ᐅభావన

 ᐅభావన 

అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు... మరెందరో భక్తిమార్గంలో ఆదర్శప్రాయులు. వాళ్లది సగుణోపాసన. అన్నమయ్య వేంకటేశ్వరుని, తక్కిన ఇద్దరూ సీతారాముల్ని ఉపాసించారు. ఆ ఆరాధ్యదేవతలను అనుక్షణం స్మరించారు, కీర్తించారు, తరించారు.
ఒక విగ్రహం... అది శిల కావచ్చు, దారువు కావచ్చు, లోహం కావచ్చు. షాడ్గుణ్యుడు (జ్ఞాన బల వీర్య ఐశ్వర్య శక్తి సంపదలు కలవాడు) అయిన పరమాత్మ ఆ చిన్ని రూపంలో దర్శనం ఇవ్వగలడు. అది మన భావన మీద, జన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.

కుచేలుడు తీసుకెళ్లిన అటుకులు పది పైసలు విలువ చేయవు. కాని, ముక్కిపోయిన ఆ అటుకుల్లో ఆర్ద్రత ఉంది. రుక్మిణి చేతిలోని తులసిదళం ఏమంత బరువు?అయితే ఏం- ఆ దళంలో భక్తి సమ్మిళితమై ఉంది. చతుర్దశ భువన భాండాల్ని భరిస్తున్న పరమేశ్వరుని ఆ చిన్ని తులసి ఆకు తూచగలిగింది.

గంగానదిలో స్నానానికి దిగాడు ఒకడు. రెండు పరమాణువుల ఉదజని, ఒక పరమాణువు ఆమ్లజని కలిస్తే నీరుగా మారుతుంది. అంతే తప్ప, ఈ నదికి ఎందుకింత పవిత్రత ప్రత్యేకత అంటాడు హేతువాది. వాడి పక్కనే మరొకడు స్నానం చేస్తున్నాడు. 'ఆహా! ఇది విష్ణువు పాదంలోంచి పుట్టింది. తరవాత శంకరుని జటాజూటం చేరింది. ఆపై నరనారాయణులు ఇంకా ఎందరో తపస్సు చేసిన పుణ్యభూమి హిమాలయాల్లోంచి ఇక్కడికి జాలువారి వచ్చింది...' అంటాడు ఆస్తికుడు.

ఒకరికి శారీరక శుభ్రత మాత్రమే లభించింది. మరొకరికి శారీరక పారిశుద్ధ్యంతో పాటు మానసిక శుద్ధీ చేకూరింది. నదిలో మునకలు వేయటమే ప్రధానమైతే- ఎన్నో పశువులు మునుగుతున్నాయి, లేస్తున్నాయి. ఇక... చేపలు కప్పలు తక్కిన జలచరాల మాటేమిటి? వంద రూపాయల నోటు బరువెంత? ఆ నోటు మీద విలువను తెలుపుతూ ప్రభుత్వం ముద్రించిన మొహరు ఉంది. లేకపోతే అది బరువులేని రంగు కాగితం మాత్రమే. రెండు గాజు పలకల్లో ఒక దానికి వెనకవైపు పూత పూస్తేనే- అది అద్దమైంది. మన ముఖం అందులో ప్రతిబింబిస్తుంది. రెండోది గాజుముక్కే.

గుడిలో అన్నీ రాళ్లే. గర్భగుడిలోని నెలకొల్పింది- మంత్రయుక్తంగా శాస్త్రరీత్యా ప్రాణప్రతిష్ఠ జరిపిన విగ్రహం. అందుకే- భక్తులకు అది మామూలు రాయి కాదు. వారందులో దైవాన్ని దర్శించినంతకాలం వారి భావనను ఎవరూ నాశనం చేయలేరు. వాళ్ల భావన ఎప్పుడు మటుమాయమవుతుందో అప్పుడది, అది విగ్రహం కాదు... మామూలు రాయే.

అటుకులు, తులసి దళం, నది, విగ్రహం... ఏ వస్తువైనా ఏ దృశ్యమైనా ఏ వ్యక్తి అయినా ఏ ప్రాణి అయినా- మనం చూసే భావన మీద ప్రతిస్పందన జరుగుతూ ఉంటుంది. మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా కాపాడుకుంటామో ఎదుటివ్యక్తినీ అదే భావనతో చూడాలి. అప్పుడు అసూయకు ద్వేషానికి ఆస్కారం ఉండదు. జాతి మత వర్గ కుల లింగభేదాల ప్రసక్తి మచ్చుకైనా రాదు. ఇష్టదైవాన్ని ఆరాధించు. ఇతరుల దేవతల్ని ఆదరించు. విశ్వమానవ కాదు- విశ్వ ప్రాణికోటి మీద ప్రేమ ప్రదర్శించు. ఇదే- మన పరమ రుషుల దృక్పథం, అభిమతం!

-రాళ్లబండి శ్రీనివాసన్