ᐅవివేకమార్గం
వివేకానందుని పేరు వినని భారతీయుడు ఉండడు. వివేకానందుణ్ని మరచిపోవడం అంటే భారతజాతిని, భారతీయ విజ్ఞాన సంపదను మరచినట్లే.
భారతదేశం గురించి తెలుసుకోవాలంటే, వివేకానందుణ్ని అధ్యయనం చేయాలి. ఆయనలో సక్రియాత్మక ప్రాభవమేకాని, నిష్క్రియాత్మకమైన ఛాయలు గోచరించవు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేటి భారతావనిని శక్తిమంతంగా ప్రభావితం చేసిన వ్యక్తిత్వ మహత్వం ఆయనది. ఆయన మూర్తీభవించిన ఒక అజరామరశక్తి. కర్తృత్వం ఆయన సందేశం. ఆయన దివ్యసందేశానికి మూలాలు గతకాలానికి చెందినవైనా, గతకాలపు వైభవ దీప్తి ఆయన నరనరాల్లో ప్రజ్వరిల్లుతున్నా, జీవిత సమస్యలను గురించి అత్యంత ఆధునికమైన రీతిలో ఆలోచించిన ప్రవక్త ఆయన. గతానికి, వర్తమానానికి మధ్య కాంతివంతెన ఆయన. భారతావనిని ముందుకు, మరింత ఔన్నత్యానికి సముద్ధరించాలన్నదే ఆయన ఆకాంక్ష. వివేకానందుడు నిరాశోపహతులకు నవోత్తేజం కలిగించిన ద్రష్ట.
'మనుషులను తయారుచేసే మతంకావాలి నేడు. మనిషిని బలహీనం చేసే తంత్రాలు, మార్మిక తత్వాలు మనకు వద్దు. మనోబలం కావాలి మనకు. మానవాళికి ఉపయోగపడని దేవతల్ని మనసునుంచి తుడిచిపెట్టండి. మేలుకున్న దైవం మానవజాతి. ప్రతిచోట ఆయన హస్తాలు, ఆయన పాదాలు, ఆయన నేత్రాలు, ఆయన వీనులు. ఆయన సర్వత్రా కంటికి కనిపిస్తున్నాడు. మనచుట్టూ ఉన్నవారిని ఆరాధించడమే మొదటి పూజ. మనం చూసే మనుషులు మన దేవతలు. మన దేశస్థులే మనం ఆరాధించే తొలిదైవాలు'- ఇవి అక్షరాలా, అక్షయ విస్ఫులింగాలా!
వివేకానందుడు హిందూధర్మాన్ని బతికించాడు. భారతదేశాన్ని రక్షించాడు. భారతజాతికి ఒక గమ్యం చూపించాడు.
మనం (అప్పుడు కాదు ఇప్పుడు కూడా) ఒక అగాధం అంచున నిలబడిఉన్నామని మనలో చాలామంది భావిస్తున్నారు. మానవతా, నైతిక విలువలు అడుగంటాయి. ప్రమాణాలు క్షీణించాయి. ఎవరికివారు ధర్మాన్ని, విధ్యుక్త ధర్మాన్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఉన్మత్త భూతంలాగా విరుచుకుపడుతున్న అనైతిక వాతావరణం, మానవాత్మత, మానవతా స్ఫూర్తిలో నమ్మకం పోవడం మానవ ఠీవికి, మానవ హోదాకు ద్రోహం చేయడమే. అది మానవ స్వభావాన్ని అవమానపరచడమే. మానవ ప్రకృతి, మానవ ప్రజ్ఞ ప్రపంచంలో ఎన్నో గొప్ప మార్పులను తెచ్చాయి. మనిషిలో అంతులేని ఆధ్యాత్మిక శక్తి సంపద ఉంది. అతని ఆత్మ అపురూపం. పరమోన్నతం. మనం ఎదుర్కొంటున్న ప్రమాదాలను, చేతకాని తనాన్ని, బలహీనతలను పారదోలే శక్తి ఎంతో నిరుపయోగంగా పడిఉంది. ఆ శక్తిని తట్టి లేపినవాడు వివేకానందుడు. బాధల్లో ఉంటే ఆశ కల్పించాడు. చీకటిలో మగ్గిపోయేవారికి వెలుగు చూపించాడు. 'బాహ్య రూపాలతో మోసపోవద్దు. వాటి వెనక ఒక వజ్ర సంకల్పం ఉంది... ఈ సృష్టికి పరమప్రయోజనం ఉంది. అది తెలుసుకుని జీవితాన్ని అటువైపు మళ్లిస్తే లక్ష్యాన్ని సాధించగలరు' అని మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. పరితపించే మానవాళి యుగయుగాలుగా కురిపిస్తున్న అశ్రుధారలకు కరిగిపోయాడు ఆయన. వారికి దూరంగా రమ్యహర్మ్యాల్లో వేదాంత గ్రంథాలు చదువుతూ పరవశించిన వేదాంతి కాదాయన. బీదవారిలో దైవాన్ని వీక్షించాడు. 'దరిద్రనారాయణుడు' అనే పదం ఆయన సృష్టించిందే. ఒకానొక దశలో ఆయన 'గొప్ప పుస్తకాలు, సాధన, దైవపూజ... ఇవన్నీ ప్రేమముందు ఎందుకూ పనికిరావు. అందరినీ ఆదరించడమే మోక్షం' అని అనగలిగిన తత్వవేత్త ఆయన. ఆకలిగొన్న వ్యక్తికి అన్నంపెట్టాలి. అంతకు మించిన మతంలేదని అనగలిగిన క్రాంతిదర్శి ఆయన.
మతం రహస్యం సిద్ధాంతాల్లో లేదు. ఆచరణలో చూపాలి. 'మంచిగాఉండు, మంచి చెయ్యి'- ఇంతకుమించిన ఆధ్యాత్మికత లేదు. మనిషి కదిలే దేవాలయం. మానవత్వం కదలని ప్రతిమ. ఇదీ ఆయన ప్రవచనాల సారం.
వివేకానందుడు ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకుని మార్చడానికి సాహసం చెయ్యడం- భారతదేశం మేలుకోవడమే కాదు, ఊపిరితీసుకుని ప్రపంచాన్ని జయించడానికి తొలిసంకేతం.
అగ్నిసూక్తంలాంటి ఆయన ప్రవచనంతో గతించిపోయిందనుకున్న ప్రాచీన భారతీయ సంస్కృతి, తిరిగి ప్రాణం పోసుకుంది. వివేకానందుడు భారతమాత గుండెలో, భారతీయుల ఆత్మల్లో ఇంకా స్పందిస్తున్నాడు
- కె.యజ్ఞన్న