ᐅఫలాలనిచ్చే పర్వం



ఫలాలనిచ్చే పర్వం 

హేమంత రుతువులో మార్గశీర్ష, పుష్యమాసాలకు 'సహశ్రీ, సహస్యశ్రీ' అనే రెండు పేర్లను శ్రీవిద్యాశాస్త్రంలో పేర్కొన్నారు. వేదపరంగా ఈ రెండు మాసాలకు ఈ పేర్లను స్వీకరించవచ్చు.
సహః- అంటే 'బలం' అని అర్థం. దేనినైనా సహించగలిగే బలం. అందుకే 'సహ్య' అనే పేరూ కనబడుతోంది. ఈ మాసం పుష్టినిచ్చే కాలంగా శాస్త్రోక్తి. వసంతం చిగురింతతో మొదలైనా, హేమంతం ఫలాన్నిచ్చే కాలం కనుక దీనికి ప్రాధాన్యం.

ఈ రుతువులో వచ్చే ఉభయ సంక్రమణాలకీ ప్రాముఖ్యం ఉంది. మొదటిది ధనుస్సంక్రమణం, రెండోది మకర సంక్రమణం. మన సంవత్సరకాలం దేవతలకు ఒక రోజుగా చెబుతారు. ఈ దినానికి తెల్లవారుఝాము వంటిది ధనుస్సంక్రమణంనుంచి వచ్చే ఒక నెల కాలం. సూర్యోదయం వంటిది మకర సంక్రమణం అని ధార్మిక గ్రంథాల మాట.

ఈ మకర సంక్రమణంనుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంవత్సరమనే రోజుకు పగటికాలం ఉత్తరాయణమైతే, దానికి సుప్రభాతం వంటిది ఈ మకర సంక్రాంతి. సుప్రభాతంలో ధ్యానారాధన వంటివి రోజువారీ కార్యక్రమాల్లో ఎలా జరుపుకొంటామో, ఈ సంక్రాంతి వేళ, మొత్తం ఏడాది కాలాన్ని ఉద్దేశించి ఆధ్యాత్మిక సాధనలు చేయడం శ్రేష్ఠం.

దీనికి 'పుణ్యకాలం' అనే పేరు ఉన్నది. ఏ కర్మవలన మనం పవిత్రులమవుతామో దానికి 'పుణ్యం' అని పేరు. సరియైన కర్మకు సరియైన కాలం కూడా జతకలిస్తే అది సానుకూలంగా, శీఘ్రంగా సత్ఫలితాలనిస్తుంది కనుక, మన రుషులు పుణ్యకాలాల్లో పుణ్యకర్మలను నిర్దేశించారు.

ఈ పావనపర్వాన బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, అభ్యంగస్నానం చేసి, అటుపైన జప, దాన, పితృ ఆరాధనాది కృత్యాలు చేయాలని శాస్త్రం నిర్దేశించింది. ఈ రోజున నువ్వుల దానం, నువ్వుల ఆరగింపు, తిలల (నువ్వుల)తో పూజ- వంటివి పావనకరాలనీ ధార్మిక శాస్త్రాలు వివరించాయి. ఆరోగ్యపరంగా ఈ కాలానికీ, తిలలకీ ఉన్న ఓషధీ సంబంధాన్ని వైద్యశాస్త్ర సహాయంతో అన్వయించవచ్చు. దేశంలో అనేక ప్రాంతాల్లో 'తిలసంక్రాంతి' అనీ వ్యవహారముంది. శుభాకాంక్షలుగా, స్నేహసూచకంగా తిలల్ని ఇచ్చి పుచ్చుకోవడం కనబడుతోంది.

జపతపదానాది సత్కర్మలతో పాటు, పంటల పండుగగా తమతమ సంపదలను 'భోగిం'చే భోగితో మొదలై, పాడిపంటల్లో ప్రధాన భాగస్థులైన పశువుల్ని సైతం అలంకరించి ఆరాధించే ఈ పర్వానందంలో మానవతాదృక్పథం, దైవత్వకాంతితో జతపడి ప్రకాశమానమవుతుంది. ప్రధానంగా ఈ పర్వం సూర్యారాధనపరమైనది.

భాస్కరుడు మకరరాశిలోకి సంక్రమించే ఈ రోజున ఆ వెలుగుల వేల్పును భక్తితో పూజించడం ప్రధాన కర్తవ్యమని పురాణవచనం. కొత్తబియ్యంతో పొంగించిన పాయసం, సూర్యునికి నివేదించి ప్రసాదంగా స్వీకరించే పర్వం కనుక 'పొంగల్'గా దీన్ని తమిళులు వ్యవహరిస్తారు. వైదికమైన ఈ ఆచారం అన్ని ప్రాంతాలవారూ అనుసరించవచ్చు.

ప్రకృతివైపరీత్యాలకు ధర్మకాలుష్యం, అవినీతి ప్రధాన కారణాలని ధర్మశాస్త్రఘోష. మన అనైతికవర్తన, ప్రకృతిపట్ల నిర్లక్ష్యం, స్వార్థం, దోపిడి వంటి వ్యతిరేక భావాలు గూడుకట్టి దుష్టశక్తిగా మారితే ప్రకృతి క్షోభిస్తుందనీ- దాని ఫలితంగా అతివృష్టి, అనావృష్టి వంటి ఉత్పాతాలు సంభవిస్తాయనీ శాస్త్రాలు చెప్పినమాటను 'చాదస్తం' కింద కొట్టిపారేసే వీలులేదు. సూక్ష్మ విజ్ఞానానికి సంబంధించిన అంశమిది. జరిగిన వైపరీత్యాలు పండుగ కళను తగ్గించినా, ప్రకృతిలోని సంక్రమణం వంటి పరిణామాలు వాటి సత్ప్రభావం చూపించక మానవు. ధార్మిక దృక్పథాన్ని పెంచుకొని, శుభాన్ని ఆకాంక్షిస్తూ, దివ్యత్వం వైపు చేతులు చాచి- సమాజహితాన్ని ఆశించడమే ఈ పర్వదినాల ఆరాధనల్లోని పరమార్థం. 

- సామవేదం షణ్ముఖశర్మ