ᐅబోధామృతం





బోధామృతం 

మనిషి తనకున్న స్వల్ప జీవనకాలంలో ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి- వంటి అనేక ప్రశ్నలకు విజ్ఞుల బోధలు సమాధానమిస్తాయి. విజ్ఞత కొందరికి జన్మతః లభిస్తుంది. విదురుడు అందుకు ఉదాహరణ. కొందరు జీవితానుభవాల పాఠాలను పదిలపరచుకుని, తరవాత తరాలవారికి బోధిస్తారు. అంపశయ్యమీది భీష్ముడు అంపశయ్యమీద ధర్మరాజుకు చేసిన బోధలు అలాంటివే. కొందరు తపోసిద్ధిగా జ్ఞానలబ్ధి పొందుతారు. అలాంటి వారిది దివ్యజ్ఞానం. వారివి దివ్యబోధలు. గౌతమబుద్ధుడు అటువంటి బోధలే చేశాడు. మహాత్ముల బోధలన్నీ మానవాళిని ఉద్ధరించడానికే. ఆ బోధల్ని స్వీకరించి, ఆచరణయుక్తం చేసుకోగలిగినవారే ప్రయోజనం పొందగలుగుతారు. పరశువేది లోహాన్ని బంగారంగా మార్చగలదు. శిలల్ని మార్చలేదు. మనిషి వ్యక్తిత్వం కూడా పరివర్తనకు అనుకూలంగా ఉండాలేతప్ప శిలా సదృశమైన కఠినత్వంతోనో ఉండకూడదు. స్వాతి చినుకులు ముత్యపు చిప్పలో పడితేనే ముత్యాలవుతాయి. మనిషి మనసు ముత్యపు చిప్పలా ఉండాలి. మంచి మాటల్ని స్వీకరించి, మేలిమి ముత్యాల్లా మార్చుకోగలగాలి.
ఒక్కోసారి ఎంత మంచివారైనా దుర్బోధల ప్రభావంలో పడిపోతుంటారు. కౌసల్యకన్నా అధికంగా మాతృత్వ భావనతో శ్రీరాముణ్ని సాకిన కైకేయి- మంధర మాటల మాయాజాలంలో చిక్కుకుని, తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది. తత్ఫలితంగా దశరధుడి మరణం, పుత్రుడు భరతునితో వైరం, శ్రీరాముని వనవాసం వంటి అనర్థాలు, అవాంఛిత సంఘటనలు సంభవించాయి. దుర్బోధలు విషం లాంటివి. శీఘ్రంగా మనసును వశం చేసుకుని వినాశానికి దారి తీస్తాయి. శకుని బోధల వల్ల దుర్యోధనుడు దుశ్చరితుడై చివరకు సర్వనాశనమైనాడు. శ్రీకృష్ణుడు అమృత సమానమైన తన బోధలతో పాండవులను ధర్మపథంలో నడిపించాడు. అనేక కష్టాలు సంభవించినా, ధర్మపథాన్ని వీడక, శ్రీకృష్ణుడి బోధలు పెడచెవిన పెట్టకుండా, శత్రువర్గంలో సైనికబలం అధికంగా ఉన్నా పాండవులు అంతిమ విజయం సాధించారు. వర్తమాన ప్రపంచంలోనూ బోధలకు విశేష ప్రాధాన్యముంది. రామకృష్ణ పరమహంస బోధల్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అనుయాయులు ప్రచారం చేస్తున్నాడు. మనోకాలుష్యాలనుంచి మానవాళి కోలుకోవడానికి మానవత్వ పరిమళాలు, విలువలు తరిగిపోకుండా తరతరాలుగా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఆత్మను, అంతరంగాన్ని పరిశుద్ధం చేసి అంతర్యామిని దర్శింపజేసేవే. మనం వాటికి దూరంగా ఉన్నంత కాలం- కిటికీలోంచి చందమామను చూస్తున్నట్లే.

మనసుకున్న అవరోధాల్ని తొలగించుకుంటూ, మనలోంచి మనం బయటపడాలి. ఆధ్యాత్మిక వెన్నెల ఆనందాన్ని అనుభవించడానికి తొలిమెట్టుగా అమృతసమానమైన దివ్యబోధల సంజీవినిని స్వీకరించాలి. అప్పుడు కాలనాగు కాట్లన్నీ మానిపోతాయి. కొత్తజీవితం మొదలవుతుంది. మనలో మచ్చుకైనా అసూయ, ద్వేషం, స్వార్థం వంటివి లేనప్పుడు ప్రపంచమంతా ఆనందనిలయంగా అలరిస్తుంది. అదే బోధామృత ప్రయోజనం.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్