ᐅనిత్య చైతన్య స్రవంతి
పార్థివ శరీరానికి ప్రాణం ధాతువు, హేతువు! ఈ ప్రాణం ఎలా వస్తుంది, ఎలా పోతుందనేది తరతరాలుగా మానవ మేధను తొలిచేస్తున్న బేతాళ ప్రశ్న. దీనికి సంతృప్తికరమైన సమాధానం కోసం వేలాది సంవత్సరాలుగా రుషులు, యోగులు, సిద్ధులు, తత్వవేత్తలు, భౌతిక స్థాయిలో శాస్త్రవేత్తలు అహరహం కృషి చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ ఇది జవాబు దొరకని ప్రశ్నగానే ఈ ప్రపంచంలో మిగిలిపోయింది. గతం కాలగర్భంలో కలిసిపోయినా, నాటి అధ్యయనాలు భవిష్యత్ సూచికలుగా మానవాళికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. ఆ అనుభవాల సారమే మనిషి పురోగతికి కట్టుబడి, పెట్టుబడి!
మనసును పరమాత్మలో లగ్నంచేసి లయం చేయడమే అసలైన భక్తిగా శంకరభగవత్పాదులు వ్యాఖ్యానించారు. ఇహ, పర సుఖాలను ఆశించి ప్రార్థించడం అధమభక్తిగా, జన్మరాహిత్యం కోరడం మధ్యమభక్తిగా, ఏ కోరికా లేకుండా చేసే నిష్కామ ధ్యానమే నిజమైన భక్తిగా పెద్దలు చెబుతారు. ఈ ధ్యానం అనేది అనేక రూపాలతో వివిధ ప్రక్రియలుగా భాసిల్లి చివరగా 'ఆత్మ సాక్షాత్కారం' సాధిస్తుంది. శరీరం రథమైతే, బుద్ధి సారథిగా, ఇంద్రియాలు అశ్వాలుగా ఉపయోగపడతాయి. నైపుణ్యం ఉన్న రథికుడు ఉత్తమాశ్వాలతో ముందుకు ప్రయాణించినట్లు ఇంద్రియాలను స్వాధీనం చేసుకుంటేనే సుఖ జీవనయాత్ర సాగించగలడు. మనసనేది ఈ రథానికి ఇరుసుగా, ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందుకే మనసే అన్నింటికీ మూలకారణం అన్న సూక్తి వచ్చింది. మనిషి పుట్టిన నాటినుంచీ మనసులోకి వచ్చిన ప్రతి చెడు ఆలోచనా కార్యరూపం దాల్చి ఉంటే- ఈ ప్రపంచం ఎప్పుడో నాశనమై ఉండేదట!
పంచభూతాత్మక నేపథ్యంలో ప్రాణుల్ని పిపీలికాలుగా భావిస్తారు. అనంతమైన విశ్వవిన్యాస విజ్ఞానాన్ని మానవ మేధ పరిమితమైన కాలంలో సాధించలేదు... కాని, శోధించగలదు! భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు భూమిలో కనిపిస్తాయి. శబ్ద, స్పర్శ రూప రసాలు జలంలో; శబ్ద, స్పర్శ రూపాలు అగ్నిలో; స్పర్శ, శబ్దాలు వాయువులో; కేవలం శబ్ద గుణమే ఆకాశంలో కనిపిస్తాయి. మొత్తం పదిహేను గుణాలతో పంచభూతాలు చైతన్యం పొంది కాల ప్రేరణతో పరస్పర ఆలంబనవల్ల జనన మరణ సమయాల్లో అనులోమ, ప్రతిలోమ క్రమంలో విలీనమవుతుంటాయని మహాభారతంలో వ్యాసుడు వివరించాడు. అందుకే అనంతమైన విశ్వంలో అణువంత భూమ్మీద పుట్టిన పరమాణువంత మానవుడు 'నిత్య చైతన్య స్రవంతి'లో విలీనం కావాలంటే- అది ఒక్క సద్బుద్ధితోనే సాధ్యం.
-కిల్లాన మోహన్‌బాబు