ᐅభద్ర స్థలం



ᐅభద్ర స్థలం 

ప్రతి జీవికీ ఓ భద్ర స్థలం కావాలి. ఓ సురక్షిత స్థావరం కావాలి. ముఖ్యంగా మనిషికి, రక్షణకు, భద్రతకు, శాంతికి, ప్రశాంతతకు, ఉపకారానికి, ఉపశమనానికి, స్వేచ్ఛకు, సాంత్వనకు, ధైర్యానికి, ధీమాకు... దేనికైనా అప్పటికప్పుడు, అడగకుండానే తీసుకునేంత ఎక్కడుంది అలాంటి స్థలం, స్థావరం, ధామం!? సొంత ఇల్లయినా సురక్షితమైందేనా? పాములు, తేళ్లు, దొంగలు, భూకంపాలు, కబ్జాలు... ఎన్నో. మనకేం కావాలన్నా ఇచ్చే ఆ ఉదార ధామమేది? అక్కడ స్వేచ్ఛ ఉంటుందా? హద్దులు, కట్టుబాట్లు, నిబంధనలు ఉండవా? తిరిగి చెల్లించే పద్ధతి లేదా? ధనం సంగతి సరే. ప్రేమ, శాంతి, ఉపశమనం, భరోసా? ముఖ్యంగా అన్ని రకాల శత్రువులనుంచి రక్షణ? అన్నీ ఉండే అంత అద్భుతమైన ధామం అసలు సంభవమేనా! ఉంది. అలాంటి భద్ర స్థలం, భద్ర భవనం, భువనం ఒకటుంది. అక్షరాలా మనం ఆశించినవి, అంతకంటే అధికమైనవి, మన ఊహకు కూడా అందనివి లభించే, అందించే భద్ర స్థలం ఒకటుంది! అదే భగవంతుని సన్నిధి. ఆయన రక్షణ వలయంలోకి వెళ్తే, ఆయన చూపు పరిధిలోకి చేరితే, ఆయన ప్రేమ పరిష్వంగంలోకి చొరబడితే... అదే ఆయన సన్నిధి. మనం కోరేవీ, కోరనివీ కూడా ఇవ్వగల పెన్నిధి.
ప్రాపంచికంగా మనకు ఏదైనా నిధి దొరకవచ్చు. వ్యక్తులొకరు లభ్యం కావచ్చు. అవెంత గొప్పవైనా కానీ, ఎంత ఉత్తమమైనవైనా కానీ- వాటికి కొన్ని పరిమితులుంటాయి. కానీ భగవంతుని రక్షణకు ఎదురులేదు. తిరుగులేదు. ఆటంకం లేదు. పరిమితులు అసలేలేవు. ముఖ్యంగా మనకు ప్రాపంచికంగా లభ్యమయ్యే రక్షణా స్థలం, లేదా రక్షకుడు ఒక స్థలానికి పరిమితమై ఉంటారు. మరోచోట మనకా సహాయమో, సహకారమో, రక్షణో అవసరమైతే? మనం నిస్సహాయులమవుతాము. నిస్పృహ చెందుతాం. భగవంతుని రక్షణలో ఇబ్బంది లేదు. ఆ భయం లేదు. భగవంతుని 'భద్ర స్థలం' మనమెక్కడికి వెళ్లినా ఏ వేళనైనా మన వెంటే వస్తుంది. అదో 'భ్రమణ భవనం' అన్నమాట. మన చుట్టూ మన అవసరానికి అనుకూలంగా అమరే రక్షణ కవచమన్న మాట. అయితే అది అందరికీ వస్తుందా? అందరికీ ఉంటుందా? వస్తుంది ఉంటుంది కానీ అందరికీ కాదు. మరి! చెట్టు అందరి కోసం ఉంది. అందరి కోసం కాస్తుంది అందరి కోసం పూస్తుంది అందరి కోసం గాలి వీస్తుంది. అయితే అందరం దాని ఫలాలు పొందుతున్నామా? గాలి అందుకుంటున్నామా? దానికి కొన్ని పరిమితులున్నాయి. పద్ధతులున్నాయి. చెట్టును సేవించే నిష్ఠలూ, సంగ్రహించే నియమాలూ ఉన్నాయి. భగవంతుని భద్రస్థలం చేరుకోవాలన్నా, పొందాలన్నా అంతే. ఆశ్రయం ఇవ్వడానికి, ఆశలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సన్నద్ధుడయ్యే ఉన్నాడు. అయితే దేనికైనా అధికారం అనేదొకటి ఉండాలి. అర్హత అనేదొకటి సంపాదించాలి. అన్నం తినడానికి కూడా ఆకలి అనే అర్హత ఉండాలి. లేకపోతే అన్నం తినలేం. నీళ్లు తాగడానికీ దాహం అనే అధికారం కావాలి. మరి భగవంతుని ఆశ్రయ ధామంలోకి అడుగిడాలంటే, భద్రస్థలంలో చోటు సంపాదించాలంటే ఆయనపట్ల ఆయన ప్రేమపట్ల ఎంత ఆకలి ఉండాలి! ఎంత దాహం ఉండాలి! శరీరానికైనా శ్రమిస్తేనే ఆకలి అవుతుంది. దాహం వేస్తుంది. అనంతునిలాంటి అమృత ఫలాన్ని పొందాలంటే మన హృదయమెంత ఆకలిగొనాలి? ఎంత దాహార్తితో అలమటించాలి? ఆ త్రైలోక్య సుందర భద్ర మందిరం మనకోసం వాకిళ్లు తెరుచుకోవాలంటే- మనమెంత అర్హత సంపాదించుకోవాలి!?

- చక్కిలం విజయలక్ష్మి