ᐅనాదయోగి ఆరాధన
ᐅనాదయోగి ఆరాధన
భారతీయ సంగీతంలో 'త్యాగరాజస్వామి' పేరు ప్రపంచ ప్రసిద్ధి. ముఖ్యంగా తెలుగు భాషలోనే సంగీతాత్మ ఉందని రుజువు చేసిన ఈ మహానుభావుని తెలుగు వారందరూ గురుస్థానంలో ఆరాధించాల్సిందే. చిత్రమేమంటే సంగీత, సాహితీభావ సంపద విశ్వజనీనం కనుకనే అన్యభాషలవారు సైతం ఆరాధించే ఔన్నత్యం తెలుగు వెలుగైన త్యాగయ్యకు దక్కింది. వీరి సంగీతాన్ని ప్రపంచ వేదికలపై విన్నాక, పాశ్చాత్యులు ఈ కీర్తనల్లోని తెలుగు భాషా మాధుర్యానికి పరవశులై 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని కీర్తించారు.
నేటికీ ప్రతిఏటా త్యాగరాజ వర్ధంతిని 'ఆరాధన'గా, ప్రపంచ సంగీత ప్రియులకు మహోత్సవంగా, పలువైపులనుంచి వచ్చే సంగీతకారులతో, శ్రోతలతో తిరువాయూరు క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. వేలాది వివిధ భాషా సంగీతకారుల నోట ఏకకంఠంగా, తెలుగు పంచరత్నకృతులు మరో అమృత కావేరిగా ఆవేళ ప్రతిధ్వనించడం తెలుగు గుండె ఉప్పొంగే మధురఘట్టం నాదబ్రహ్మోత్సవం.
సంగీతశాస్త్ర మర్మాలను కీర్తనల్లో ఒదిగించి, పొదిగించిన ఏకైక వాగ్గేయకారుడు త్యాగయ్య. సంగీతాన్ని మోక్షవిద్యగా, యోగశాస్త్రంగా అధ్యయనంచేసి, నిరూపించి, ఆ ఫలాన్ని పొంది, ఇతరులకు పొందించిన మహాయోగి.
సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేసిన త్యాగయ్య లేతలేత పలుకులతో, లోతైన వేదాంత రహస్యాలను పల్లవింపజేసిన నాదబ్రహ్మ. 1767-1847 మధ్యకాలంలో జీవించి సంగీతానికీ, భక్తి మార్గానికీ శాశ్వతోపకారం చేశారు.
'సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే మనసా!'
'అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు'
'మనసు స్వాధీనమైన ఆ ఘనునికి
మరి మంత్రతంత్రము లేల?'
... ఇలా లెక్కలేనన్ని కీర్తనలు, త్యాగరాజ సాహితికి ఉపనిషత్తుల స్థానాన్నిచ్చాయి. రామభక్తి సామ్రాజ్యాన్ని కృతుల్లో ప్రతిష్ఠించిన త్యాగయ్య, వాటి ద్వారా మరో రామాయణాన్నే అందించారు.
'ఎందరో మహానుభావులు', 'సమయానికి తగు మాటలాడెనే,' 'సొగసు చూడతరమా,' 'తెరతీయగరాదా', 'ఎంతవారలైనా కాంతదాసులే'- ఇలా లెక్కలేనన్ని త్యాగయ్య పలుకులు తెలుగువారి నోట నానుడులయ్యాయి.
రాగ భావ ప్రపంచానికి రాజుగానేకాక, నిరాడంబర సాత్విక యోగజీవనానికి ఆదర్శంగా శోభిల్లిన అద్భుత వ్యక్తిత్వం త్యాగయ్య వైభవం.
తన నామం త్యాగయ్య అయినా, చివరి దశలో రామాజ్ఞవల్ల సన్యసించిన కారణంగా, ఆరాధనకు యోగ్యులై 'త్యాగరాజస్వామి'గా ప్రసిద్ధులయ్యారు. సంగీతకారులకు ఎంత ముఖ్యమో; భక్తులకు, వేదాంతులకు అంతే ఆరాధ్యులు ఈ నాదయతి.
త్యాగయ్య గురించి పేర్కొంటూ 'మానవుడు కాడు దేవుండు మనకు నిజము' అని చెళ్ళపిళ్ళవారు కీర్తించారు. 'త్యాగరాజమహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగుభాష' అని వీరిద్వారా మనభాషను ప్రస్తుతించారు కవిసమ్రాట్ విశ్వనాథ. 'త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు నిత్యమై నిఖిలమై నిలచియుండి....' 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ'లయ్యాయి.
'నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా!' అని కీర్తించిన త్యాగయ్య, కోరి దరిద్రాన్ని వరించాడు. ఎందరో శిష్యులను వాత్సల్యంగా పోషించి బోధించి వారికి తన విద్యను సుస్థిరంగా నిలిపారు. త్యాగయ్య నెలకొల్పిన గురుశిష్య సంప్రదాయం రుషి పరంపరకు ప్రతీక.
నిష్కపటమైన భక్తి, శుద్ధ సాత్విక మనః ప్రవృత్తి, తపోమయ జీవనం- ఈ నాదయోగి బతుకు తీరు. పటిష్ఠమైన పాండితీభరిత సంగీతంతోపాటు, సామాన్యులు సైతం పాడుకోగలిగే సంకీర్తనలను చిన్న చిన్న మాటలతో సమకూర్చారు.
సంగీతం నిర్మలభక్తితో, ద్రాక్షారసం వంటి సౌలభ్యమాధుర్యంతో, స్వరశుద్ధంగా ఉండాలని నిర్దేశించి లక్ష్యలక్షణాలను తన రచనల్లో నిక్షిప్తం చేశారు. సంగీత, సాహిత్య, వేదాంత శాస్త్రాల సారం త్యాగరాజకృతి వైభోగం.
సంస్కృతిపై అభిమానం కలవారు, అందునా తెలుగువారు కృతజ్ఞతతో స్మరించుకోదగిన ఆ మహాత్ముడికి- ఈ ఆరాధన సందర్భంగా హృదయాంజలి.
- సామవేదం షణ్ముఖశర్మ