ᐅప్రసాద భావం
అనివార్యత... ఇది అనుభవంలోకి వచ్చినప్పుడే భగవంతుని ఉనికిని నమ్మాల్సిన అనివార్యత మనకెదురవుతుంది. నివారించలేని, అంగీకరించి తీరవలసిన స్థితే అనివార్యత. 'అన్ని పరిస్థితులూ మనకు లోబడే ఉంటాయి. మన శక్తి సామర్థ్యాల మీదే జీవితగమనం ఆధారపడి ఉంటుంది' అనుకోవటం కేవలం భ్రమ. అన్నీ మన ఇష్టప్రకారం, మన ప్రయత్నాలు, సామర్థ్యాల మేరకు జరిగిపోతున్నట్లే ఉంటాయి. అకస్మాత్తుగా మనం అనుకోని ఫలితం ఎదురవుతుంది. మనం వూహించనిది. మనం ఆశించనిది. నిరాకరించలేనిది. అంగీకరించి తీరవలసినది. చెడే కావచ్చు. మంచీ అయిఉండవచ్చు. అదే విధి. అదే భగవంతుని ఇచ్ఛ. భగవంతుడే లేకపోతే ఇలాంటి స్థితి మనకెదురుపడి ఉండేది కాదు. మన ఇచ్ఛ నడిచిఉండేది. మన శక్తి సామర్థ్యాల మేరకు ఫలితం వచ్చి ఉండేది. మనిషి ఇష్టానికి ప్రాధాన్యం లేదా, ప్రయత్నం అవసరమే లేదా? అది కాదు. అలా కాదు. ఉంది. పురుష ప్రయత్నం అనేది ఒకటుంది. మనిషి బుధ్ధిజీవి. జ్ఞానవంతుడు. అందుకే ఈ చరాచర సృష్టినంతా భగవంతుడే సృష్టించినా పురుష ప్రయత్నం చేసే కీలకమైన బాధ్యతను మనిషికిచ్చాడు. ప్రతి సంకల్పాన్నీ నెరవేర్చుకునే దిశగా విచక్షణతో ఆలోచించే, ప్రయత్నించే పురుష ప్రయత్నాన్ని చేయమని ఆదేశించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే పురుష ప్రయత్నం చేసే అధికారం ఉన్నందువల్ల మనిషి ఎంత ఎత్తులకైనా వెళ్ళే అవకాశం ఉంది. అయితే మళ్లీ ఇక్కడ భగవద్గీతను ఉటంకించుకుంటే మనిషికి ప్రయత్నం వరకే అధికారం ఉంది. ఫలితం మీద లేదు. మరెందుకు మనం ప్రయత్నం మాత్రం చేయటం... చేసిన ప్రయత్నానికి ఫలితం ఉండనప్పుడు? ఉంది. ఈ సృష్టి రహస్యం అదే. మన కనురెప్ప కదిలినా దాని ఫలితం దాని వెంటే ఉంటుంది. నలుగురు బిడ్డలున్న తల్లి బిడ్డల వయసును, అవసరాన్ని, ఆరోగ్యాల్ని, ఇష్టాయిష్టాలను గమనించి ఏ బిడ్డకా బిడ్డకు వారికి తగిన సరంజామాను అమర్చి పెడుతుంది. మరి విశ్వపిత, పరమ పిత అయిన భగవంతుడు ఎవరికేది ఇష్టమో అది ప్రయత్నించి నెరవేర్చుకొమ్మని విశృంఖలంగా వదిలివేయగలడా?
మనిషి తప్ప సృష్టిలోని మిగిలిన ప్రతిజీవీ అనివార్యతను ఔదల దాల్చుతోంది. పెనుగాలి వీచినప్పుడు గడ్డిపరక తల వంచుతుంది. తాము పెట్టిన పుట్టను పాములు ఆక్రమించుకున్నప్పుడు చీమలు మరో పుట్ట పెట్టుకునే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాయి. ప్రవాహం తన గమనానికి అడ్డువచ్చిన ప్రతిదాన్నీ వినమ్రంగా తప్పుకొని, వీలుగల దిశగా ప్రవహిస్తూ పోతుంది. పక్షులు, జంతువులు ప్రకృతికి, రుతు ధర్మానికి తలవంచుతూ అనువైన కాలం వచ్చేవరకూ వందలు, వేల మైళ్ళు ప్రయాణించి మరో సురక్షిత, సుభిక్ష ప్రదేశానికి వలసపోతున్నాయి. 'ప్రకృతి'ని అంగీకరిస్తూ, భగవంతుని ఏర్పాటును గౌరవిస్తూ సహజత్వానికి, సమతుల్యతకు భంగం వాటిల్లకుండా అనివార్యతను అనుమతిస్తున్నాయి. అంగీకరిస్తున్నాయి. జీవిత సహజంగా ఔదల దాలుస్తున్నాయి. ఇది వాటికే కాదు, మనిషికీ అవసరమే. అనివార్యమే. ప్రకృతిలో ఒక భాగమైన మనిషి ప్రకృతి ధర్మాన్ని, ప్రకృతి న్యాయాన్నీ, ప్రకృతి నియమాన్ని తానూ అనుసరించవలసిన అవసరం ఉంది. ప్రకృతి విరుద్ధత ప్రగతి శూన్యతకే దారితీస్తుంది. ప్రకృతంటే కేవలం ప్రాకృతిక పరిస్థితులే కాదు. జీవితంలోని అన్ని కోణాల్లోని అన్ని పరిస్థితులు. అన్ని అసమానతలు, అన్ని అననుకూలతలు. అన్నింటినీ సమదృష్టితో, ప్రసాద భావంతో స్వీకరించటమే జీవితపు మృష్టాన్న భోజనం.
- చక్కిలం విజయలక్ష్మి