ᐅఆధ్యాత్మిక విచికిత్స




ఆధ్యాత్మిక విచికిత్స 

శరీర రుగ్మతలకు ఆయుర్వేద చికిత్సలాంటివే భవరోగాలనే అరిషడ్వర్గాలకు ఆధ్యాత్మిక చికిత్సలు. శరీర రుగ్మతలకంటే ఆధ్యాత్మికంగా నివారించాల్సిన భవరోగాలే ఎక్కువ సమస్యాత్మకం, ప్రమాదకరం. ఎందుకంటే, ఇవి మొత్తం మన జీవన విధానాన్నే ప్రభావితం చేస్తాయి. తద్వారా మనిషి అన్ని విధాలా పతనమైపోతాడు.
కామరోగపీడితుడు భయం, లజ్జ లేకుండా పశువులాగా ప్రవర్తిస్తాడు. అందుకే 'కామాతురాణాం న భయం న లజ్జ' అంటారు నీతి కోవిదులు. వర్తమాన ప్రపంచంలో ఇందుకు ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. ప్రేమ అనేది కామం అనే చేదు మాత్రమీద చక్కెర పూత కామరహిత ప్రేమకు ఆస్కారం లేదు- ఒక్క మాతా, పిత, గురు, భ్రాత, మిత్రుల విషయం మినహాయిస్తే.

కామం తరవాత క్రోధమూ ప్రమాద భరితమే. అనేక అనర్థాలకు ఇదే మూలం. క్రోధం అంతరాగ్ని. అది మన విచక్షణను దహిస్తుంది. ఉద్వేగానికి, విపరీత చర్యలకు కారణమవుతుంది. ఇక లోభం సంగతి తెలియనిదెవ్వరికి? 'లోభికి ఖర్చెక్కువ' అనే లోకోక్తి- వ్యయప్రయాసలు తప్ప లోభికి తాను అనుకుంటున్న లాభం చేకూరదన్న వ్యవహార సత్యాన్ని వెల్లడిస్తుంది. 'మోహం' కూడా తక్కువదేమీ కాదు. మనసుమీద పట్టుబిగించి పెత్తనం చెయ్యగల సత్తా ఉన్నది. మనిషిని వివశుణ్ని, తద్వారా అశక్తుణ్ని చేస్తుంది.

మదం- సంపూర్ణ తమోగుణం. ధనమదం, అధికారమదం, శరీరబలమదం అంటూ వివిధ రీతుల్లో ఇది బహిర్గతమవుతుంటుంది. దీనివల్ల 'మదాంధత' అనే విచక్షణారహిత ప్రవృత్తి మనసులో శిలవేసుకుపోతుంది. ఇది ప్రతిచర్యలోనూ వ్యక్తమవుతూ మిత్రుల్నీ, ఆత్మీయుల్నీ సైతం శత్రువులుగా మారుస్తుంది.

మాత్సర్యం అనేది తీవ్ర మానసిక జాడ్యం. సవతి మాత్సర్యం, దాయాదుల మాత్సర్యం గురించి అనేక పౌరాణిక, చారిత్రక గాథలు మనకు ఉన్నాయి. ఈ ఆరింటినీ అరిషడ్వర్గాలంటారు. 'అరి' అంటే శత్రువు. మనలోనే నిత్యనివాసంగా ఉండే ఆరు శత్రువులే అరిషడ్వర్గాలు.ఆధ్మాత్మిక సాధకులకు ఈ ఆరుగురు శత్రువులూ కఠిన పరీక్షలు పెడతారు. వీటిని జయించేందుకు ఉపాయాలున్నాయి. ఆదిశంకరులు భజగోవిందమాలలో వీటికి చికిత్సలు చెప్పారు. సత్సంగంతో నిస్సంగత్వం, నిస్సంగత్వంతో నిశ్చలతత్వం, నిశ్చలతత్వంతో నిర్మోహత్వం- ఇట్లా ఒక్కో ద్వారమూ దాటుకుంటూ వెళ్లాలి. సత్సంగం పట్ల ఆసక్తి కలగాలంటే మనలో సత్వగుణం ఉండి తీరాలి.

సత్వగుణం వల్లనే శ్రద్ధ, భక్తి, జ్ఞానజిజ్ఞాసలు కలుగుతాయి. జ్ఞాన జిజ్ఞాస మనల్ని సత్సంగం వైపు నడిపిస్తుంది. మరి సత్వగుణం ఎలా పొందాలి?రజో, తమో గుణాల్ని వదిలించుకుంటే మిగిలేది సత్వగుణమే. ఈ రజో, తమో గుణాలకు పరమమిత్రులు మనం పైన చెప్పుకొన్న అరిషడ్వర్గాలు. రజో, తమో గుణాల్ని వదిలించుకోవాలంటే- మొదట సత్వగుణ ప్రధానమైన ఆహారం అలవాటు చేసుకోవాలి. అంటే సంపూర్ణ శాకాహారం. అసలు మన దృష్టి, అభిరుచి శాకాహారంమీద స్థిరపడటమే సత్వగుణానికి బలం ఇస్తుంది. ఆహారానికి త్రిగుణాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక విచికిత్స విషయానికి వద్దాం. విచికిత్స అంటే సందిగ్ధత. ఇది అన్నింటికంటే ప్రమాదకరమైన జాడ్యం. ఎందుకంటే, దీనివల్ల కర్తవ్య విమూఢత కలుగుతుంది. అన్నీ సందేహాలే అయినప్పుడు మనం ఏ పనీ చెయ్యలేం.

మనం ఇన్ని పూజలు, పునస్కారాలు చేస్తున్నాం. ఇన్నిసార్లు దేవాలయాలకు వెళ్తున్నాం. ఇన్నిసార్లు పారాయణలు చేస్తున్నాం. రామకోటి, శివకోటి రాస్తున్నాం. దానధర్మాలు చేస్తున్నాం. ఇవన్నీ మనకు పుణ్యం సంపాదించిపెడతాయా? ఇలాంటివాటినే ఆధ్యాత్మిక విచికిత్సలంటారు.

వాస్తవానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మన ఆత్మకు ఆనందహేతువులు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. ఆత్మ ఆనందమే అసలైన ఆనందం. మిగతావన్నీ భ్రమలు. మనం మనలోని ఆత్మశక్తిని పెంచుకోవడంవల్ల విచికిత్సలకు అంతర్గత చికిత్స జరుగుతుంది. అప్పుడు మన అంతర్యామి అయిన ఆత్మే మనకు గురువుగా భాసిస్తుంది. దారి చూపిస్తుంది.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్