ᐅకృష్ణ ప్రేమ
'గంగా గౌరీ సంవాదం' చమత్కారంగా సాగే ఒక జానపద రసగుళిక. దాని సారాంశం శివలీలా విలాసం. లక్ష్మీ గౌరీ సంవాదం, సత్యా ద్రౌపదీ సంవాదం లాంటివెన్నో మన ఆధ్యాత్మిక సంస్కృతిని సుసంపన్నం గావిస్తున్నాయి. అన్నిటిలోనూ అంతస్సూత్రం ఒకటే! ఈశ్వరప్రేమ ఆదర్శవంతమైనది, ఆధ్యాత్మికమైనది.
'అమ్మవారి'తో కలిసి ఉంటేనే 'అయ్యవారు' సమగ్రమూర్తి. అందుకే ఇద్దర్నీ ఆరాధించడం. ఈ అమ్మవార్లు ఎటువంటి అయ్యవార్లను ఎన్నుకున్నారు? పరాత్పరులు వరులు! వారిపై ఆధ్యాత్మిక వలపులు అమ్మవార్ల ఆదర్శప్రేమకు నిదర్శనాలు.
ఒక వధువు తనకు ఎలాంటి వరుడు కావాలనుకుంటుంది? అందగాడు, సంపన్నుడు, సమర్థుడు, సచ్ఛీలుడు, ఉన్నత వంశస్థుడు- కావాలనుకుంటుంది.
శ్రీకృష్ణుడు నల్లనివాడు, నిర్ధనుడు, చోరుడని పేరు, నాగరికుడు కాడు. గోపాలురి ఇంట పెరిగాడు. ఏ వధువైనా ఇటువంటి వరుణ్ని కోరి వరిస్తుందా?
రుక్మిణి సౌందర్యవతి. రాజకుమార్తె, సౌశీల్యవతి. గొప్ప వంశంలో జన్మించింది. ఆమె శ్రీకృష్ణుడినే తనకు భర్తగా ఎన్నుకున్నది. బాహ్యాకర్షణలకు లోనై ఆమె కృష్ణుని ప్రేమించలేదు!
కొంతకాలం తరవాత రుక్మిణీ కృష్ణుల మధ్య ఒక సంవాదం జరిగింది. తనను కోరి వరించిన రుక్మిణి మనసేమిటో తెలుసుకోవాలనుకున్నాడు కృష్ణుడు.
'రుక్మిణీ! నేను నీకు తగినవాడిని కాను... పశువుల కాపరిని. పేదవాడిని. నన్నెందుకు కోరుకున్నావు?'
'స్వామీ! సర్వ ఐశ్వర్యాలూ నీకే దాస్యం చేస్తూఉండగా పేదవాడివి ఎలా అవుతావు?'
'సంపన్నులెవరూ నన్ను ఆరాధించరు!'
'నీవు కేవలుడవు! పేద, ధనిక భేదాలు నీకు లేవు!'
'నేనెందరినో ప్రేమిస్తూ ఉంటాను! ఇతరులపై కూడా మమకారం చూపే నేను ఉత్తముణ్ని ఎలా కాగలను?'
'అందరినీ ప్రేమిస్తూ, ఎవరిపైనా మమకారం లేకుండా ఉండటమే నీ విశిష్ట గుణం. మాకు ఐహిక జగత్తుపై మమకారం పుట్టించేవాడివీ, గిట్టించేవాడివీ నీవే. గాఢమైన అనురాగంతో నీ పాదపద్మాలను ఆశ్రయించిన వారిని ప్రేమిస్తావని నేను గ్రహించాను!'
'నేను రాజులకు భయపడి సముద్ర మధ్యంలో దాక్కున్నాను... అటువంటి అశక్తుణ్ని నీవెందుకు కోరుకున్నావు?'
'రాజులందరినీ ఓడించి, నన్ను తీసుకొని రాగలిగిన నీకు, భయమున్నదంటే ఎలా నమ్ముతాను? మన పెండ్లి సమయంలో పైన పడబోయిన రాజుల్ని కేవలం వింటి నారి మోతతో తరిమావు! నీకంటే పరాక్రమశాలి ఎవరు? నీవు ఏమి చేసినా అది జగత్ కల్యాణ కారణం అవుతుంది!'
'నన్ను బిచ్చగాళ్లు మాత్రమే భక్తితో పూజిస్తారు!'
'ఎవరా భిక్షుకులు... నారదాది మహా మహా మునులా? వారు మహాత్ములు, ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు... పరమాత్మ తత్వం తెలిసిన వారంతా నీ పాదాలనే ఆశ్రయిస్తారు. నిర్ధనులంటే నీకు మమకారం. ఎవరిపైన నీకు కరుణ కలుగుతుందో వారి సర్వధనాలనూ హరించి 'హరి' అనే పేరు సార్థకం చేసుకుంటావు. నీ భక్తుల్ని నిరుపేదలుగా నిలబెట్టి చూస్తావు. నీ పరీక్షలో నెగ్గినవారే జీవన్ముక్తులు!' అని రుక్మిణీదేవి పతిదేవుని పాదపద్మాలను భక్తితో కన్నులకు అద్దుకుంది.
మహాభాగవతం శ్రీకృష్ణ ప్రేమ రహస్యాన్ని రుక్మిణీ శ్రీకృష్ణుల సంవాదంతో సులభ సుందరం గావించింది.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు