ᐅప్రేమించడమే ప్రేమ
భక్తికి అర్థం పరమప్రేమ అని భక్తిసూత్రాల్లో నారదులవారు నిర్వచించారు. ఆ పరమ ప్రేమను అనుభవించినవారు, అనుభూతించినవారందరూ దాదాపు అదే భావాన్ని వెల్లడించారు. ఏమిటీ పరమ ప్రేమ? అంతకుమించి ప్రేమించేందుకేమీ లేని ప్రేమాతిశయమా? భక్తుడికి, భగవంతుడికి చుట్టూ అల్లుకుపోయిన అత్యంత ఆత్మీయానుబంధ వలయమా?
ఏది ఏమైనా- అది భగవంతునిపట్ల ఉండే అమితమైన తిరుగులేని ఇష్టం. మరి దేనితోనూ పోల్చలేని ఇష్టాతియిష్టం. ముఖ్యంగా... 'షరతులు లేని ప్రేమ', 'సంపూర్ణ సమర్పణ', బదులుకోరకుండా కేవలం ప్రేమించడమే పరమ ప్రేమ. కేవలం సమర్పించడమే! దేవుడు మనను ప్రేమిస్తున్నాడా? కనీసం మన ప్రేమను స్వీకరిస్తున్నాడా? అసలు మన ప్రేమను గుర్తించాడా? ఈ ప్రశ్నలకు తావే లేదు. ఆయనను ప్రేమించాలనే ఇచ్ఛ ఉంది. ఆయనను ప్రేమించే మనసు ఉంది. ప్రేమిస్తున్నాం. చాలు. ఇంతకుమించి మనసు కోరే మనసు నిండే ఆనందం మరేముంది? ప్రేమించడంలోనే ప్రేమనూ పొందే మరో ప్రాణి లోకంలో మరోటి లేదు. భగవంతుని ప్రేమించడంలో మాత్రమే ఉంది... ఆ సొగసు, ఆ వెసులుబాటు. లేకపోతే విగ్రహ పుష్టితో నిలువెల్లా రాతిలా నిలబడి ఉండే ఆ రాతిగుండెను ఎవరు ప్రేమిస్తారు? ఆ రాతిగుండులో, ఆ రాతిగుండెలో అణువణువూ నవనీతంకంటే నాజూకైన హృదయం నిండి ఉందనీ, ఆ హృదయ పరిధి అఖండమనీ, అనంతమనీ, ఆకాశ సదృశంగా ఆవరించి ఉందనీ... ప్రేమించే భక్తుడికి మాత్రమే తెలుసు. మరి అతడు భగవంతుణ్ని ప్రేమించకుండా ఎలా ఉండగలడు? ప్రేమించడమే అతని పని. ప్రేమించడమే అతని జీవితం. ప్రేమించడమే అతని వూపిరి. మనిషి చాలా స్వార్థపరుడు. ఫలితం ఆశించని, లభించని పనిని దేన్నీ అతడు చేయడు. చేయలేడు. అతనికి భగవంతుడేమీ మినహాయింపు కాదు. భగవంతుణ్ని ప్రేమించడంలో, ప్రేమించడంలోనే, ప్రేమిస్తున్నప్పుడే, ఆ క్షణాల్లోనే ఏం జరుగుతోందో, ఏం వస్తోందో, ఏం పొందుతున్నాడో అతడికి, ఆ స్వార్థపరుడికి తెలుసు. దాన్ని అతడు వదులుకోలేడు. ఆ ఆనందంలో పడి, ఆ ఆస్వాదనలో తలమునకలై సర్వమూ సమర్పిస్తున్నాడు. ఖాళీ అయిన మురళిలా, కృష్ణుడే అయిపోయిన రవళిలా...!!! ఆయన... ఆ భగవంతుడు ఒక చెక్కముక్కకు స్వరాలు అద్దుతున్నాడు. రాగాలు దిద్దుతున్నాడు. నెమలి కన్నును నెత్తికెక్కించుకున్నాడు. కుబ్జ వెన్నును మీటి వీణలా మలిచాడు. తానే అన్నీ ఇస్తున్నవాణ్ని ఇంకేమని కోరను? కోరేందుకు తానేమి (భక్తుడు) మిగిలి ఉన్నాడని? అసలు తానెవరని? ఏమో!
భక్తిలో, ఆ పరమ ప్రేమలో భక్తుడు తానంటూ ఏమీ మిగిలి ఉండడు. తనకంటూ ఏ పనీ ఉండదు. తానే లేనివాడికి తనదంటూ ఏముంటుంది? భగవంతుడే తాను. ఆయన పనులే తన పనులు. తన పనులన్నీ ఆయనవే. తనకంటూ, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేని, 'అహం' భావంలేని మమేక స్థితే పరమ ప్రేమ. సక్కుబాయి, మీరాబాయి, జనాబాయి, కబీర్‌దాసు, రామదాసు, సూరదాసు, శబరి, ప్రహ్లాదుడు, త్యాగరాజు... ఎందరు... వారందరూ వారిని వారుగా భావించలేదు. తమను తాము కృష్ణుడిగా భావించారు. రాముడిగా జీవించారు. అమృతాత్ములై తరించారు. ఈ షరతులు లేని ప్రేమ, పరమ ప్రేమలో- ఈ సమర్పణ, ఈ శరణాగతి, ఈ అనన్యప్రేమ, ఈ అహంకార రహిత భావం... అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇమిడి ఉన్నాయి గనుకే, ఇమిడిపోయాయి. అందువల్లే తానేమీ లేడు. తానేమీ కాడు. ప్రేమ మాత్రమే మిగిలి ఉంది.
- చక్కిలం విజయలక్ష్మి