ᐅమంచి భావాలు




మంచి భావాలు 

'భావం' ఉదాత్తమైంది కావాలి. చిత్తవృత్తి శిరోధార్యంగా ఉండాలి. అది విశ్వజనీనమై వియత్తలాన్ని తాకాలేతప్ప నేలబారుతనాన్ని ఆశ్రయించకూడదు. అసలు భావనలోంచే కదా అమృతం పుట్టినా, హాలాహలం పుట్టినా. నిన్న, నేడు, రేపు- ఇలా ఏ కాలం వక్రించినా- దానిక్కారణం నూటికి నూరుపాళ్లూ భావమే. లోకం సుఖంగా ఉండాలని కోరుకొంటే చాలు! నా కల అక్కడే వెల్లివిరుస్తుంది. తానొక్కడే బాగుపడాలి- ఇతరులు కటికచీకట్లో కాళ్లీడ్చుకొంటూ సాగిపోయినా ఫర్వాలేదనుకొంటే నరకం అక్కడే నగ్ననృత్యం చేస్తుంది. అందుకే 'లోకాస్సమస్తా స్సుఖినోభవంతు...' అన్నారు పెద్దలు.
క్రౌర్యం, కాపట్యం- ఇవేవీ భావనావిహంగానికి రెక్కలు కాకూడదు. భావం మంచిదైనా ఒక్కోసారి పరీక్షకు ఎదురొడ్డి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆనాటి శ్రీరాముడు, హరిశ్చంద్రుడు... ఆఖరికి ఈనాటి గాంధీ ఎన్నెన్ని పరీక్షలనెదుర్కొన్నారు! అవన్నీ తాత్కాలికమే. గొప్ప భావం ఎప్పుడూ రేపటి దీపస్తంభమే! ఆ దీపకాంతిని ఎందరెందరో ఆస్వాదిస్తారు.

ఒక మొక్కను మంచి భావంతో నాటుతాం. దానికి చీడపట్టవచ్చు. అది పరీక్ష. ఆ సమయంలో కొంత చికిత్స చేయకతప్పదు. ఆ మొక్క ఎదిగి ఎదిగి ఆ తరవాత ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది... అదే దీపకాంతి!

రావణాసురుణ్ని తీసికొందాం. ఎంత గొప్ప శివభక్తుడైనా- భావం వక్రీకరించటం వల్లనే ప్రతినాయకుడిగా మిగిలిపోయాడు. విభీషణుడు అతడి సోదరుడే కదా! అభినందనీయుడయ్యాడు. ఈ రెండు పార్శ్వాలకూ భావమే ప్రాతినిధ్యం వహించింది. చీకటి వెలుగులే ఆ పార్శ్వాలు. ఒక భావం తమస్సులో కలిసిపోతే, మరొక భావం ఉషస్సులో రేగింది. ఇక్కడ చరిత్రను ఎవరో రాయలేదు. ఎవరికివారే రాసుకున్నారు. ఒకరికి మరొకరు బాధ్యులు కారు. ఆ ఇద్దరి ప్రవర్తన సరళిలోనూ సందేశం ఉంది. ఎలా ఉండకూడదో ఒకరు చెబితే, ఎలా ఉండాలో మరొకరు చెప్పారు.

విచక్షణాయుతమైన భావనాయోగం ఒక్క మనిషికే ఉంటుంది. పశుపక్ష్యాదులకు ఈ యోగ్యతలేదు. అందుకే మానవజన్మ మరీమరీ గొప్పది. మానవీయ మూల్యాలను పండించుకోవటంలోనే భావనాశిఖరాలు గోచరిస్తాయి. ఆ శిఖరాలకోసం జీవితాన్నంతా ధారపోయవలసిందే!

రామకృష్ణ పరమహంస చమత్కారంగా ఒక విషయం వివరిస్తారు. ఇది సన్న్యాసికీ, వేశ్యకూ సంబంధించిన కథ.

ఒక సన్న్యాసి- పైకిమాత్రం అన్నీ వదలుకొని- మనస్సును మాత్రం వేశ్య ఇంటికి వచ్చీపోయే విటులపై లగ్నం చేసిన కారణంగా నరకం ఆయన్ని రారమ్మని పిలిచింది- మరణానంతరం.

వేశ్య మాత్రం శారీరకంగా చెడ్డపని చేసినా- మనస్సును దైవంపైనే లగ్నం చేసిన ఫలితంగా- వైకుంఠం ఆమెను సాదరంగా స్వాగతించింది- మరణానంతరం.

ఇక్కడ చిత్తవృత్తే కీలకమైన పాత్ర ధరించింది. భావమే ఎవరికి ఏ దారి చూపించాలో అది చూపించింది.

'యద్భావం తద్భవతి' కదా! కాబట్టి భావంపట్ల ప్రతివ్యక్తీ అనుక్షణం అప్రమత్తతతో మెలగవలసిందే!

- రసరాజు