ᐅశివోహం... శివోహం!
శ్మశానం అంటే ప్రపంచానికి భయం. శవాలకు, ఖననానికి, దహనానికి ముఖ్యంగా దుఃఖానికి స్థానమని, నిలయమని ప్రజల భావం, భయం. క్షుద్రపూజకు తప్ప మరే పవిత్ర కార్యకలాపాలకు అక్కడ స్థానం లేదని అపోహ. నిజానికి శ్మశానం అంటే మనిషి జీవిత అంతిమ ప్రయాణంలో చివరి మజిలీ. శరీర ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. పూర్తి అవుతుంది. చైతన్యం కదిలిపోగా, మైలపడిపోయిన శరీరానికి అక్కడే అంతిమ సంస్కారం జరుగుతుంది. దేహం అగ్ని పునీతమవుతుంది. మానవ శరీరం పంచభూత నిర్మితం. మరణం సంభవించిన క్షణమే వాయువు వాయువులో లీనమైపోతుంది. మిగిలిన ఆకాశం, అగ్ని, జలం, పృధ్వి అనే నాలుగు భూతాలు శ్మశానంలో ఖననంతో లేదా అగ్ని సంస్కారంతో ఏ భూతంలో ఆ భూతం విలీనమైపోతుంది. అంటే శ్మశానంలోకి ప్రవేశించిన పార్థివ దేహం ప్రత్యణువూ క్రమ పరిణామంలో పంచభూత సమమైపోతుంది.
ఇంత పవిత్రమైన ప్రక్రియకు వేదిక అయిన శ్మశానం భయపడవలసినది కాదు. నిజానికి మన స్థితి, పరిస్థితి, గమ్యస్థానం అదే. పరమపవిత్రమైన కాశీ క్షేత్రంలోని కొంతభాగమే మహా శ్మశానవాటికగా వాసిగాంచి ఉంది. నిజానికి శివుణ్ని, శ్మశానాన్ని వేరుచేసి చూడలేం. పరమ వైరాగ్యమూర్తి అయిన ఆయన నివాస స్థానం శ్మశానం. ఆయన ఒంటికి అలంకరించుకునేది భస్మం. కాశీలో బ్రాహ్మీ ముహూర్తంలో అర్చకులు శ్మశానానికి వెళ్లి తాజాగా దహనం జరిగిన కాష్ఠంలోని కొంత భస్మాన్ని తీసుకువచ్చి విశ్వేశ్వర లింగానికి అద్దిన తరవాతే ఆయన తదుపరి అభిషేకాలు, పూజలు ప్రారంభమవుతాయి. (ఈ ఆనవాయితీ మరికొన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఉంది).
నిజానికి మనం అపోహ పడుతున్నట్లు మరణం జీవితానికి అంతం కాదు. దుఃఖానికి కారణం కాదు. జన్మదుఃఖానికి అది తాత్కాలిక ముగింపు. అమాయకుడైన మనిషికి మరో అవకాశం ఇచ్చి చూడాలనే భగవంతుని కరుణకు మరో మేలుమలుపు. దుర్వినియోగం చేసుకున్న ప్రస్తుత జీవితానికి కొత్త మలుపులతో, కొత్త అవకాశాలతో కొనసాగింపు. మరణాన్ని మహదవకాశంగా మలచుకునే ప్రక్రియే జీవితం. దాన్ని ఆ దృష్టితోనే చూడాలి. మరణావశిష్టమైన దేహానికి శాస్త్రీయంగా వీడ్కోలు పలికే వేదిక శ్మశానం.
శ్మశానం దుఃఖానికి కాదు. వైరాగ్యానికి ఆటపట్టు. సాధనకు తొలిమెట్టు. మనిషి అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? మనిషికి చివరకు మిగిలేది ఏమిటి? అసలు మనిషిగా చివరకు మిగిలేది ఎలా? ఏమిటి? వీటిని ప్రత్యక్షంగా చూపే సజీవ చిత్రం శ్మశానం. గతం, జీవితం ఏమైనా పిడికెడు బూడిదగా మాత్రమే మిగిలే మనిషి ఎందుకింత అన్యాయంగా, అక్రమంగా, అనుచితంగా జీవించాలి!? ఆత్మీయులో, అనుయాయులో మరణించిన ప్రతిసారీ శ్మశానానికి వెళ్లి వైరాగ్యాన్ని పొందే మనిషి, ఆ పరిసరాలు దాటి బయటికి రాగానే సహజత్వానికి భిన్నంగా ఆలోచించినట్లు, అసహజత్వం వైపు మొగ్గు చూపినట్లు ఉలిక్కిపడి, నాలుక్కరచుకుని లెంపలేసుకుంటున్నాడు! ఇదే విషాదం!!!
హృదయంలోని మాలిన్యాలు, దురాలోచనలు, దుష్టబుద్ధులు కాలి బూడిదై, భస్మమై, అగ్నితప్తమై ఐశ్వర్యంగా మిగలాలి. హృదయం భస్మైశ్వర్య రాసితో ప్రకాశించాలి. ఒక ప్రత్యేక, విలక్షణమైన ఆధ్యాత్మిక సాధనలో మనిషి శరీరాన్నీ ఏ భాగానికాభాగం, ఏ అవయవానికా అవయవం కాల్చి భస్మం చేస్తున్నట్లు, శరీరం కాలి కట్టెగా మిగిలిపోయినట్లు భావన చేసే విధానం ఒకటి ఉంది. అంటే దేహమే ఆత్మగా భావించే మనలోని ఆలోచనను, ఆశలను, ఆత్మీయతను, బంధాలను, అనుబంధాలను అన్నింటినీ, శరీర భావనను కూడా కాల్చివేసుకుని హృదయం, శరీరం నిర్విషయంగా, నిర్వికారంగా, భస్మైశ్వర్యంగా ఆత్మైక్య స్థితిలోకి సాగాలనేది సాధనా రహస్యం. దీనికి బాహ్యరూపమే శ్మశానం.
మన హృదయ మధ్యంలో శివుడున్నాడు. శివుని ఆవాసం శ్మశానం. అంటే హృదయానికి, శ్మశానానికి అభేదం. అయితే మనిషి అజ్ఞానంతో శివాలయం అయిన హృదయాన్ని అరిషడ్వర్గాలనే మాలిన్య రాసితో నింపేశాడు. కుప్పతొట్టి చేసేశాడు. హృదయాన్ని అగ్ని తప్తం చేయాలి. విభూతి స్నానం చేయించాలి. దైవీ గుణాలతో అలంకరించాలి. తపోపుష్పాలతో అర్చించాలి. అప్పుడు... చిదానందరూపం శివోహం శివోహం.
- చక్కిలం విజయలక్ష్మి