ᐅకాల లీల


కాల లీల 

కరిగిపోయేది కాలం. కలలు కనిపింపజేసేది కాలం. అలలవలె మాయమైపోయేది కాలం. కాలానికి గాలంవేసే సాధనాలు ప్రపంచంలో లేనేలేవు. కాలానికి 'దాసోహం' అనకపోతే కాలం అసలే అంగీకరించదు. అలాంటి కాలానికి ఒక నమస్సు. కాలమే తొలి ఉషస్సు. కాలమే మహస్సు. కాలమే చివరికి తమస్సు.
మనిషి కాలంలోనుంచే పుట్టినా, కాలంలోనే జీవిస్తున్నా, కాలంలోనే లయిస్తున్నా అమూల్యమైన కాలాన్ని అనవసరంగా వ్యర్థం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి 'కాలస్పృహ' తక్కువే! కాలం మనిషిని ఎలా తెలియకుండా కబళించివేస్తుందో, ఆ తీరును పూర్వకవులు రమణీయంగా వర్ణించారు. వారి మాటల్లో కాలం ఒక మదపుటేనుగు వంటిది. మనిషి తుమ్మెదలాంటివాడు. తమ్మెద పద్మంలోని మకరందాన్ని గ్రోలడానికి పద్మం కర్ణికలోకి దూరింది. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. పద్మం ముడుచుకొని పోయింది. తమ్మెద పద్మంలోనే బందీ అయిపోయింది. అలా పద్మం అనే పంజరంలో చిక్కుబడిపోయిన తుమ్మెద ఏమనుకుంటుందో తెలుసా? 'ఈ రాత్రి శాశ్వతంగా ఉండదు కదా. కొన్ని గంటలలోనే ఇది అంతమైపోతుంది. మళ్లీ తెల్లవారుతుంది. సూర్యుడు వస్తాడు. ఈ పద్మం విచ్చుకొంటుంది. అప్పుడు నేను ఈ చెరసాలనుండి పారిపోవచ్చు. అంతవరకు హాయిగా నిద్రిస్తే మంచిది'. ఇలా అనుకుంటూ తుమ్మెద కళ్లు మూసుకుందో లేదో, వెంటనే ఆ పద్మసరోవరం దగ్గరికి జలక్రీడలు ఆడేందుకు ఒక మదపుటేనుగు వచ్చింది. దాహంతో ఉన్న ఆ ఏనుగు తొండంతో కడుపునిండా నీళ్లు తాగింది. అప్పుడు దానికి తామరతూండ్లను తినాలని కోరిక పుట్టింది. వెంటనే తుమ్మెద బందీగా ఉన్న పద్మాన్ని తొండంతో పట్టి, నాళంతో సహా పైకిలాగి కడుపులోకి తోసుకొని ఆరగించింది. అప్పుడు పద్మం, పద్మనాళాలతోబాటు తుమ్మెద కూడా మదపుటేనుగు పొట్టలోకి వెళ్లిపోయింది. ఇక్కడ తుమ్మెదకు 'కాలస్పృహ' లేదు. తెల్లవారేదాకా తాను బతికి ఉంటానని కలలు గన్నది. జీవితం క్షణికమని గ్రహించలేకపోయింది. ఈ తుమ్మెద లాంటివాడే 'మనిషి'. అతనికి ఎప్పుడూ కాలంపట్ల జాగరూకత లేదు. తాను 'శాశ్వతం' అనుకుంటాడు. కానీ క్షణంలో మాయమైపోయే వాడనని తెలుసుకోడు. అందుకే ఈ విషయంలో పెద్దల మాటల్ని గుర్తు చేసుకోవాలి. నిజంగా పెద్దల మాటలు చద్దిమూటలే! వాళ్ల ఆలోచనలో రేపటి పనిని నేడే చేయాలి. నేటి పనిని ఇప్పుడే చేయాలి. ఇప్పటి పనిని నిన్ననే చేసి ఉండాలి. ఈ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే- జీవితంలో అశాంతి ఉండదు. చేయవలసిందీ మిగిలి ఉండదు.

కాలగర్భం 'కృష్ణబిలం' లాంటిది. అందులోకి ఎన్ని దూరినా వాటి ఉనికి అణువంతైనా కనబడదు. దాని ఆకలికి అంతం లేదు. మహానుభావులూ, మహనీయులూ, మహాత్ములే కాదు అందరూ అందులో లీనం కావలసిందే. ఎవరికీ మినహాయింపు లేదు. ఎవరికీ తప్పించుకోవడానికి వీలుకాదు. ఏ పైరవీలూ అక్కడ పనిచేయవు. ఏ లంచాలూ అక్కరకు రావు.

కాలమహిమకు మహామహులే తలలు వంచారు. మనిషి ఎంత? కాలానికి 'దాసోహం' అంటూ శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లాడు. బలిచక్రవర్తి పాతాళానికి కుంగిపోయాడు. పాండవులు వనవాసాలు చేశారు. యాదవులు బలి అయ్యారు. నలచక్రవర్తి రాజ్యభ్రష్టుడయ్యాడు. అర్జునుడు వంటి వీరుడు నపుంసకుడయ్యాడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన రావణుడు పతనమయ్యాడు. వీళ్లందరిముందు మానవుడు చాలా అల్పుడే! కనుక మనిషికి కాలభయం ఉండాలి. పాపాలభయం ఉండాలి.

కాలం అంటే మృత్యువే. అది ఎప్పుడూ మనిషి భుజాలమీదే కూర్చొని ఉంటుందని అంటారు మహాకవులు. అది జుట్టు పట్టుకొని ప్రాణాలను హరించే లోపలనే మంచిపనులు చేయాలి. అంతేగాని కోరికలన్నీ ఉడిగిన ముసలితనంలో చేద్దాంలే అనుకుంటే ప్రమాదమే. అందుకే మంచిపనులకు వేగాన్నీ, చెడుపనులకు ఆలస్యాన్నీ అనుసరించాలని పెద్దలు అంటారు. పెద్దలు సంపాదించిన ఆస్తులను వారసత్వంగా అనుభవించే మనిషి, వారు ప్రబోధించిన మంచి మాటలనూ పరంపరగా లభించిన సంపదలుగా భావించి, కాలాన్ని వృథా చేయకుండా కర్తవ్యాలను సాధించడం ఎంతో మంచిది.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ