ᐅతనను తానే

ᐅతనను తానే... 

ఎవరికో తనమీద విశ్వాసం ఉండటం గొప్పకాదు. తనమీద తనకే ఉండాలి. ఎదుటివారి మీద అది ఉండటం సులభమే. కానీ తనమీద తనకు కలగడమే కష్టం. తన గురించి, తనలోని శక్తిసామర్థ్యాల గురించి తెలుసుకునే సరైన ప్రయత్నం ఎవరికి వారు చేయకపోవడమే దీనికి కారణం. ఆ ప్రయత్నం చేస్తే తనలో ఎంత శక్తి దాగి ఉందో తెలుస్తుంది. దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. అది కలగడం అంత సులువైన పని కాదు. సరైన స్థాయిలో తనని తాను అంచనా వేయలేకపోతే హెచ్చుతగ్గులైపోతుంది. హెచ్చితే అది అహంకారం. తగ్గితే ఆత్మన్యూనత. రెండూ ప్రమాదమే. ఆ రెండూ కాని సమస్థితిలో మానసిక స్థితి ఉన్నప్పుడే ఆ మనిషికి విలువ. అదే ప్రతి మనిషికీ అత్యంత ఆవశ్యకం.
తనలోని బలహీనతలను పూర్తిగా తెలుసుకుంటే కలిగే బలమే ఆత్మవిశ్వాసం. ముందుగా తాను ఏది సాధించాలనుకుంటున్నాడో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. సరైన అవగాహనతో ప్రయత్నం చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రయత్నాన్ని విరమించకుండా కొనసాగించాలి. అలాంటప్పుడే అనుకున్న పనులు నెరవేరతాయి. మన ఆలోచనా విధానం ఎలా ఉంటే మనమూ అలాగే మారతాం. ఆలోచనల్లో ఆత్మవిశ్వాసం ఉందా, అహంకారం ఉందా అనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనసే మనిషికి తొలి సాక్షి కాబట్టి ఆ విషయం సులువుగానే తెలుస్తుంది. అలా ఆలోచించి ఆత్మవిశ్వాసం సమకూర్చుకున్న వ్యక్తి, తన శక్తిని సంపూర్ణంగా విశ్వసించగలడు. అందువలన అతడు అందుకోలేని ఉన్నత శిఖరాలు ఉండవు.

ఒక పాఠశాలలో, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జరుగుతోంది. పాల్గొనదలచినవారు తన పేరు నమోదు చేసుకొమ్మని తరగతిలో ప్రకటించారు. విద్యార్థులంతా నువ్వు పాల్గో... అంటే నువ్వు పాల్గో అని ఒకరితో ఒకరు అంటున్నారు. అంతే తప్ప తనంతతానుగా ఎవరూ లేవటం లేదు. అంతలో ఒక విద్యార్థి నిలబడ్డాడు. అమాయకంగా, బలహీనంగా ఉండే అతడిని అందరూ హేళన చేస్తుంటారు. కాబట్టి ఎవరితోనూ కలవక తరగతిలో చివరి వరసలో కూర్చుంటూ ఉంటాడు. ఆ విద్యార్థి నేను పాల్గొంటాను అనేసరికి ఉపాధ్యాయులతో పాటు మిగిలిన విద్యార్థులూ ఆశ్చర్యపోయారు. తేరుకున్నాక హేళన చేశారు. అయినా చలించలేదు. తనలో ఎంత సామర్థ్యం ఉందో సింహావలోకం చేసుకున్నాడు. నెగ్గగలననే నిశ్చయానికి వచ్చాకే ఆ నిర్ణయం తీసుకున్నాడు. పోటీలో పాల్గొనడమే కాదు. ప్రథముడిగా నిలిచాడు. అలాంటి ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టే విధి వెక్కిరించినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నాట్యంలో అత్యున్నత స్థాయికి చేరింది సుధాచంద్రన్. బధిరుడైనా, ఎన్నో ప్రయోగాలు చేసి అపజయాలు పొందినా, చివరకు ఉత్తమమైన ఆవిష్కరణలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తగా ఎదిగాడు థామస్ ఆల్వా ఎడిసన్.

జీవితంలో ఎన్నో సంక్షోభాలు, సంఘర్షణలు ఏర్పడతాయి. వాటిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. దానికి ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి పేదరికం, దారిద్య్రం లాంటివి అడ్డురావు. వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దీనికి తార్కాణం ఇద్దరు దేశాధినేతలు. ఒకరు భారతదేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి. మరొకరు అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన అబ్రహాం లింకన్. వీరిద్దరూ ఆస్తితో కాదు, ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినవారే.

ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడొక విద్యార్థి. అతడి తెలివితేటలను గుర్తించింది పాఠశాల యాజమాన్యం. 'నీ తెలివితేటలకు తగిన పాఠశాల ఇది కాదు. ఇంగ్లాండ్‌లో ఉన్న ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం. నువ్వు అక్కడ చదువుకునే ఏర్పాటు మేము చేస్తాం. వెళ్ళి చదువుకో' అన్నారు. ఆ మాటలకు ఆ విద్యార్థి 'నేను ఆక్స్‌ఫర్డ్‌కి విద్యార్థిగా వెళ్లను. నేర్చుకోవలసిందంతా నా దేశంలోనే ఉంది కాబట్టి. అక్కడికి వెళితే ఉపన్యాసకుడిగానే వెళతాను. మన విద్యలసారం ప్రపంచానికి నేర్పవలసిన అవసరం ఎంతో ఉంది కాబట్టి' అని జవాబిచ్చాడు. అన్నట్టుగానే కొన్నేళ్ల తరవాత... ఉపన్యాసకుడిగానే వెళ్లాడు. ఆత్మవిశ్వాసంతో అలా పలికిన ఆనాటి విద్యార్థి స్వతంత్ర భారతదేశానికి రెండో రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాంటి నమ్మకాన్ని మనలో నిలుపుకోవాలి. జీవితంలో విజయాలు సాధించడానికి, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సైతం నమ్మకమే పునాది. మొదటిది మనమీద మనకు, రెండోది ఆ అంతర్యామి మీద మనకు!

- అయ్యగారి శ్రీనివాసరావు