకు చూపిస్తాను' అని చెప్పి అతడికి ఆశ్చర్యకరమైన భగవదనుభూతిని కలిగించిన దివ్యశక్తి సంపన్నుడాయన. శిష్యులకు సందేహ నివృత్తితోపాటు విషయానుభూతిని కలిగించినవాడే సద్గురువు కదా!

ఒకసారి వివేకానందుడు పూటకూటి ఇంటి భోజనం చేసి అది పాపకార్యం కదా! అని బాధపడుతుంటే- రామకృష్ణుడు 'కాదుగాక కాదు. నీవు నిత్యసిద్ధుడివి; ధ్యాన సిద్ధుడివి. నీలో జాజ్వల్యమానంగా వెలుగుతున్న జ్ఞానాగ్ని దహించజాలని అపరిశుద్ధాహారం లేదు. పూటకూటి ఇంటి భోజనం కాదు; గోమాంసం తినినప్పటికినీ నీకు ఈషణ్మాత్రమైనా దోషమంటదు' అన్నాడు. అనతికాలంలో మహోన్నతమైన ధర్మకార్య భారాన్ని భుజాన వేసుకొని దేశంకాని దేశానికి వెళ్లబోతున్న వివేకానందుడికి అటువంటి ఆత్మస్త్థెర్యాన్ని అందించటం ఎంతో అవసరం! అదే చేశాడు పరమహంస.

కామినీ కాంచనాలను రెండింటినీ జయించిన ఇంద్రియ నిగ్రహం పరమహంసది. అరిషడ్వర్గాలకు ఆమడ దూరంలో ఉండటమే ఆదర్శ అధ్యాపకుడి కర్తవ్యమని ఆయన సందేశం.

నరేంద్రుడు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న రోజుల్లో రామకృష్ణుడు 'ఓయీ! నీకోసం ఏ పని చేయడానికైనా నేను సంసిద్ధమే... అవసరమైతే ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుతా' అన్నాడు. శిష్యుడి పట్ల ఏ ఆచార్యుడికైనా అంతటి ప్రగాఢమైన ప్రేమ ఉండాలి.

వంద కోణాల వజ్రం పరమహంస జీవితం. అపారమైన పాల సముద్రం పరమహంస జీవితం. ఇప్పుడు మనం చూసింది ఒక్క కోణాన్నే, ఒక్క బిందువును మాత్రమే! విద్య, వైద్యం, న్యాయం, కళ- ఏ రంగంలోని ఆచార్యుడైనా సరే... ఆ పరమహంస జీవితంనుంచి త్యాగం, శిష్యవాత్సల్యం, సర్వజీవ కారుణ్యం, అరిషడ్వర్గ విజయం మొదలైన అంశాలను గ్రహించాలి. చిచ్చరపిడుగు లాంటి పావన నవజీవన బృందావన నిర్మాతల్లాంటి శిష్యులను తయారుచేయాలి. అదే ప్రతి ఒక్క అధ్యాపకుడి ఆశయం కావాలి.

- డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి