ᐅనిత్య చైతన్యం



ᐅనిత్య చైతన్యం 

అలసిపోయిన దేహం ఒకింత సేద తీరడం సహజం. కానీ- 'ఇన్నాళ్లూ కష్టపడ్డాను. ఇక నాకు విశ్రాంతి అని, బాధ్యతలనుంచి విరమణ లభించిందని భావిస్తూ మిన్నకుండటం అసహజం. సృష్టిధర్మానికే విరుద్ధం.
సృష్టిక్రమం నిరంతరం కొనసాగిపోతూనే ఉంటుంది. ప్రకృతిలోని రుతువుల గమనం, గ్రహరాశుల గమనమూ సాగిపోతూనే ఉంటాయి. కాలం, ప్రవాహం కదలిపోతూనే ఉంటాయి.

అలాగే శారీరక మానసిక పరిశ్రమా నిరంతరమూ సాగిపోవాల్సిందే. చెలమలోని నీరు తోడేస్తుంటేనే పరిశుద్ధ జలం వచ్చి చేరుతూంటుంది. దేహంలోని శక్తి ఎప్పటికప్పుడు విడుదలవుతుంటేనే, నూత్న శక్తి వచ్చి చేరుతుంది.

మరెందుకీ కావాలని తెచ్చిపెట్టుకునే జడత్వం? 'నాకిక విశ్రాంతి తీసుకునే కాలమే ఇది' అంటూ శక్తిహీనులం కావడం దేనికి? శ్రమించని దేహం శవంతో సమానమంటారు.

పైబడుతున్న వయసు వృద్ధాప్యాన్ని తెస్తుంది. వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగిపోయే స్థితి సహజమే. బాధ్యతల రాపిళ్లలో మనసూ అలసిపోయి ఉంటుంది.

అలాగని వాటి మానాన వాటిని వదిలేయడం, 'విశ్రాంతే ఇక పరమౌషధం' అన్న చందాన సాగితే- దేహం శిథిలమైపోతున్న చిహ్నంగా స్ఫురించకమానదు.

వయసు పైబడినా నిరంతరమూ కృషిచేస్తూ, వివిధ రంగాల్లో సుఫలాలను అందించిన, అందిస్తున్న వారెందరు లేరు!

వారి అనుభవాలు, జీవన గమనం కొండంత స్ఫూర్తిగా నిలుస్తుంది భావితరాలకు.

'నాకు ముదిమి రావచ్చు గాక... నా ఆశయాలు నిత్య శోభితాలే. శారీరక బలం కరిగిపోవచ్చు గాక... మనోబలం వాడిపోలేదు... భగవంతుణ్ని సిరిసంపదలు, సుఖసంతోషాలు ప్రసాదించమని కోరడంలేదు. శ్రమించే తత్వాన్ని, ఆఖరిక్షణం వరకు ఆరోగ్యకరమైన మనసును కలిగి ఉండేలా దీవెనలందివ్వమని ప్రార్థిస్తున్నాను' అంతరంగ ప్రతిజ్ఞగా ఇది హృదయ కుహరంలో సదా మార్మోగుతూనే ఉండాలి.

ఏదో ఒక లక్ష్య సాధనతోనే జీవితం ముగిసిపోరాదు. ఎన్నో లక్ష్యాల సమాహారమే జీవితం. ఒక్కొక్క దశలో ఒక్కో లక్ష్యం. లక్ష్యాలను సృష్టించుకునే జ్ఞాన సంపద, వాటి సాధనకు శక్తిని కడవరకు కలిగి ఉండాలి.

వీధి అరుగుమీద అంగవికలుడైన ఓ వృద్ధుడు కూర్చుని జనపనారతో తాళ్లు పేనుతుండగా, ఆ దారెంటపోతున్న ఓ వ్యక్తి- 'తాతా! నీ సంతానమంతా ప్రయోజకులయ్యారు. హాయిగా కృష్ణా రామా అంటూ కాలం వెళ్ళబుచ్చక దేనికి ఇంకా ఈ కష్టం నీకు?' అని ప్రశ్నించాడు.

ఆ వృద్ధుడు నవ్వి- 'ఇదేదో సంపాదనకో' మరెందుకో కాదు. ఇంత వయసున్న మా తండ్రే ఇంతగా కష్టపడుతుంటే మేమెంతగా శ్రమించాలి అన్న ఆలోచన నా పిల్లల్లో ఇంకా బలంగా నాటుకొనేందుకే' అంటూ బదులిచ్చాడు.

అనుభవాల సంగ్రహరూపమే వృద్ధాప్యం. ప్రతీమాట, చేత వేదంలా భాసిల్లాలి.

గడచిపోయిన క్షణం రాదు. ముందున్న క్షణాలు అత్యంత విలువైనవి. కాలాన్ని అధ్యయనంచేస్తూ సద్వినియోగపరచుకునే విచక్షణ ఈ దశలో పూర్ణపక్వతతో ఉంటుంది. కాలస్వరూపునిగా విరాజిల్లాలే తప్ప- కాలంవెంట తలొంచుకు తిరిగే జీవిగా ఉండనేకూడదు.

దేహంలోని 'శక్తి' దైవస్వరూపం. సదా ఆ శక్తిని ఉపాసిస్తూనే ఉండాలి. సకల ప్రాణుల్లోని 'చలనశక్తి' ఆ దైవ స్వరూపమే.

శ్రీకృష్ణ నిర్యాణం జరిగాక భగవత్ శక్తి అంతర్థానమై అరాచకం ప్రబలుతుంది. మహా పరాక్రమవంతుడైన అర్జునుడు అంతఃపురకాంతలను సైతం రక్షించలేని దుర్బలుడవుతాడు. గాండీవం కూడా ఎత్తలేని శక్తిహీనుడవుతాడు.

దేహాంతర్గత శక్తిని అనేకరూపాల్లో- క్రియాత్మకంగా వివేచనాత్మకంగా ఆఖరి ఘడియవరకు వినియోగించుకోవడమే వివేకవంతుల లక్షణం.

- దానం శివప్రసాదరావు