ᐅశ్రీ పంచమి
ᐅశ్రీ పంచమి
శబ్దమనే జ్యోతితో జగత్తు తేజరిల్లుతోంది. నాదాత్మకమైన ప్రణవం సప్తస్వర రంజితంగా ప్రకటితమవుతోంది. ఆ శబ్దశక్తి, నాదానురక్తి సరస్వతి స్వరూపాలు. 'ప్రాణశక్తిః సరస్వతి' అని వేదం చెబుతోంది. మనలో ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని సర్వాణువుల్లో ప్రవహిస్తోంది. ఆ ప్రసరణ శక్తే శ్రీవాణి. 'వాగ్బుద్ధి జ్ఞాన' స్వరూపిణిగా, సర్వశక్తిమయిగా సరస్వతిని ఆరాధిస్తాం. వాగ్దేవి ఆవిష్కారమైన పర్వదినం మాఘశుద్ధ పంచమి. దీనినే శ్రీపంచమిగా వ్యవహరిస్తారు. మన బుద్ధి, శక్తుల్ని ప్రేరేపించే విద్యా స్వరూపిణి శారదాంబను విశేషంగా పూజించే తరుణం శ్రీ పంచమి పర్వదినం. బుద్ధి, స్మృతి, భ్రాంతి, వాక్కు, విద్య... ఇలాంటివన్నీ ఆ దివ్యజనని అనుగ్రహ ఫలాలుగా చెబుతారు.
శ్వేత వస్త్రాలతో అలంకృతమై, హంసవాహినిగా తెల్లటి తామరపుష్పంపై కొలువుదీరిన వీణాపాణిని జ్ఞానానంద పరాశక్తిగా ఆరాధిస్తారు. ఏడు సారస్వత శక్తులతో భారతీదేవి విలసిల్లుతోంది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధి వల్లభా, భక్త జిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని అనే సప్త నామధేయాలతో చదువులమ్మ విరాజిల్లుతోంది. శ్రీ పంచమినాడు సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ పంచమి నాటి పూజా విధివిధానాల్ని శ్రీహరి నారదుడికి వివరించినట్లు దేవీ భాగవతం వెల్లడిస్తోంది. తెల్లని పుష్పాలతో, శ్వేత చందనంతో శ్రీవిద్యను పూజించాలి. క్షీరాన్నం, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరకు ముక్కల్ని అమ్మకు నివేదన చేయాలి. సరస్వతీదేవి మూలమంత్రాన్ని జపిస్తూ వాణిని ఆరాధించాలి. సృష్టికర్త బ్రహ్మ- పరాశక్తిని శారదగా దర్శించి, ఆరాధించాడు. ఆమె అనుగ్రహంతోనే సృష్టిరచన చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
సరస్వతి అంటే వెలుగునిచ్చేది. జ్ఞానమనే కాంతుల్ని మన జీవితాల్లో ప్రసరింపజేసే శక్తే సరస్వతి. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాన దేవత సరస్వతి. సత్వగుణ శోభితగా భారతి దీపిస్తుంది. అమ్మ చెంతన ఉండే హంస- పాలను, నీటిని వేరుచేస్తుంది. మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో మసలుకొమ్మని భారతి, తన హంసవాహనం ద్వారా సందేశమిస్తుంది. భారతీదేవి హస్తభూషణమైన వీణ, ఆమెను సకలకళల అధిష్ఠాత్రిగా ప్రకటిస్తోంది. అమ్మ చేతిలో ఉండే పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలు. నిర్మలమైన మనసుతో, ఏకాగ్రతతో, భక్తితో సరస్వతిని ఉపాసిస్తే అమ్మ అనుగ్రహం సత్వరం సిద్ధిస్తుందంటారు. సకల విద్యలు కరతలామలకమవుతాయని చెబుతారు. అజ్ఞానతీరం నుంచి విజ్ఞానపు వెలుగు జాడల వైపు చదువుల తల్లి మనల్ని నడిపిస్తుంది. జీవితంలో సమగ్ర జ్ఞాన సిద్ధి, సర్వతోముఖాభివృద్ధి పెంపొందడానికి సరస్వతీ ఆరాధనే తరుణోపాయం. శ్రీ పంచమి శుభతరుణాన ఆ దివ్యధాత్రి కరుణా కటాక్షాల్ని అందుకుందాం.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్