ᐅ పుష్యమాసం



పుణ్యప్రదం పుష్యమాసం 

పుష్యమీ నక్షత్రం పున్నమినాటి చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన గణన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. చాంద్రమాన, సౌరమాన గణనల రెండింటి ప్రకారం ఏర్పడే పండుగలు వస్తాయి ఈ మాసంలో. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం.
పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. ఇతడు బుద్ధి కారకుడు. అందువలన బృహస్పతికీ శనికీ అత్యంత ప్రీతికరమైనదీ మాసమని చెబుతారు. శనిపేరు వినగానే ఉలిక్కిపడతారు చాలామంది. అతడు హాని కారకుడనే నమ్మకమే దీనికి కారణం. నిజానికి శని సత్యధర్మాలను సమానంగా పాటించేవాడు. ఆరాధించేవారిని అనుగ్రహించే తత్వంకలవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చేనూనె. కాబట్టి ఈ మాసంలో వాటితో ఆయనను అభిషేకించి, పూజించాలని, దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్ర వచనం.

బాహ్య భావనలు ఇవైనా, అంతరార్థం లోతైనది. హేమంత (హిమం=మంచు) రుతువులో ఇది రెండో మాసం. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. అందువల్లే 'పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు' అనే నానుడి ఏర్పడింది. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైల గ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ తైల (తైలం=తిలల (నువ్వుల) నుంచి తీసినది) అభ్యంగనం. శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేది ఉష్ణోగ్రత. ఇది శరీరంలోని ధాతువుల్లో ఉండే కొవ్వు పదార్థాలపై ఆధారపడి ఉంది. ఈ మాసంలో అవి మందగించడంవల్ల తైలశాతం తగ్గుతుంది. దాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం నువ్వులు, బెల్లం కలిపి తినడం. బెల్లం ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్య ప్రదమైన పదార్థం. దీనివల్ల రక్తవృద్ధి జరుగుతుంది. ధాతు పుష్టి కలిగి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందువల్లనే ఈ నెలలో వచ్చే పండుగలన్నింటిలోనూ తైలాభ్యంగనం తప్పనిసరి అంటారు.

ఈ మాసంలో శుక్లపక్ష విదియనాడు ఆరోగ్య వ్రతం చేస్తారు. దీనికి 'ఆరోగ్య విదియ' పేరు. శుక్లపక్ష షష్ఠి కుమారషష్ఠి. కుమారస్వామిని ఇలవేలుపుగా కొలిచే ప్రాంతాల వారు ఆయనను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శుక్ల అష్టమినాడు సంజ్ఞిక అనే శ్రాద్ధం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శుక్లదశమి శాంబరీ (రతీదేవి) దశమి. శివపార్వతులను కలిపే ప్రయత్నంలో శివుని ఆగ్రహానికి గురై భస్మమయ్యాడు మన్మథుడు. అప్పుడు రతీదేవి తన కోసం కాకపోయినా, సృష్టి గమనం సక్రమంగా సాగడం కోసమైనా అతడిని బతికించమని కోరింది. సఫలత సాధించింది. లోకోపకారం కోసం ఎంతగానో మథనపడి భర్తను బతికించుకున్నందుకు కృతజ్ఞతగా ఈ వ్రతంచేసి రతీదేవిని పూజిస్తారు. ఒడిషాలో ఈ ఆచారం ఎక్కువ. శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి. దీనికి నందైకాదశి అని పేరు. సంతానం లేనివారు ఈ రోజు లక్ష్మీనారాయణుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

పుష్యమాసం అనగానే గుర్తుకు వచ్చేది ధాన్యలక్ష్మి. ధనుర్మాసం పంట ఇంటికి చేరి ధాన్యరూపంలో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. కాబట్టి పౌష్యలక్ష్మిగా పిలుస్తారు. రంగవల్లులు, ధనుర్మాస వ్రతాలు, గొబ్బెమ్మల అలంకారాలు... వీటన్నింటి సందడీ అంతా ఇంతా కాదు. తెలుగువారు పాటించేది చాంద్రమానమైనా, సౌరమాన గణన ప్రకారం జరిపించుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇది మూడు రోజుల పండుగ. సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశించే రోజు ఇది. తమ వంశంలో గతించిన పితృదేవతలనందరినీ స్మరిస్తూ పూజిస్తారు ఈ రోజున.

- అయ్యగారి శ్రీనివాసరావు