ᐅఅనుసరణీయమార్గం



అనుసరణీయమార్గం 

మనిషిని చెడగొట్టడంలో డబ్బు, యౌవనం ప్రధానపాత్ర వహిస్తాయి. మనిషికి డబ్బు సంపాదన మీద ఉండే వ్యామోహానికి అంతులేదు. డబ్బుకోసం అతడు చేయని దుష్కృత్యం లేదు. గుట్టలుగా పేరుకొనిపోతున్న పాపాల్లో డబ్బుశాతమే అధికం. డబ్బును సంపాదించవలసిందే. కానీ అధర్మ మార్గంలో కాదు. ధర్మమార్గంలో సంపాదించాలి. ఎవరికీ కష్టాన్ని కలిగించకుండా, నష్టానికి గురిచేయకుండా, నిజాయతీకి చేటు కలగకుండా సంపాదించాలి. ఇలా సంపాదించాలంటే డబ్బు పరిమితంగానే లభిస్తుంది. అన్నవస్త్రాదులకు లోటు ఉండదు.
అయితే మనిషికి బలహీనతలు, వ్యామోహాలు, విలాసాలు ఎక్కువ. అందుకే ధర్మమార్గంలో వచ్చే పరిమితాదాయాన్ని అతడు ఏమాత్రం ఇష్టపడడు. అతనికి డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుండాలి. కట్టలకు కట్టలు పెట్టెల్లో నిండాలి. అలా సంపాదించే డబ్బుకు లెక్కాపత్రం ఉండకూడదు. అవినీతితో అయినా సరే అపారంగా ధనరాశులు కావాలి. ఇదే డబ్బుమనుషుల మార్గం. ఇది అనేక కంటకాలమయమనీ, ఇందులో ఎన్నో విషసర్పాలుంటాయనీ తెలుసు. అయినాసరే 'నల్ల'ధనంకోసం తల్లడిల్లేవారే అధికులు. ఈ మార్గం అనుసరణీయమా అంటే కానేకాదని చెప్పాలి.

డబ్బు ఎప్పుడూ కష్టాలనే కలిగిస్తుందని మహర్షులు చెబుతారు. వారి మాటల్లో చెప్పాలంటే 'డబ్బును సంపాదించడమే ఒక కష్టం... అలా సంపాదించినదాన్ని ఎవరూ దొంగిలించకుండా, ప్రభుత్వం కంటపడకుండా దాచడం ఒక కష్టం... ధనం అపారంగా వచ్చిపడుతున్నా కష్టమే... దాన్ని ఖర్చుచేయాలన్నా కష్టమే... ఇలా కష్టాల పరంపరకు ధనమే మూలం.

యౌవనం కూడా ఇలాంటిదే. ఈ ప్రాయంలో కామానికి లొంగనివారు తక్కువ. అందాలెన్నో ఆకర్షించే ఈ వయస్సులో తొందరపడితే ఏం జరుగుతుందో, పర్యవసానంలో కానీ తెలియదు. చేతులు కాలిన తరవాత కానీ ఆకులు పట్టుకోలేకపోవడం ఈ వయస్సు నైజం. ఎంతటి విద్వాంసుణ్ని అయినా ఇంద్రియసమూహం లాగి, తన వశం చేసుకుంటుంది. కామంలో బుద్ధి పనిచేయదు. వివేకం ఉదయించదు. సిగ్గు జారిపోతుంది. విచక్షణజ్ఞానం నశిస్తుంది. కామాన్ని అనుభవిస్తున్నకొలదీ పెరుగుతుందే కాని తరగదు. ఒక తృప్తి మరొక అసంతృప్తికి ఆజ్యం పోస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మండుతున్న అగ్నిజ్వాలలో నేయిపోస్తే ఏమవుతుందో యౌవనంలో సుఖానుభవంలోనూ అదే అవుతుంది. అందుకే పెద్దలు ధర్మబద్ధమైన కామాన్నే కోరుకోవాలంటారు. ధర్మానికి లోబడిన కామం శరీరానికీ, మనసుకూ హితాన్ని కలగజేస్తుంది. అధర్మంతో ఆచరించే కామం ఆరోగ్యాన్ని నశింపజేయడమేగాక, మనస్సులో పాపభీతిని పెంచి, అశాంతికి కారణమవుతుంది.

అర్థకామాల మీద అనవసరమైన ఆసక్తి పెరగకుండా ఉండాలంటే రెండు మంచి మార్గాలున్నాయని హితోపదేశకారుడు అంటాడు. వాటిలో మొదటిది, సుభాషితాల్లోని పరమార్థాన్ని గ్రహించడం. రెండోది, మంచిమిత్రులతో స్నేహం చేయడం. ఈ రెండూ చేస్తే డబ్బు మీద, కామం మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. అప్పుడు మనిషి 'నిండు చందమామ' అవుతాడు.

నిజంగా చెప్పాలంటే- సంపదలు పాదధూళివంటివే. యౌవనం కొండలపైనుంచి జారిపడే నదీజలం వంటిది. ఆయుష్యం నీటిబుడగవలె క్షణికమైంది. జీవితం కెరటాలపైన ఉండే నురగలాంటిది. ఇలాంటి వాటిని పట్టుకొని, శాశ్వతాలని అనుకోవడం భ్రమ. అందువల్ల మనిషి బతికినంతకాలం ఆగకుండా మంచి పనులు చేస్తుండాలి. ధర్మమే శ్రేయస్కరమైన, అనుసరణీయమార్గమని తెలుసుకోవాలి.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ