ᐅజ్ఞాన సముపార్జన
కొన్ని పనులు పూర్తిచేయడం అతికష్టం అనుకుంటాం. ఈ ఆలోచన మార్చుకుని నిలకడగా ముందుకు సాగాలి. అలా నిలకడగా సాగడానికి ఆత్మవిశ్వాసం కావాలి. జీవితంలో క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు మనం ఓడిపోతామనే ఆలోచన మనలో రానీయకూడదు. ఆ క్లిష్ట సమస్యలు అతి చాకచక్యంతో ఎదుర్కొంటే అవే ఆచరణ సాధ్యమవుతాయి. ఎంత క్లిష్ట కర్మలనైనా తేలికగా చేసేవాడు శ్రీరాముడు. 'అట్టి శ్రీరాముడి దాసుణ్ని' అంటాడు హనుమంతుడు, రావణునితో.
విజ్ఞాన సముపార్జనవల్ల మనం అభివృద్ధి చెందగలం. అతిక్లిష్టమైన గళ్ల నుడికట్టు నింపగలం. పొడుపు కథలకు సమాధానం కనుగొనగలం. గతంలో చేసిన తప్పుల్ని నెమరు వేసుకుంటూ ఉండకుండా ఆ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. మళ్ళీ ఆ తప్పుల్నే చేయకుండా ముందుకు సాగాలి. జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తులతో పరిచయం చేసుకోవాలి. వారికి పరిచర్య చేయాలి. అలా చేసి వాళ్లద్వారా అనేక విషయాలను అవగాహన చేసుకోవాలి. వారి అడుగుజాడల్లో పయనించే యత్నం చేయాలి. పరిస్థితుల్ని గమనించి వాటి వెనక ఉన్న వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో ఎప్పుడూ అనుకూలమైన పార్శ్వాలనే స్పృశింపగలగాలి. చివరలో మనం విఫలం కాకుండా సత్ఫలితాలు సాధించగలుగుతాం. మనం ఎప్పుడూ గాడి తప్పకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించే మహాత్ముల కోసం ఎదురు చూడాలి. అంటే ఎల్లప్పుడూ జ్ఞాన సముపార్జనకు మూలాలను తెలుసుకోగలగాలి. మనం ఇతరులకు స్ఫూర్తిదాయకులం కావాలనుకుంటే, మన చర్యలకు మనమే బాధ్యత వహించాలి.
మన చర్యలు బాగుంటే మన గొప్ప అని, బాగులేకపోతే ఇతరులపైకి నెట్టేయడం చేయకూడదు. మనుషుల్లో అనేక మనస్తత్త్వాలు కలిగిన వారుంటారు. వారిని మనం మార్చలేం. దానికి బదులు వారి స్వభావాలకు అనుగుణంగా మన భావాలను మలచుకోవాలి. అంతమాత్రం చేత వారి భావాల ప్రభావానికి మనం లొంగిపోయినట్లు కాదు. సర్దుకుపోయే స్వభావం అలవడుతుంది.
ఒక్కొక్క వ్యక్తినీ ఒక్కొక్క కోణంలో పరిశీలించాలి. ఆ వ్యక్తి దృక్కోణానికి అనుగుణంగా మనం మసలుకోవాలి. అలా చేయగలిగిన నాడు ఆ వ్యక్తి హృదయంలో మనకు స్థానం లభిస్తుంది. ప్రతి వ్యక్తినీ అతని అభిరుచుల మేరకు మనం ప్రోత్సహిస్తే ఆ వ్యక్తితో పాటు మనమూ గమ్యాన్ని సుకరంగా చేరగలుగుతాం. అలాగని అవతలి వ్యక్తి చట్టవిరుద్ధమైన పనులు చేస్తూంటే మనం ప్రోత్సహించకూడదు. అలా ప్రోత్సహిస్తే మనమూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మనం పొగడ్తలకు పొంగిపోకూడదు. అలాగని తెగడ్తలకు కుంగిపోకూడదు. ఇవన్నీ జ్ఞానసముపార్జనకు సోపానాలు.
జ్ఞానం అన్నది విపణిలో కొనుక్కునే వస్తువు కాదు. మహాత్ముల ప్రవచనాలు వినడంవల్ల, వారి సాంగత్యంవల్ల సాధ్యమయ్యేది జ్ఞానం. మహాత్ములు అంటే కాషాయ వస్త్రాలు ధరించినవారు మాత్రమే కాదు. లోక వ్యవహారంలో సాధారణ దుస్తులు ధరించినా వారి మధురభాషణలు వింటే చాలు- మనకూ ఆ లక్షణాలే అబ్బి భగవత్సాన్నిధ్యానికి తీసుకెళతాయి. అదే జీవన సాఫల్యం!
- బులుసు-జీ-ప్రకాష్