ᐅసత్యమే అమృతం



ᐅసత్యమే అమృతం 

ఒక వ్యక్తి లోకానికి ఆదర్శంగా ఉండాలంటే అతను తప్పకుండా కొన్ని నియమాల్ని పాటించాలి. వాటిలో సత్యం ప్రధానమైంది. సత్యాన్ని పలకమనీ, అసత్యాన్ని పలకవద్దనీ మనల్ని వేదాలు శాసించాయి.
సత్యం పరమాత్మ స్వరూపం. సత్యాన్ని పలకటం వల్ల ఆ పరమాత్ముని సేవించిన ఫలం దక్కుతుంది. ఇతరులకు ఆనందం కలిగే విధంగా మాట్లాడాలి. కానీ... అసత్యం పలకకూడదు. ఆనందాన్ని కలిగించని సత్యాన్నీ చెప్పకూడదు. అలాగని ప్రియంగా ఉండే అసత్యాన్ని పలకరాదు. ఇదీ సనాతన ధర్మమని మన పరంపర చెబుతోంది. 
సూటిగా చెప్పాలంటే ఈ లోకంలో సత్యాన్ని మించిన ధర్మం లేదు. సత్యమే జ్ఞానం.

సత్యం ఋతంతో సమానమైందని ఆగమాలు చెబుతున్నాయి. సత్యం అంటే నిజం పలకటం. ఋతం అన్నా అదే అర్థం. ఋతం కానిది అనృతం. అంటే, అబద్ధం. మామూలుగా అయితే ఈ రెండు పదాలకీ అర్థంలో పెద్దగా తేడా లేకపోయినా లోతుగా ఆలోచిస్తే మాత్రం కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. సత్యం అనేది సర్వకాల సర్వావస్థల్లోనూ మారకుండా ఒకటిగానే ఉంటుంది. ఋతం మాత్రం దేశకాల పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే- అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. అందులో ఒక ముని ఆశ్రమాన్ని కట్టుకుని తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు ఓ జింక ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముని ఆశ్రమంలో దాక్కుంది. కొద్దిసేపటికే ఆ జింకను తరుముతూ వచ్చిన వేటగాడు ఆ ఆశ్రమానికొచ్చి 'అయ్యా! ఇటువైపు ఏదైనా జింక వచ్చిందా?' అని మునిని అడిగాడు. ముని దాని విషయం తనకు తెలియదని చెప్పాడు. అలా చెప్పటాన్ని ఋతం అంటారు. అది సత్యమా అంటే, కానేకాదు. సత్యం చాలా కచ్చితంగానూ సూటిగానూ ఉంటుంది.

అసత్యాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినా దోషం లేదని వివరించిన హారీతుడు, వసిష్ఠుడు తదితర మహర్షులూ సత్యానికే అగ్రస్థానమిచ్చారు. వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి ఫలం దక్కుతుందో అంతకంటే ఎక్కువ ఫలాన్ని సత్యనిష్ఠ ఇస్తుంది.

సత్యాన్ని తు.చ. తప్పకుండా పలకాలి, అసత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అనే నియమాన్ని పాటిస్తూ జీవితాన్ని గడపటం అంత తేలికే కాదు! అలా ఎన్నుకున్న బాట ముళ్లబాటగా ఉంటుంది. అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. నరకంలా అనిపిస్తుంది. విషాద స్వరాలు వినిపిస్తాయి. అయినా, ఏమాత్రం అధైర్యపడకుండా చెక్కుచెదరని ఆత్మస్త్థెర్యంతో ముందుకు సాగితే చివరికి తప్పకుండా విజయం వరిస్తుంది. ఇదీ సత్యమార్గంలో పయనించేవాళ్ల పరిస్థితి. అందుకే ఈ మార్గంలో వెళ్ళటానికి అందరూ సాహసించరు.

కానీ... సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు సత్యంకోసం తన సంపదనీ, రాజ్యాన్నీ, భార్యాబిడ్డల్నీ వదులుకున్నాడు. చివరికి తనని తానే అమ్ముకున్నాడు... కాటికాపరి అయ్యాడు. ఎన్ని కష్టాలెదురైనా ఆయన తన సత్యనిష్ఠ వదులుకోలేదు. ఆ విధంగా హరిశ్చంద్రుడు సంపాదించిన శాశ్వతమైన కీర్తిచంద్రికల్ని ఎవరైనా చిదిమేయగలరా?

మౌర్యవంశ చక్రవర్తి అయిన అశోక వర్ధనుడు తన రాజ్యంలోని ప్రధాన నగరాల్లో శిలాస్తంభాల్ని నెలకొల్పి, వాటి మీద సత్యం గొప్పదనాన్ని అక్షరబద్ధం చేశాడు. ఆయన మనసులో పరిమళించిన ఆ సత్యనిష్ఠను ఏమని వర్ణించగలం? నాలుగు యుగాల్లో మొదటిదైన కృతయుగాన్ని సత్యయుగం అంటారు. ఆ కాలంలో సత్యానికి పెద్దపీట వేశారు కాబట్టే ఆ యుగాన్ని అలా పిలిచారు.

స్నానం చెయ్యటం వల్ల బాహ్యశుద్ధి అయితే, సత్యం పలకటం వల్ల అంతశ్శుద్ధి అవుతుంది.

తమిళవేదం తిరుక్కురళ్ చెప్పినట్లు- ఇతరులకు కొంచెం కూడా కీడు కలిగించని మాటలు మాట్లాడటమే సత్యమని తెలుసుకుంటే, లోకమంతా ఆనందం వెల్లివిరుస్తుంది!

- డి.శ్రీనివాస దీక్షితులు