ᐅమనోస్త్థెర్యం
మనోస్త్థెర్యం వెన్నంటి ఉండేవరకు 'మరణ భయం' దరి చేరదు. అల్లంత దూరాన ఉండిపోవాల్సిందే. జనన మరణ చక్రం సహజంగా జరిగిపోయేదే. దేనికీ భయపడనివాడు మరణం అనగానే భయపడతాడు. అన్నీ వదలిపెట్టుకుని వెళ్లిపోతున్నాననే భయం ఆవహిస్తుంది. కనీసం ఆ మాట తలంపులోకి రావడమే సహించలేడు. మనోస్త్థెర్యం అడుగంటిపోతుంది ఆ క్షణంలో.
మరి చావుపుట్టుకలు సహజమే అంటూ చెప్పుకొనే మనిషి మరణం ఆసన్నమవుతుందని తెలియగానే తల్లడిల్లి పోతాడు, దేనికని? జీవితానుబంధం తెగిపోతుందన్న బాధ. బంధాలు, మమకారాలు, వస్తువాహనాదులు, సిరిసంపదలు వదిలేసుకుపోవాలన్న బాధ. ఆ క్షణంలో తను జీవితకాలంలో చేసిన తప్పులకు, పాపాలకు పశ్చాత్తాప పడిపోతాడు. మరణాన్ని తప్పించమని దైవశక్తిని వేడుకుంటాడు. మరణం అనివార్యమైనప్పుడు ఇవి కాసింతైనా ఉపకరించకపోతాయా? అన్న విశ్వాసం. సహజమే ఈ తీరు. అలాగని జీవితంలో- నూరేళ్లయానంలో తను, తనవారు, ఆస్తిపాస్తులు లేకుండా ఎడారి జీవితం ఏ ఒక్కరూ గడపలేరు. అది కూడని పని. కర్మాచరణ వీడరాదు. అయితే మనిషికి ఉండవలసింది కేవలం ఈ బంధాలు, సిరిసంపదలు మాత్రమే కావు. తరగని ఆస్తి లాంటి 'స్త్థెర్య సంపద' కలిగి ఉండాలి.
మరణకాలంలో సైతం 'జీవన యాత్ర' ముగిసిందన్న తృప్తి ఉండాలి. సాధ్యమా? ఎంతటివారికైనా! చెప్పుకొనేందుకే కానీ... తీరా ఆ క్షణం వచ్చాక సాధ్యమా అన్న ధోరణి స్ఫురించకమానదు. కానీ, అవసరమే.
మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రాణాంతక వ్యాధులు వచ్చిపడ్డాక ఏడాదికాలం బతికేవారు ఆర్నెల్లు తిరక్కముందే నిస్పృహకు గురై జీవితాన్ని ముగించుకోవడం. ఇక బతుకుమీద ఆశ సన్నగిల్లి అంతులేని చిత్తవ్యధకు గురికావడం. మనం మానవులం. మహనీయులం కాదు. అయితే, మనిషి ఏ స్థితిలో ఉన్నా- ఎంతటి దుర్భర అవస్థ ఎదురైనా మనోస్త్థెర్యాన్ని కూడగట్టుకోవడమే కర్తవ్యం. ఇది ఒక్కసారిగా వచ్చిపడేది కాదు. ఆధ్యాత్మిక వికాసంతోనే సాధ్యం. అందుకే జీవన చక్రభ్రమణంలో అను'చింతన'లతోపాటు ఆధ్యాత్మిక చింతనా అవసరం.
తన గురించి తాను తెల్సుకోవడమే ఆధ్యాత్మిక విచారణ.
వామనుడు బలిచక్రవర్తిని 'మూడడుగుల దానం' అడిగాడు. ఏమిటా మూడడుగులు? అవి మూడు ప్రశ్నలు, లోతుగా విశ్లేషించుకుంటే- 'నీవు ఎవరు, ఎక్కడనుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు?' అఖండజ్యోతినుంచి ఉద్భవించి తిరిగి ఆ జ్యోతిలో లీనమైపోవడమేనన్న తత్వజ్ఞానం అది. బలిని పాతాళానికి తొక్కడమంటే అజ్ఞానాన్ని అణచివేయడమే. 20వ శతాబ్ది తత్వజిజ్ఞాసువులందరికీ బాగా పరిచితుడు పాల్ బ్రంటన్. పాశ్చాత్య వేదాంత, తత్వశాస్త్ర పారంగతుడు. భారతీయ ఆధ్యాత్మిక గురువులంటే అమితాసక్తి. భారతీయ తత్వజ్ఞులు సూక్ష్మంలో తత్వజ్ఞాన సంపదను ఇస్తారన్న విశ్వాసం.
కంచి పరమాచార్యులైన శ్రీ చంద్రశేఖర సరస్వతిస్వామి సలహా మేరకు రమణ మహర్షిని కలుస్తాడు. ఉపదేశమిమ్మని కోరగా మహర్షి నవ్వి- 'నేనెవరిని అని ప్రశ్నించుకో. నీవు తత్వజ్ఞుడవు. అంతా బోధపడుతుంది. ఈ విశ్లేషణతో నీ మనసుకన్నా లోతుగా వేరొకటి దాగుందని తెలుసుకుంటావు. అది తెలుసుకుంటివా... గొప్ప సాధకుడివే నువ్వు! నిన్నేవీ అంటవు. అంతా ఆనందమే' అన్నారు శ్రీ రమణులు. యోగసాధకుల స్త్థెర్యం ఇలా ఉంటుంది. ఇక్కడ యోగసాధన అంటే చిత్తాన్ని భ్రమింపచేయకుండా చెప్పుచేతల్లో ఉంచుకోవడమే ప్రతీక్షణంలోనూ.
మహర్షికి వీపున వ్రణం వచ్చింది. పరీక్షించిన వైద్యులు- 'నీవు మహనీయుడవు. ఈ బాధనుంచి విముక్తి కలిగించుకోరాదా నీ శక్తితో' అని అన్నారు. అందుకు మహర్షి నవ్వి- 'దాన్ని నేను రమ్మన్నానా, పొమ్మని అనగానే పోయేటందుకు. మీ పని మీరు కానివ్వండి' అన్నారు. చివ్వరి క్షణంలోనూ చెదరని మనోస్త్థెర్యం, నిబ్బరం, 'నేను-నాది' అనుకునే వలయాలనుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చేదే మనోస్త్థెర్యం. పాండవుల మహాప్రస్థానం సాగుతున్నప్పుడు- ద్రౌపది కిందికి ఒరిగిపోవడం చూసిన భీమసేనుడు ధర్మజుడితో- 'అగ్రజా, ద్రౌపది మనల్ని వీడిపోయింది' అని చెప్పినా, తదేక చిత్తంతో వెనుదిరిగి చూడకుండా సాగిపోయాడు. 'మహాప్రస్థాన యాత్ర' అంటే అన్నింటికీ- భవబంధాలకు అతీతమైన యాత్ర. శాశ్వత నివాసస్థలానికి ప్రయాణం అది. మనోవికారాలను వదలివేసే పరిణతి అది.
సైనికుడు యుద్ధరంగంలో ఆఖరి క్షణం వరకు స్త్థెర్యాన్ని కోల్పోడు. నూరేళ్ల జీవితం కూడా యుద్ధరంగమే. ఆదినుంచి కడవరకు విడకూడనిది మనోస్త్థెర్యమే
- దానం శివప్రసాదరావు