ᐅవిశాల దృక్పథం
శిష్యుడు నిత్య దుఃఖితుడు దేనికీ తృప్తి చెందడు. దాన్ని గుర్తించాడు గురువు. ఒక రోజున అతని బాధేమిటని అడిగాడు.
'నాకు పరమానందం కలగాలి. లభించినదానితో సంతృప్తి చెందగలగాలి. అందుకోసం జ్ఞానం ప్రసాదించండి గురుదేవా!' అని అర్థించాడు శిష్యుడు.
అతణ్ని గుప్పెడు ఉప్పు తీసుకుని గ్లాసెడు నీళ్ళల్లో పోసి కలపమన్నాడు గురువు. ఆ నీళ్ళను గుక్కెడు తాగమన్నాడు. కొద్దిగా తాగి ముఖాన్ని వికారంగా పెట్టి గబుక్కున ఉమ్మేశాడు శిష్యుడు. నీళ్ళెలా ఉన్నాయని అడిగాడు ఆయన. కషాయంలా ఘోరంగా ఉన్నాయన్నాడు శిష్యుడు.
గురువు మందహాసం చేశాడు. మరో గుప్పెడు ఉప్పు తీసుకుని దగ్గర్లో ఉన్న చెరువు దగ్గరకు నడవమన్నాడు. నీళ్ళల్లోకి దిగి ఆ ఉప్పును పోసి బాగా కలపమన్నాడు. అప్పుడు గుక్కెడు నీళ్ళు తాగి ఎలా ఉన్నాయో చెప్పమన్నాడు.
శిష్యుడి ముఖం విప్పారింది. నీళ్ళు బావున్నాయన్నాడు. 'ఉప్పగా లేవా?' అని అడిగాడు గురువు. 'లేవు, ఉప్పు వెయ్యకముందు ఎంత తియ్యగా ఉన్నాయో... ఇప్పుడూ అంత మధురంగానే ఉన్నాయి' అన్నాడు శిష్యుడు.
అతని చేతులు పట్టుకుని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు గురువు. 'జీవితంలో ఎవరూ బాధలకు అతీతులు కారు. ఏ బాధయినా ఈ ఉప్పు లాంటిదే! అంతకన్న ఎక్కువా కాదు. తక్కువా కాదు. ఎప్పుడైనా ఆ బాధ పరిమాణం ఒక్కలాగానే ఉంటుంది. ఎటొచ్చి, అది మనం కలిపే నీళ్ళ పాత్ర పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. నీకు బాధగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినదల్లా నీ అంతరంగాన్ని మార్చుకోవటమొక్కటే! నీ దృక్పథాన్ని గ్లాసు పరిమాణానికి కుదించుకోకు. ఒక చెరువంత విశాలం చేసుకో! అప్పుడు ఏ బాధా నిన్ను కుంగదీయదు. ఏ అసంతృప్తీ నిన్ను కలచివేయదు. భగవత్ప్రసాదితమైన ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది!' అని బోధించాడు.
ఆ జ్ఞానబోధతో ఉత్తేజభరితుడైన శిష్యుడి ఒళ్ళంతా పరమానందంతో పులకెత్తింది. హృదయ భారం తగ్గి దూదిపింజలా మనసు తేలికపడింది.
- తటవర్తి రామచంద్రరావు