ᐅఅయోధ్య - రాముడు
శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి- ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు- తాత్విక దృష్టి, ఈ మూడింటి భావాలతో శ్రీరాముని అవతారకార్యం నడిచింది.
మానవ జీవన సరళిని మహోన్నతంగా మలచే 'ధార్మికత' మంత్రమయ భక్తిభావనతో పునీతులను చేసే 'ఉపాసనారీతి'పరమార్థతత్వాన్ని పట్టిచ్చే 'తాత్వికత'లు శ్రీరామునిలో మూర్తీభవించాయి. వ్యక్తి సాధించవలసిన అనేక ధర్మాల్లో ఒక్కొక్క సందర్భంలో పరస్పర ఘర్షణ ఏర్పడుతుంది. ఒక ధర్మాన్ని నిలిపేటప్పుడు, మరోధర్మం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదాన్ని మరోదానితోఎలా సమన్వయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలి అనేది 'సూక్ష్మధర్మం'. అది తెలియడమే ధర్మసూక్ష్మం. ఆ సూక్ష్మజ్ఞానమే రాముడి వ్యక్తిత్వం. పాలనా ధర్మరక్షణ, వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ... రెండింటికీ పొంతన కుదరనప్పుడు దేనికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు.... దశరథ రామునిగా, సీతారామునిగా, అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించాడు.
శ్రీరాముడు కౌమారదశనుంచే తన రక్షణ స్వభావాన్ని ప్రకటించాడు. అధర్మాన్ని శిక్షించడంలో కాఠిన్యం, ధర్మ రక్షణలో కారుణ్యం... ఈ రెండింటి పొందిక శ్రీరాముడిలోని కరుణ వీర రస సమన్వయం. ప్రసన్న, ప్రతాప మూర్తిమత్వం. యువరాజయ్యే అర్హత కలిగిన వయస్సులోనే శ్రీరాముని దివ్యగుణాలకు అయోధ్య వాసులు ఆకర్షితులయ్యారు. ఆరాధించారు. ఆ దశలోనే రామచంద్రుడు వారి బాగోగులను గమనించడం, తండ్రి తనయులను ఆదరించినట్లుగా మన్నించడం... ఇవన్నీ ఉత్తమ పాలక స్వభావాలను స్పష్టం చేశాయి. ఒకవైపు పూర్వీకులనుంచి అనుసరిస్తున్న పటిష్ఠమైన ధర్మపరంపరకు రాముని ప్రత్యేకత తోడయ్యింది.
యుక్తవయసు రాగానే- వ్యవహారంగా దశరథుడు పాలకుడైనా, ప్రజల మనసుకు మాత్రం రాముడే ప్రభువు. అది గమనించే దశరథుడు యువరాజ్య పట్టాభిషేకానికి నిర్ణయించుకున్నాడు. జగద్రక్షణకై, వనవాసం నెపంతో రాముడు రాజ్యాన్ని త్యజించాడు. ఆ సమయంలో అయోధ్య కన్నీరు మున్నీరయ్యింది. రాముని వదలలేక అయోధ్యలో అనేకమంది ఆయన వెంటవెళ్లారు. వెళ్లే అవకాశంలేనివారు కేవలం శరీరాలే అక్కడ మిగిలినట్లయ్యారు. వెనక్కివచ్చిన వారితో ఇంటివారంతా 'రామునివదలి, రాముడులేని రాజ్యంలో ఏం సాధిద్దామని వచ్చారు?' అని వాపోయారు. 'అయోధ్యలో చరితార్థుడైన సత్పురుషుడు లక్ష్మణుడు మాత్రమే. అతడొక్కడే రామునితో వెళ్లాడు. రాముని వదలనివారే సత్పురుషులు' అని తీర్మానించుకున్నారు. బీడు పడ్డట్టుగా అయింది అయోధ్య.
శ్రీరాముని తిరిగి అయోధ్యకు రప్పించి రాజ్యాన్ని అప్పగించాలనుకున్న తన ప్రయత్నాలు వ్యర్థమయ్యాక, పాదుకలు తీసుకుని అయోధ్యకు చేరాడు భరతుడు. శ్మశానసదృశంగా గోచరించడంతో, భరతుడు అయోధ్యను వీడి నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం చేశాడు. అక్కడినుంచే అయోధ్యను పాలించాడు. తిరిగి రాముడు వచ్చాకే అయోధ్యకు కళ వచ్చింది.
'అయోధ్య' అంటేనే 'ఇతరులు (శత్రువులు) దెబ్బ తీయలేనిచోటు' అని అర్థం. సాకేతం- అంటే 'జ్ఞానస్థలం' అని ప్రధానార్థం, శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం. ఆ మానసంలో దుర్గుణాలనే అంతశ్శత్రువులు ప్రవేశించలేవు కనుక అదే 'అయోధ్య'. అది జ్ఞానమయస్థానం కనుక అదే 'సాకేతం'. అందుకే రామభక్తులు 'రాముని వారము మాకేమి విచారము' (రామదాసు) అని ధీమాగా పలుకుతారు. 'తక్కువేమిమనకు రాముండొక్కడుండు వరకు' అని నిర్భయంగా కీర్తిస్తారు. 'సీతమ్మ మాయమ్మ- శ్రీరాముడు మాకు తండ్రి' అని (త్యాగయ్య) తృప్తిగా జీవిస్తారు.
- సామవేదం షణ్ముఖశర్మ