ᐅక్రాంతిహేల



క్రాంతిహేల 

సంక్రాంతి వంటి పర్వదినాలు భూమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న తీయని కవితలు. జీవితం ఆశలతో పండగా వచ్చేవి పండుగలు. బంతిపూలు, చేమంతులు జడలో సింగారించుకుని ఆకుపచ్చని చీర ధరించి రంగవల్లుల రంగుల దారిలో నడిచివచ్చే సంక్రాంతి రమణి అందాలు వర్ణనాతీతం. ఇది రైతన్న పడిన శ్రమ పండాల్సిన బంగారు క్షణాలు.
ప్రాచీన కాలంలో మానవ అభివృద్ధి తొలి దశల్లో బీడులాగా పడివున్న నేలను దుక్కిదున్ని బంగారు పంటలు పండించడం నేర్చిన మానవులకు తొలి సంక్రాంతి అది. జీవితం ఆనాటినుంచి బహుముఖాలుగా, బహువిధాలుగా వికసిస్తూ అభ్యున్నతివైపు అడుగులు వేస్తూ సాగిపోయే మార్గంలో బంగారు మైలురాళ్లు ఈ సంక్రాంతి పర్వదినాలు.

క్రాంతి అంటే మార్పు. అభ్యుదయం మానవాళికి మంచి అభ్యున్నతిని అందిస్తుంది కాబట్టి దీన్ని సంక్రాంతి అన్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు జీవాధారం. జీవితానికే వెలుగు. అసలు భూమిపై ప్రాణికోటి, వృక్షజాతి పరిణమించడానికి మూలపురుషుడు సూర్యభగవానుడే. పెద్దలు, పిన్నలు ఎంతో ఆప్యాయంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైంది. సాధారణంగా పండుగ ఒక రోజులో పూర్తి అవుతుంది. ఇప్పటికీ సంక్రాంతి నాలుగు రోజులపాటు సాగే పండుగ.

సంక్రాంతి సుందరి ఒంటరిగా రాదు. మహారాణిలాగా- మంచును, చలిపులిని తరిమికొట్టే మంటల కిరీటంతో ముందు భోగిని, వెనక కనుమను వెంటబెట్టుకుని చెలికత్తెల నడుమ రాకుమార్తెలా వస్తుంది! సంక్రాంతి నాడు దానధర్మాలు చేయడంవల్ల దారిద్య్రంవంటి అరిష్టాలు అంటవంటారు. స్త్రీలు పువ్వులు, పసుపు కుంకుమ, పండ్లు దానం చేయడంవల్ల ఐహిక సంపదలు, సౌభాగ్యం కలుగుతాయనీ చెబుతారు. పితృదేవతలను ఆరాధించడంవల్ల వారి వంశాలు ప్రవర్ధమానమవుతాయన్నది పెద్దల మాట.

రైతాంగానికి కనుమ ఎంతో ఇష్టం. ధాన్యపురాశులను ఇంటికి చేర్చేవరకు సహాయంచేసే బసవన్నకు పూజలు జరుపుతారు. ఆ రోజు ఇళ్ల యజమానుల కన్నుల్లో సంక్రాంతి తేజఃపుంజాలు మెరుస్తాయి అందంగా. ఆ రోజున ప్రభలను నిర్మించి, పార్వతీ పరమేశ్వరుల బొమ్మలుంచి మేళ తాళాలతో మహా వైభవంగా ప్రభల తీర్థం నిర్వహిస్తారు. గ్రామ సీమలకు ఇంద్రధనుస్సులే నడిచివచ్చాయా అన్నంత సౌందర్యం దీపిస్తుంది. ముక్కనుమనాడు (నాలుగో రోజున) కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు 'సావిత్రి' గౌరీవ్రతం అంటే- బొమ్మల నోము పడతారు. ఆ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసి పిదప ఆ మట్టి ప్రతిమలను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు.

కన్నె ముత్త్తెదువులు తీర్చిదిద్దిన ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు, వాటిలో బంతిపూల తళతళలు, పాటల మధురిమలు గ్రామాలకు, పట్టణాలకు వింత శోభలు చేకూరుస్తాయి.

వైజ్ఞానికంగా మనం ఎంత ఎదిగినా ఈ సంక్రాంతి అందచందాలు అడుగంటలేదు, పాతబడి పోలేదు. ఈ పండుగ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అది నిత్య నూతనం. భోగి మంటల్లో పాతబడిన ఆలోచనలు, పనికి రాని సంవేదనలు, నిరాశా నిస్పృహలు వంటి సమిధల్ని విసిరేయాలి. అదొక జ్వాలాయజ్ఞం. క్రాంతి కోసం జరిగే దీప్తిక్రతువు.

సూర్యుడు వేదంలో 'సత్యానికి' ప్రతీక, మనం కూడా సత్యరాశిలోకి ప్రయాణిద్దాం. అదొక ఆనంద సంక్రమణం. అంతకుమించిన అభ్యుదయం ఎక్కడ? ఒకరైతు ఈ పర్వంలో సంక్రాంతి స్వర్ణలక్ష్మిని చూసి ఆనందిస్తాడు. ఒక కవి తన కవితామృత స్వరూపాన్ని వీక్షిస్తాడు. ఒక అభ్యుదయవాది క్రాంతి హేలను దర్శిస్తాడు.

ఇటువంటి పండుగల పంచరంగుల స్వప్నాలు, కాలచక్రం రాల్చే స్వర్గాలు.

- కె. యజ్ఞన్న