ᐅఅసలైన విద్య



ᐅఅసలైన విద్య 

'విత్' అనే ధాతువు నుంచి విద్య అన్నపదం వచ్చింది. విత్తి అంటే తెలుసుకోవటం లేక జ్ఞానం. ఏమీ తెలియని స్థితి నుంచి బయటపడటం లేక జ్ఞప్తిచేసుకోవటం జ్ఞానం. ఆదిలో ఉన్నదల్లా అవిద్య లేక అజ్ఞానం. ఏమీ తెలియని పరిస్థితిలో నుంచే తెలివి అనే స్థితికి చేరుకోవాలి. చీకట్లో కనిపించని వస్తువులు వెలుతురు రాగానే స్పష్టంగా తెలుస్తాయి. అందువల్ల అవిద్యకు చీకటి, విద్యకు వెలుగు సంకేతాలుగా ఏర్పడ్డాయి.
ఆదిలో ఉన్నదల్లా చీకటేనని నాసదీయసూక్తం చెబుతున్నది. ఉన్నదల్లా చీకటే అయితే వెలుగు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? చీకటి కడుపులోంచే వెలుగు పుట్టిందని చెప్పుకోవాలి. చీకట్లో వెలుగు ఉన్నదని ఉపనిషత్తు కూడా చెబుతున్నది. దీన్నిబట్టి, అవ్యక్తమైన చీకటిలాంటి అవిద్యనుంచి విద్యాజ్యోతి ఆవిర్భవించిందన్న విషయం నిర్వివాదం కాబట్టి, ఆ రెండింటిమధ్య ఎలాంటి వైరానికి ఆస్కారం లేదు. కాని, ప్రత్యక్షంగా పరస్పరం విరుద్ధంగా కనిపించే చీకటి వెలుగులు ఒకటేనని, సమన్వయ లోపంవల్ల అలా అనిపిస్తుందని విజ్ఞులు చెబుతున్నారు. సృష్టిలో లేని లోపం దృష్టికి ఎందుకు కనిపిస్తున్నది? ఈ లోపం పోవటానికి మార్గం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి.

విద్య రెండు రకాలు. ఒకటి భౌతిక విద్య. రెండోది ఆధ్యాత్మిక విద్య. బాహ్యప్రపంచంలోని వస్తువిశేషాలకు మాత్రమే పరిమితమైనది భౌతికమని, 'నేనెవరు? ఈ ప్రపంచం ఏమిటి? ఎలా వచ్చాను? ఎక్కడికి వెళ్తాను?'- ఇలాంటి బాహ్యేతరమైన ప్రశ్నలకు సమాధానం వెతికే జిజ్ఞాసను ఆధ్యాత్మికమని స్థూలంగా చెబుతారు. ఇంద్రియాలు, మనసు ప్రపంచాన్ని తెలుసుకోవటానికి ఉత్సాహపడినంతగా- ఆత్మ గురించి విచారించటానికి ఇష్టపడం. ఎందుకంటే, త్రిగుణాత్మకమైన ప్రకృతి రూపాంతరం చెందుతూ కవ్వించినట్టు ఆత్మ ఉవ్విళ్లూరించలేదు. వినోదయాత్రకు ఉన్న ఆదరణ ఈ ప్రపంచంలో విచారప్రస్థానానికి ఎందుకుంటుంది?

మరి, ఆధ్యాత్మిక విద్య అసలైన విద్య అనటంలో ఉన్న మర్మం ఏమిటి? తీగలాగితే డొంక కదులుతుందన్న సామెత ఈ విద్యకూ అన్వయిస్తుంది. ముందుగా, నేనెవరు? అన్న ప్రశ్నకు సమాధానం రాబట్టుకుంటే, సర్వం తేటతెల్లమవుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అని రుగ్వేదం, అహంబ్రహ్మాస్మి అని యజుర్వేదం, తత్త్వమసి అని సామవేదం, అయం ఆత్మాబ్రహ్మా అని అధర్వవేదం చెబుతున్నాయి. ఒక శిల్పి బండరాతిని చిల్లగొట్టి అందమైన శిల్పం తయారుచేస్తాడు. జ్ఞానికూడా అనాత్మ వస్తువును వేరుచేసి ఆత్మసాక్షాత్కారం పొందుతాడు.

ఈ శిల్పచాతుర్యం కోసం మళ్లీ మనసునే వాడుకోవాలి. మనోబుద్ధి అహంకారాలు చిత్తవృత్తులని పతంజలి సూత్రీకరించాడు. ఇంద్రియాలకన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, బుద్ధికన్నా ఆత్మ గొప్పదని గీత బోధిస్తున్నది. గీతాగ్రంథానికి యోగప్రస్థానం అన్న మరో పేరున్నది. అనుష్ఠానం, అనుభవం ద్వారా మాత్రమే ఆత్మవస్తువును అనాత్మవస్తువు నుంచి వేరుచేయటం సాధ్యమవుతుంది. యోగించి, భౌతికమైన వస్తువు, దాని పరిజ్ఞానం పరిమితం, అశాశ్వతం అని తెలుసుకోవటమే అసలైన విద్య.

- ఉప్పు రాఘవేంద్రరావు