ᐅసదా జయం జయం
'ఎవరేమి అనుకున్నా నువు ఉండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రీ నువ్వే. సైన్యం నువ్వే. ఏమైనా, ఏదైనా నువ్వు వెళ్లే బడిలోని పలకా నువ్వే, బలపం నువ్వే, ప్రశ్నా నువ్వే, బదులూ నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి. అనుకున్నది సాధించాలి' అన్నాడో కవి. ఎంత నిజం. భవిష్యత్తుపై కోటి ఆశలు పెంచుకుంటాం. ఆశతోపాటు ఆశయాన్ని మరవకుంటేనే అనుకున్నది సాధించగలుగుతాం. ఒక గమ్యమంటూ లేని వారికి ఏ లాంతరూ దారిచూపలేదు.
ఏ గొప్ప కార్యం సజావుగా పూర్తి చేయాలన్నా సకారాత్మక ఆలోచనలు ముఖ్యం. మనిషి ఆలోచనలు మాటలవుతాయి. ఆ మాటలే మనిషి చేతలవుతాయి. మనిషి పదేపదే చేసే చేతలు, పనులే అలవాట్లుగా మారతాయి. ఆ ఆలవాట్లే మనిషి శీలాన్ని నిర్దేశిస్తాయి. శీల సంపదే మనిషి జీవితానికి నిజమైన సోపానంగా మారి సర్వవేళలా విజయాన్ని చేకూరుస్తుంది. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది కలగదు. లక్ష్యం లేని జీవితం దారం తెగిన గాలిపటం వంటిది. తెడ్డులేని పడవలాంటిది. ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఎటువైపు వెళుతున్నామో తెలియదు. లక్ష్యంలేని జీవితంకన్నా, లక్ష్యం ఉండి అది సాధించే దిశలో ఓడిపోవడమే ఎంతో మేలైనది. నిరంతరం అద్భుతమైన కలలు కనాలి. ఆ కలలు పగటి కలలు కాకూడదు. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకొంటేనే స్వప్నం సాకారమవుతుంది.
జీవితంలో అందరికీ గెలుపు కావాలి. అయితే జీవితమే గెలుపు కాదు. జీవితంలో గెలుపు ఓ అంతర్భాగం మాత్రమే. గెలుపు ఎంత చిన్నదైనా మనిషి దాన్ని చిన్నపిల్లలా ఆస్వాదించగలగాలి. అప్పుడే ఎంత పెద్ద గెలుపైనా సుసాధ్యమవుతుంది. ఎవరికి వారు తమ దృష్టిలో గెలుపును నిర్వచించుకోవాలి. గెలుపంటే రాజ్యాలు జయించనక్కర్లేదు. కోట్లు సంపాదించనక్కరలేదు. మార్కులు, ట్రోఫీలు సంపాదించడం కాదు. గెలుపంటే ఆనందం. గెలుపంటే మానవత్వం. గెలుపంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గెలుపంటే ఇతరుల్లో మంచిని చూడటం. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ, స్నేహితులూ ఎవరు మిగలరు. మనిషికి ఎక్కువ మంది మిత్రులున్నా, ఎక్కువమంది శత్రువులున్నా- దానికి ప్రధాన కారణం వారి ప్రవర్తనే. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా!
జీవిత లక్ష్యం కేవలం జీవించడం కాదు. ఉన్నతంగా జీవించడం. ఉన్నతంగా జీవించాలంటే అచంచలమైన ఆత్మవిశ్వాసం కావాలి. తనమీద తనకు విశ్వాసం లేనివాడు ఇతరులను, ఈ సమాజాన్ని విశ్వసించడు. తద్వారా ఇతరులను నమ్మడు. మనిషి ఇతరులను నమ్మినా, నమ్మకపోయినా ఈ ప్రపంచం నడిచేది కేవలం నమ్మకంపైనే. ఇతరులను సుసంపన్నం చేయకుండా మనిషి సంపన్నుడు కాలేడు. అందుకే అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి. ఎవరు మంచి సూచన చేసినా దాన్ని ప్రసాదంలా స్వీకరించాలి. మనం వెతకవలసినది చెప్పేవారి కులగోత్రాలు కాదు. చెప్పినదానిలోని మంచి చెడులు.
మనిషి ఉన్నతంగా ఎదగడానికి తనకీ ప్రపంచం కావాలి. తాను ఉన్నతంగా ఎదిగాక ఈ ప్రపంచానికి తాను కావాలి. అందుకే ఈ ప్రపంచం గర్వించే విధంగా మనిషి ఎదగాలి. మనిషి మనసు లోతుల్లోని విషబీజాలను పెరికి వేయాలి. వసుధైక కుటుంబాన్ని నిర్మించే దిశలో తనవంతు పాత్ర పోషించాలి. దానికి ధైర్యం కావాలి. ధైర్యమంటే ఎప్పుడూ సింహంలా గర్జించనక్కరలేదు. మౌనంగా చీమలా తన పని తాను చేసుకుపోవడం కూడా ధైర్యమే అని మరువకూడదు. ఓ ఆటలో ఓడిపోతే తప్పు ఆ ఆటది కాదు. ఆ ఆటగాడిది. ఓటమిని చూసి భయపడకూడదు. ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో, ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది. జీవించు నీ జీవితం. సాధించు నీ ఆశయం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే!
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి