ᐅగుండె వసంతమైపోయింది



గుండె వసంతమైపోయింది 

కృష్ణా! 
నీకు లేఖ రాసి ఎన్ని యుగాలైపోయింది! రాయాలని అనుకుంటాను. రాయాలనే ఆలోచనలోనే రగిలిపోతుంటాను. పొగిలిపోతుంటాను. మిగిలిపోతుంటాను. ఎగసిపడే ఆలోచనలు యమునా తరంగాలై నన్ను ముంచివేస్తుంటాయి. లాలించివేస్తుంటాయి. ఎంత అందమైన ఆలోచనలు! వాటిలోంచి బయటపడి రాసేందుకు అవకాశమే లేదు.
కృష్ణా! నీకు తెలుసా? నా గుండెలో వసంతం ప్రారంభమైపోయింది! కాదు కాదు. నా గుండె వసంతమైపోయింది. అది లబ్‌డబ్ అని శబ్దించడం మానేసి 'కృష్ణా, కృష్ణా' అని నినదించడం ప్రారంభించింది. ఆ నామ శబ్దంతో, శబ్ద స్పర్శతో గుండె శ్రుతి చేసుకున్నట్లయిపోయి, శ్రుతిపక్వమైపోయి వంశీగానమైపోయింది. కృష్ణ నామాలు! వంశీ నాదాలు! మురళీ తరంగాలు! భూపాల రాగాలు!! సిరలు, ధమనులు రక్తానికి బదులుగా రాగాలు ప్రవహిస్తున్నాయి. మల్లెలు, మామిడి చివుళ్లు, మంచిగంధాలు, మత్తెక్కించే కోయిల గళాలు... వసంతమే వసంతాలాడుతోంది. వెన్నెలలు పండుతోంది. ఆ అవలోకనంతో, ఆనందంతో నా గుండె స్పందన మరీ ఊపందుకుందేమో. మాయదారి గుండె తీవ్ర వ్యాకోచ సంకోచాలతో లోపలున్న నీవు నలిగిపోతావేమోనని నా భయం. పోనీలే. నా గుండె ద్వారా అలాగైనా నీ ఆలింగన భాగ్యం లభిస్తుందని ఓ ఆనందం.

యుగయుగాలుగా ఎన్ని పూల కౌగిళ్లలో, ఎన్ని గాలి వూళల్లో నలిగిపోయావో కృష్ణా! నీ శిరీష కోమల దేహం అందుకే కందిపోయి, కమిలిపోయి, నల్లబడిపోయిందా? ఇప్పుడేమో నా గుండెతో, నా గుండె మధ్యలో నీవు! ఎంత మధురమైన ఆలోచన! ఆ వూహే నా వూపిరిని ఆపేస్తుందేమోననిపిస్తోంది. ఆగిపోనీ... నా ఆగిన గుండె మధ్యలో నీవు... శాశ్వతంగా! ఓహ్! కానీ వద్దు. ఆ ఒత్తిడిలో నీవు... బందీగా! వద్దు! అయినా నీవు సర్వాంతర్యామివి. నిన్ను నేను బంధించగలనా! యశోదమ్మదే ఆ యశం.

కానీ కృష్ణా! నా గుండెలో విరిసిన వసంతంలో పూల పుప్పొడుల మధ్య నిన్ను వసంతమాడించాలని ఆశ. నీ మురళీ నాదంతో కలిసి నా గుండెలోని కోయిలల 'పాటల వాయిద్యా'లతో జుగల్‌బందీ చేయాలని ఆశ. మందమారుతాలతో నీ ముంగురులు సీతాకోక చిలుకలై ఎగురుతూ ఉంటే పట్టుకోవాలని ఆశ. నీ నాట్యంతో రవళిస్తున్న నీ అందెల, ఆభరణాల సంగీత విభావరితో చిన్నబోయిన, లయతప్పిన నా గుండె బేల శబ్దాలను ఆపివేయాలని ఆశ.

అప్పుడెప్పుడో శబరి, రాముడిలాంటి నీకు ఎంగిలిపళ్లు తినిపించి ఆనందపడిపోయింది. నేనేమిచ్చి సంతోషపడను? ఏమైపోయి సంతృప్తిపడిపోను? పక్షినవుదామంటే ఎప్పుడో జటాయువు ఆ అదృష్టాన్ని సొంతం చేసేసుకుంది. రాయినవుదామంటే అహల్య చాలా ముందే ఆ అవకాశాన్ని లాగేసుకుంది. అల్పజీవినైపోయి నీ పాదాల చెంత స్వల్ప సేవ చేసుకుందామంటే ఉడుత 'నీకా భాగ్యం లేదు పొ'మ్మంది. ఎవరూ కోరని కురూపిగా నిను చేరుదామంటే కుబ్జ జాలిగా నవ్వేసింది. సరే కృష్ణా. ఎవరిగానో నేను నిన్ను చేరటమేమిటి! నేను నేనుగానే నీకుగా నీకై మిగిలిపోతాను. నన్ను నన్నుగా నన్ను ఆమోదించు. స్వీకరించు. నా ఈ అక్షరాలను నా అశ్రువులుగా, నా ఆర్తిగా, నా ఆశలుగా, నా భక్తిగా, నా భావనలుగా, నేనుగా... ఔను... నేనుగా స్వీకరించు ప్రభూ. నీవుగా మిగిలించు!

- చక్కిలం విజయలక్ష్మి