ᐅదివ్యభావన


దివ్యభావన 


మనకు జీవితంలో అనుకోని ఇబ్బంది ఎదురుకావచ్చు. ఎన్నడూ ఎరుగని కష్టం కలగవచ్చు. వూహాతీతమైన ఆశాభంగం ఏర్పడవచ్చు. అన్నీ అనుకున్నట్లు ఆశించినట్లే జరగవు. ఇతరుల వ్యాఖ్యానాలు విని వాటికి మనమిచ్చిన జవాబులు నెమరువేసుకుంటే చాలా విషయాల్లో మన బాధలన్నిటికీ ఎవరో కారకులైనట్లు భావిస్తున్నామనిపిస్తుంది. అప్పుడు మన మనసే కాదు, నోరు కూడా చేదెక్కిపోతుంది. అలాంటి అనుభవానికి కుంగిపోక జీవితాన్ని మరో కోణంలో చూస్తే, దీనికి పూర్తిగా భిన్న భావన కలుగుతుంది.
1930లలో అమెరికాను తీవ్రమైన ఆర్థిక మాంద్యం కుంగదీసింది. ఆ సమయంలో ఒక ప్రభుత్వాధికారి దేశంలోని అత్యంత పేద ప్రాంతానికి వెళ్ళి బీద రైతులకు ఉచిత విత్తనాలు అందజేయడం, పూరిళ్ళు బాగుచేయించటం, పశువుల శాలల్ని అభివృద్ధి చేయించటం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో మట్టి నేల ఇంట్లో ఉంటున్న ఓ వృద్ధ స్త్రీని కలిశాడు. కిటికీలకు గోనెగుడ్డలు కట్టుకుని చలినుంచి తనను తాను కాపాడుకుంటూ ఆమె ఒక్కపూట తిండితో ఎలాగో రోజులు గడుపుతోందని తెలుసుకున్నాడు. 'నీకు ప్రభుత్వం ధనసాయమందిస్తే ఆ పైకంతో ఏం చేస్తావమ్మా?' అని ఆమెనడిగాడు. 'అసలు ఏ ఇల్లూ లేనివారికిస్తా!' అంది ఆమె.

ఒక రాజును ఎంతో భక్తితో సేవిస్తున్నాడు ఆయాజ్. ఓసారి రాజు సమక్షంలో ఉండగా దోసకాయతో ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది అతను. రాజుగారిచ్చిన దోస ముక్కల్ని నిస్సంకోచంగా చకచకా నమిలి తినేశాడు ఆయాజ్. దోసముక్కను కొరికి తుపుక్కున ఉమ్మేసిన రాజు 'చేదువిషంలా ఉన్నదాన్ని ఎలా తిన్నావురా?' అని ఆశ్చర్యంగా అడిగాడు. 'ఇన్నేళ్ళుగా మీ దయవల్ల ఎన్నో తీపి మిఠాయిలు తిన్నాను. ఇప్పుడూ నా ఆకలి తీర్చటానికే మీరీ దోసకాయ ముక్కలు ఇచ్చారు. మీరింత దయతో ఇచ్చినవి తీపిగా కాకుండా మరోలా ఎలా ఉంటాయి ప్రభూ?' అన్నాడు ఆయాజ్. భగవంతుణ్ని ఆరాధించేవాడికి ఏది జరిగినా తన మంచికేననిపిస్తుంది. అదంతా ఆయన కృపాకటాక్ష వీక్షణ భాగ్యమనే అనిపిస్తుంది. ఎంత ఇబ్బందిలోనైనా చేదు భావన కలగదు. అంతా మధురమే!

ఎండ కాచిన రోజుల్ని ఎంత సంతోషంగా ఆహ్వానిస్తామో, కారుమబ్బుల రోజుల్నీ అంతే కృతజ్ఞతా భావనతో ఎదుర్కోగలగాలి. అప్పుడే జీవితంలో ప్రేమ, శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. సంతృప్తితో జీవితాన్ని నింపుకోవటమే కాదు, ఈ భగవత్ సృష్టిలో ప్రతి ఘటననీ మనసారా స్వాగతించగల హుందాతనాన్ని పెంపొందించుకోగలగాలి.

అమెరికాలోని వృద్ధ వనితైనా, ఆయాజ్ అయినా జీవితంలోని ఒడుదొడుకుల్ని ఎంతో ఉదాత్తంగా ఎదుర్కోగలిగారు. ఇలాంటి విశాల దృక్పథానికి ఆధ్యాత్మిక చింతనా తోడైతే 'మనకేమైనా ఫర్వాలేదు. మనమేం చేసినా ఎవరికో ఒకరికి ప్రయోజనం కలగాలి' అన్న ఆలోచన నిలబడుతుంది. పరోపకారం చేయాలన్న తలంపును మించిన దివ్యభావన ఏముంటుంది? ఆ ఆనందం అనుభవించినవారికే అర్థమవుతుంది!

- తటవర్తి రామచంద్రరావు