ᐅమహాశివరాత్రి
ᐅమహాశివరాత్రి
దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా అందులోంచి ముందుగా హాలాహలం పుట్టింది. లోకాలను దహించటానికి ఆ విషాగ్ని కీలలు భుగభుగలాడుతూ చెలరేగుతూ ఉంటే, మంధరపర్వతం కవ్వంగా వాసుకి సర్పం తాడుగా సాగుతున్న అమృత మథనం ఆగిపోయింది. విషవిలయం ఆపటానికి విలయనేత్రుడు శివుడే స్వయంగా పూనుకొన్నాడు. విషపు మంటలను గుటుక్కున మింగి గరళకంఠుడయ్యాడు పరమశివుడు. ఆయన బాధను పంచుకోవటానికి, దేవ మానవ రాక్షసగణాలన్నీ జాగరణ పాటించి నీలకంఠుడికి సపర్యలు చేసిన రాత్రి 'మహాశివరాత్రి'గా ప్రసిద్ధమైంది. అన్ని శివాలయాల్లో కోలాహలంగా నాలుగు యామాలపాటు శివుడికి అభిషేకాలు, పూజలు, భజనలు చేయటం ఒక్క మతపరమైన సంప్రదాయం కాదు. 'సహ-అనుభూతి' ఒక సామాజిక ప్రక్రియ అని తెలియజేయటానికి శివరాత్రి చక్కని ఉదాహరణ. దీన్ని పౌరాణిక గాథగా కొట్టి వేయటానికి, మూఢాచారంగా ముద్రవేయటానికి వీలులేదు. పురాణం- వేదం తాలూకు వివర్తరూపం. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వ్యంజింపచేయటానికి ద్రష్టలైన రుషీశ్వరులు సృష్టించిన దివ్యకథాకదంబం. మహాశివరాత్రి ఏడాదికొకసారే. మాసశివరాత్రి ప్రతినెలా ఎందరికో మార్గదర్శనం చేయిస్తుంది. ఈ శివరాత్రిని జ్ఞాన, ధ్యాన, కార్మిక శివరాత్రులుగా పాటించవలసిన అవసరం ఏమిటో తెలుసుకోవాలి. అంతకన్నా ముందు, అందులోని అంతరార్థం గ్రహించటం సమంజసం.
మంగళకరమైన శివశబ్దానికి అజ్ఞానానికి సంకేతం అయిన రాత్రికి లంకె ఏమిటి? ఈ ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పుకోవాలి. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడైన యోగి లక్షణాలను అర్జునుడికి తెలియజేస్తూ, కృష్ణపరమాత్మ చెప్పిన ముఖ్యమైన శ్లోకం గుర్తుచేసుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది. తమో జీవులన్నింటికీ ఏది రాత్రో, జ్ఞాని అయిన యోగికి అది పగలు. అజ్ఞాన జీవులు మేలుకుని ఉండే సమయం ఆ జ్ఞానికి రాత్రితో సమానం. ఇప్పుడు శివరాత్రికి సరైన నిర్వచనం తేటతెల్లమైంది. క్షణికం, అశాశ్వతమైన ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ, ఆది ఆత్మస్థితికి దూరమైన మనం శివజ్ఞానులమై నిరంతరం పరమాత్మను ధ్యానిస్తూ, నిస్వార్థ క్రియా యోగులుగా మారటమే జీవిత ధ్యేయం.
మానవుడు కర్మజీవి కాబట్టి క్షణం కూడా ఏదో ఒక పని- శారీరకంగా కాకపోయినా మానసికంగానైనా చేయకతప్పదు. ఈ మనిషి జన్మ- కర్మ జనితమే కాబట్టి, అవతారపురుషుడు కృష్ణుడు తానూ కర్మ చేయకతప్పటం లేదని అర్జునుడికి చెప్పిన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. కర్మ చేయటం ఎలాగూ తప్పదు కాబట్టి, నిరంతర స్మరణ చేస్తూ కర్తవ్యకర్మను దైవకార్యంగా నిర్వర్తించాలి. ఇదే కార్మిక శివరాత్రి. ఈ విధంగా జ్ఞానభక్తి, కర్మ మార్గాల ద్వారా పరతత్వాన్ని గ్రహించటానికి శివరాత్రి అద్భుతమైన అవకాశాన్ని సందేశాత్మకంగా అందజేస్తున్నది.
- ఉప్పు రాఘవేంద్రరావు