ᐅహంసలు
ᐅహంసలు
ప్రకృతి, మనిషి వేరువేరు కాదు. మనిషి కలిస్తేనే ప్రకృతి. మనిషితో కలిసే ప్రకృతి. మరి ఇప్పుడు ఈ ద్వైతమేమిటి? రెండుగా విడిపోవటమేమిటి? రెండుగా కనిపించటమేమిటి? పరస్పర భయాలేమిటి? నిజానికి ఈ 'రెండు' అన్నది- అద్దంలో చూసినప్పుడు రెండుగా కనిపించిన ఏకవస్తువన్నమాట. సరే. అది కేవలం భ్రాంతి. నిజమే. కానీ భావన, స్పందన, స్పష్ట వేర్పాటు భావం, పరస్పరం భయం... మరి ఇవేమిటి? ఇది భ్రాంతి కాదు కదా?
నిజానికి ప్రకృతి అంటే ఏమిటి? చెట్లు-చేమలు, కొండలు-కోనలు, నదులు, సముద్రాలు, ఆకాశం, నక్షత్రాలు, పూలు, పళ్లు, పరిమళాలు, ఒకటి తప్ప ఎనభై నాలుగు లక్షల జీవరాసులు... ఇవేనా? ఆ ఒక్కటి ఏమిటి, ఎవరు? మనిషి. ఔను... మనిషే. మనిషి జీవకోటి కాదా? జీవరాసిలోనివాడు కాదా? వాడే. ఆ వృత్తంలోని వాడే. కానీ అతితెలివితో, అత్యాశతో వృత్తంలోంచి చెదిరిపోయాడు. విడిగా చిందిపోయాడు. కానీ... కాదు. అలా భావిస్తున్నాడంతే. ప్రకృతి మొత్తం ఒక వృత్తం అయినప్పుడు, పూర్ణం అయినప్పుడు ఆ పరిధికి అవతల ఇంకేమీ లేదు. ఉండదు... బయటికి వెళ్లడానికైనా, బయట ఉనికి నిలుపుకోవడానికైనా. నిజానికి కొన్నిసార్లు- వూహూ- చాలాసార్లు మనిషి అమాయకుడు. అర్భకుడు. తాను కానిదాన్ని 'తాను' అనుకుంటాడు. తానే అయినదాన్ని 'వేరు' అనుకుంటాడు. ఇది అతనికి అలవాటే. ప్రకృతితో కూడా అంతే.
మహాత్ములు, మహాపురుషులు ప్రకృతిని శాసిస్తున్నారు! క్రూరజంతువుల్ని పెంపుడు పిల్లుల్లా, పావురాల్లా మార్చేస్తున్నారు! దీనికి మాయలో మంత్రాలో కారణం కాదు. వారు ప్రకృతితో సమత్వాన్ని పొందుతున్నారు. ఏకత్వాన్ని అందుకుంటున్నారు. ఆత్మానుసంధానం చేసుకుంటున్నారు. అందుకే ప్రకృతి తనకు భిన్నంగా వారిని అనుకోవటంలేదు. ఒకే ఆత్మగా భావసారూప్యతతో మసలుతూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఒకరి అవసరాన్ని ఒకరు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మనం మహాత్ములం కాకపోయినా మనుషులం అయితే చాలు. అందుకే మనం ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతికి దగ్గరగా- కాదు కాదు- ప్రకృతిలో జీవించాలి. ప్రకృతిలో మమేకమై మసలాలి. మనలోని ప్రకృతికి, బాహ్యప్రకృతికి తేడాలేదు. మనిషి ఆ భావాన్ని గ్రహించాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు మనిషి ప్రకృతిలో తాదాత్మ్యం చెందుతారు. సమస్వభావం, సమలక్షణం వున్న పదార్థాలు సహజంగానే ఏకత్వాన్ని పొందుతాయి. రెండూ ఒకటే అయినప్పుడు ఒకదాన్నించి మరోదానికి ప్రమాదంలేదు. భయం ఉండదు. ఒక పొయ్యిలోని అగ్ని మరో పొయ్యిలోని అగ్నిని కాల్చదు. ఒక పాత్రలోని జలం మరో పాత్రలోని జలాన్ని ముంచదు. మనం ప్రకృతిసహజంగా ఉండే ప్రకృతి కూడా మనతో సస్నేహంగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుంది. మనలో కలిసిపోతుంది. మనను తనలో కలుపుకొంటుంది. తల్లిలా లాలిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. మనం దాని ఒడిలోకి ఒదిగిపోవాలి. అంటే ఎక్కడైనా తల్లి ఒడిలోకి వెళ్లడానికి బిడ్డకు ఆటంకముంటుందేమోకానీ బిడ్డను తన చల్లని పరిష్వంగంలోకి తీసుకోవడానికి తల్లికి ఏ ఆటంకమూ ఉండదు. అభ్యంతరం అంతకంటే ఉండదు.
ఈ ఆధునిక కాలంలో నూటికి నూరుపాళ్లూ సహజత్వాన్ని సొంతం చేసుకోవాలంటే, పొందాలంటే సాధ్యం కాని పని. అయినాసరే, ప్రయత్నపూర్వకంగానైనా, కొంత శాతమైనా, వీలైనంత శాతమైనా పొందాలనే బలమైన, తిరుగులేని సంకల్పం మనకుండాలి. మన అవివేకం, అమాయకత్వం, కుహనా ఆధునికత్వం మన ఉత్తమ జీవనశైలిని, పారమార్థిక ప్రగతిని ఆటంకపరచటమే కాదు. ప్రాణాధికమైన మన పిల్లల భవిష్యత్తునూ అంధకార బంధురం చేస్తుంది. వాళ్లు పువ్వుల్లా వికసించాలి. సీతాకోకచిలుకల్లా ఎగరాలి. హంసల్లా విహరించాలి. జీవనదుల్లా ప్రవహించాలి. వాళ్లు ఆనంద జలపాతాలు కావాలి. అద్భుత జ్యోతులై వెలగాలి. వారి ఆరోగ్యం పారిజాతాలై విరియాలి. ఈ సుందర స్వప్నాన్ని సాకారం చేసుకునే కిటుకు మన చేతుల్లోనే ఉంది. పెద్దలేం చెబితే పిల్లలు అది చేయరు. పెద్దలేం చేస్తే పిల్లలు అదే చేస్తారు. బురదలో పొర్లే తల్లి పందిని చూసి పందిపిల్లలూ బురదే పన్నీరులా తామూ దొర్లుతాయి. మానస సరోవరంలో తేలియాడే హంసల పిల్లలు వాటినే అనుసరిస్తాయి. మన పిల్లలకు ఆదర్శంగా మనం ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి!
- చక్కిలం విజయలక్ష్మి