ᐅప్రత్యామ్నాయం
ᐅప్రత్యామ్నాయం
కొంతమంది ఎన్నో కలలు కంటారు. కోరికలు పెంచుకుంటారు. కోరిక తీరుతుందని ఆశపడతారు. అది నెరవేరకపోతే నిరాశతో దుఃఖిస్తారు. కుమిలిపోతారు. ఈ పని సమర్థనీయం కాదు. మరికొందరు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువునుగాని వ్యక్తినిగాని పోగొట్టుకొన్నప్పుడు ఎంతగానో బాధపడతారు. విరక్తితో జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తారు. ఈ పనీ ఉచితం కాదు. ఇంకొంతమంది ఉంటారు. తాము కోరుకున్నది లభ్యం కాలేదని నిరాశతో బాధపడరు, జీవితాన్ని అంతమూ చేసుకోరు. తమకు తామే వూరట చెందుతారు. సమాధానపరచుకొంటారు. కోరుకున్నది దొరకనప్పుడు దానికి బదులుగా మరొక వస్తువుతో (ప్రత్యామ్నాయంతో) పని జరుపుకొంటారు. తృప్తిపడతారు. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.
విద్యుద్దీపాలు ఆరిపోతే కొవ్వొత్తిని వెలిగించుకొని చీకటి ఇంట్లో వెలుగును నింపుకొంటున్నాం గదా. మానవుడికి సర్దుబాటుతత్వం ఉండాలేగాని కొవ్వొత్తిలాంటి ప్రత్యామ్నాయాలు నిత్యజీవితంలో ఎన్నో తారసపడుతూ ఉంటాయి.
తన తల్లి రబ్బరుబంతి కొనలేకపోయిందని అక్కడక్కడా పాచిపని చేసుకొని బతుకుతున్న ఒకామె ఏడేళ్ల కొడుకు నెత్తిమొత్తుకొని ఏడ్వనూ లేదు. అలిగి కూర్చోనూ లేదు. పనికిరాని గుడ్డపీలికలను దర్జీవాడి కొట్టునుంచి తెచ్చుకొని గుండ్రంగా చుట్టి బంతిని తయారు చేసుకున్నాడు. దాంతోనే ఆడుకొంటూ ఆనందిస్తున్నాడు. కోరిక నెరవేరకపోతే ఇల్లు వదిలి పారిపోవడమో, తనను తాను అంతం చేసుకోవడమో లేక ఇతరుల్ని చంపడమోలాంటి ఘోరమైన నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ పిల్లాడిలో ఉన్న సర్దుబాటుతత్వం పెద్దవాళ్లందరికీ గుణపాఠం కావాలి. అందుబాటులో ఉన్నదాంతోనే రాజీపడి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే సందేశం ఈ పసివాడి గుడ్డబంతిలో ఉంది. రబ్బరు బంతికి ప్రత్యామ్నాయంగా గుడ్డబంతిని ఎంచుకొన్న ఆ పిల్లవాడి మనస్తత్వం సర్వులకూ ఆదర్శప్రాయమే.
ద్రోణాచార్యుల వారివద్ద శిష్యరికం లభించలేదని ఏకలవ్యుడుగాని, కర్ణుడుగాని నిరాశతో కుంగిపోనూలేదు. తమ జీవితాలను అంతం చేసుకోనూ లేదు. ద్రోణుడికి బదులుగా పరశురాముణ్ని గురువుగా చేసుకొని ధనుర్విద్య పొందాడు కర్ణుడు. ద్రోణుడి మట్టి బొమ్మనే గురువుగా భావించుకొని విలువిద్యను అభ్యసించాడు ఏకలవ్యుడు. ఆ ఇరువురూ లోకవిఖ్యాత ధనుర్విద్యా విశారదులయ్యారని భారతం చెబుతోంది.
కోరుకున్నది లభ్యం కానప్పుడు తొందరపాటుతో జీవితాన్ని అంతం చేసుకోకూడదు. నిదానంగా ఆలోచించి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాలి. దాంతోనే సంతృప్తి చెందాలి. అప్పుడే జీవితం ఆనందంగా గడచిపోతుంది- అని చెప్పే మన పెద్దల మాటల్ని, పురాణ కథనాలను మనం వినాలి. పాటించాలి. అప్పుడే మాణిక్యాల్లాంటి ఆ మాటల మూటలు మన జీవితాలకు పూలబాటలవుతాయి.
- కాలిపు వీరభద్రుడు