ᐅనుక్షణం ఆనంద పరవశం
'ప్రతి క్షణం సాధనే, ఆ సాధనలోనే జీవన సాఫల్యం' అన్నారు ఆధ్యాత్మికులు. ఏమి సాధన చెయ్యాలి, ఎలా సాధన చెయ్యాలి? ఈ ప్రశ్నలు ఏదో ఒక దశలో సామాన్య మానవుడికి తప్పకుండా ఎదురవుతాయి.
ఎన్నో నీటి బిందువులు కలిస్తే సముద్రం. అలాగే ఎన్నెన్నో క్షణాలు కలిస్తేనే జీవితం. సముద్రపు లోతును కొలవవచ్చు. జీవితపు లోతులు కొలవటానికి ప్రమాణాలేవీ? అలా కొలవాలంటే ప్రతి క్షణాన్నీ చూడగలగాలి. మనసు జరుగుతున్న క్షణాలను చూడనీయకుండా అనేక విషయాలతో కప్పి మరుగున పెడుతుంది. అది తెలుసుకుని ఆ బాహ్యపొరల ఆవలితీరంలోని సత్యమైన ఆ క్షణాన్ని చూడటం సాధన చేయగలిగితే- లోతైన జీవనమాధుర్యాన్ని సాధించవచ్చు.
మనిషి ఎన్నెన్నో క్షణాలను తనకు తెలియకుండానే కలగా గడిపేస్తాడు. ఆధ్యాత్మిక జీవితం పట్ల అవగాహన ఉన్నవారుమాత్రం వాస్తవమైన క్షణాలను తెలుసుకోగలుగుతారు, వ్యర్థంగా గడిచిపోయే క్షణాలను అవగతం చేసుకోగలుగుతారు.
మనిషి జీవితకాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు. భౌతికంగా సామాజికంగా ఎన్నెన్నో సాధించవచ్చు. అయితే ఎంతసేపు తనతో తాను గడపగలుగుతున్నాడు? ఇలా ఆలోచిస్తే, నిశ్చలమైన క్షణాలు ఏవీ అని లెక్క చూసుకుంటే మిగిలేది శూన్యమే. అది తెలుసుకుని, ఆ నిశ్చలమైన క్షణాలకోసం పడే తపన... భగవంతునికోసం పరితపనే! అదే సాధన... చివరకు సాధ్యపడే భగవంతుడి ఆరాధన!
జరుగుతున్న ప్రతి క్షణాన్ని తన కనుసన్నలలో ఉంచుకోగలిగితే, తన గమనికలోనుంచి ఒక్క క్షణాన్నీ చేజారనీయక అప్రమత్తంగా ఉండగలిగితే- ఆనందానికి మార్గం తెలుసుకున్నట్లే.
శరీరం, మనసు ఏకమై ఆ క్షణంలో ఇమడగలిగితే, కాలప్రవాహం గమనికలో సాగిపోతుంటే- భగవంతుడే దిగిరాడూ! ఆపాదమస్తకం కదిలి శరీరంలోని ప్రతి కణం, ప్రతి నాడి శుద్ధమై, వెన్నుపామునుంచి మెదడుకు ఆనందవీచికలు పరవళ్ళు తొక్కుతూ సాగే ప్రయాణంలో పొందే నిశ్చలత్వం... భగవంతుడిని వీక్షింపజేయదూ! అంతకంటే జీవితానికి కావలసిందేముంది? దాని ముందు ఆస్తులు, అంతస్తులు, హోదాలు తీసికట్టే! అలా నిరంతరం గతంతో కలవరపరచే మనసు, భవిష్యత్తుకు భయపడే మనసు నిశ్చలమవుతాయి. అందులోనే భద్రత, స్వేచ్ఛ సమస్తం రుచి చూడగలదు. ఆనందపు అంచులు అందుకోగలదు. అంతటి అపూర్వమైన క్షణాల్ని అందుకోవాలంటే ఎంత సాధన చెయ్యాలి? జీవితకాలం మొత్తం చెయ్యాలి.
జరుగుతున్న ప్రతి క్షణాన్ని సూటిగా చూడాలి. కష్టమైనా, సుఖమైనా, లాభమైనా, నష్టమైనా అనుభవించాలి. అలా సంపూర్ణంగా ఆ క్షణంలో ఉండగలిగే మనసు దేనినైనా శోధించగలదు, సాధించగలదు. అదే పొందగలిగితే ఏదో ఒకరోజు ఆ నిర్నిభేద్యుడైన పరమాత్ముడు కనికరించకపోతాడా! కన్నుల ముందు సాక్షాత్కరించకపోతాడా! ఆనంద మయమైన జీవనసాఫల్యాన్ని అందించకపోతాడా! అందుకే ప్రతి క్షణాన్ని జీవిద్దాం. ఆనందాన్ని కైవసం చేసుకుందాం, అనుక్షణం ఆనందపరవశులమవుదాం.
- డాక్టర్ డి.చంద్రకళ