ᐅదయానంద దర్శనం




దయానంద దర్శనం 

సకల సత్యాలకు, అత్యున్నత ఆధ్యాత్మిక విజ్ఞానానికి వేదాలే మూలస్తంభాలని, వేదాల పునాదులపై హైందవ పునస్థాపన జరగాలని అభిలషించిన వైదికధర్మ ప్రచారకుడు, ఆధునిక సంస్కర్త దయానందసరస్వతి. 'వేదాల వైపు మళ్లండి' అన్నది ఆయన నినాదం.
ప్రతి మతంలో సాధారణంగా ఏదో ఒక విధమైన కర్మకాండ కనిపిస్తూనే ఉంటుంది. బాహ్యమైన ఈ కర్మకాండ సంకేతాత్మకమైనది. మానవుని ఆంతరిక వికాసాన్ని ఉద్దేశించినది. ఇది ఒక్కొక్కప్పుడు వెర్రితలలు వేసి సమాజాన్ని కలుషితం చేస్తుంది. ఆ దశలో సంస్కర్తలు ఆ కాలుష్యాన్ని తొలగించే కృషి సాగిస్తారు.

పద్నాలుగేళ్ల వయసులో మహాశివరాత్రి నాటి రాత్రి సమయంలో శివప్రతిమ ముందుపెట్టిన ప్రసాదాన్ని ఎలుక తీసుకుపోవడం చూసిన దయానందుడిలో విగ్రహారాధన పట్ల నిరసన భావం కలిగింది. భగవదారాధనలో ఉత్తమ పద్ధతి మానసికారాధనే అనే సంప్రదాయ విశ్వాసం ఆయనను ప్రభావితుని చేసింది.

దయానందుడు 15 సంవత్సరాల పాటు అడవుల్లో, హిమాలయాల్లో, తీర్థ క్షేత్రస్థలాల్లో సంచరించి సాధువులతో చర్చలు జరిపి జ్ఞానం సముపార్జించారు. మధురలో స్వామి విరజానందుని శిష్యులయ్యారు. సన్యాసం స్వీకరించి సమాజ కార్యానికి అంకితమయ్యారు.

దయానందుడు తీవ్ర జాతీయ వాది. హిందువుల్లో దైవభక్తి, మానవ సేవ ప్రాధాన్యం వహించాలని సోమరితనం, ఉదాసీనత విడిచిపెట్టి నైతికనిష్ఠ, కార్యశూరత్వం, సమైక్య భావంతో వివేకవంతమూ, నిరాడంబరమూ అయిన జీవితాన్ని గడపాలని ఆయన అభిలషించారు. ఒక భాష, ఒక ధర్మం, ఒక లక్ష్యం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన దృఢ విశ్వాసం. అనాథలకు, బీదలకు మంచి విద్య లభించాలని, విదేశీ ప్రభావాలను తొలగించి పాలకులు ఆధ్యాత్మిక నైతిక శక్తులకు వశులై ఉండాలని సర్వమానవ శ్రేయమే ప్రభుత్వ లక్ష్యం కావాలని ఆయన ఉద్బోధ.

దయానందుడు స్థాపించిన ఆర్య సమాజం ఆనాటి గొప్ప చారిత్రక అవసరం. రాజా రామ్మోహనరాయ్, మహాత్మాగాంధీల మధ్య కాలంలో హిందూ ధర్మ సంస్కృతులను బలపరచి విశేష ప్రచారంలోకి తెచ్చిన జాతి నిర్మాత దయానందుడు. మహిళా స్వాతంత్య్రం, స్త్రీవిద్య, వితంతు పునర్వివాహం తదితర అంశాల్లో దయానందుడు గొప్ప విప్లవవాది. స్త్రీలు యజ్ఞాలు చేయవచ్చునని, గాయత్రీ మంత్రోపదేశం పొందవచ్చునని, గుణకర్మలను బట్టి వర్ణ వ్యవస్థ ఉండాలని ఆశించిన క్రాంతిదర్శి దయానంద సరస్వతి. జ్ఞాన భాండాగారాలైన వేదాలకు భాష్యంరాసి, వైదిక ధర్మానికి అద్దంపట్టే 'సత్యర్థ ప్రకాశిక' సిద్ధపరచారు. దయానందుడి తాత్త్విక చింతన, ఆయన భావనలను విశదంచేసే గ్రంథం అది. అస్పృశ్యత, పరదాపద్ధతి, బాల్యవివాహాలు మొదలైన ఛాందసవాదాలెన్నింటినో వ్యతిరేకించిన ఆయన తీవ్ర సంస్కరణ భావాలకు దర్పణం ఆ గ్రంథం.

భారతీయుల్లో తమ దేశంపట్ల, ఆర్యధర్మంపట్ల, ఆర్య గ్రంథాల పట్ల భక్తి విశ్వాసాలు కలిగిస్తూ జాతిలో ఆత్మవిశ్వాసం పునరుజ్జీవింపజేసిన మహాపురుషుడిగా దయానంద సరస్వతి చిరస్మరణీయులు.

- డాక్టర్ డి.వి.సూర్యారావు