ᐅసహనమే శ్రేయోగుణం



ᐅసహనమే శ్రేయోగుణం 

మానవ జీవనంలో సహనం అన్ని వేళలా అత్యంత ఆవశ్యకం. స్నేహవిరోధాలు, ధర్మాధర్మాలు, ఆధిక్యనైచ్యాలు మన ప్రవర్తనలోని సహన గుణాన్నిబట్టే ప్రకటితమవుతాయి. జన హృదయాల్లో మన ప్రవర్తనా సరళి మృదు మోహన మురళీ రవళిలా ఉండాలంటే ముందు మనతో కలిసి మెలిసి జీవించేవారి ఆలోచనాలోచనాలను మనం దర్శించగలగాలి. మన హృదయానికి నచ్చినదాన్నే ఎదుటివాడు చేయాలని విక్రమించి వారి మీద పరాక్రమించకూడదు. అలా చేయటం సహనంతో, క్షమాగుణంతోనే సాధ్యపడుతుంది. సహనంతో చరించటం బలహీనత కాదు! అది మానవ మస్తిష్కం తాలూకు అంతర్లీనమైన అద్వితీయ శక్తిని లోకానికి తెలియజెప్పగల ఘనమైన ధీరత! క్షమాగుణం, సహనం కలిగినవారికి జనులు ముందు అసమర్థతను ఆపాదిస్తారు. కాలం గడిచిన కొద్దీ, వారి గొప్పదనం ఉత్తమమైన రీతిలో, ఉన్నతమైన తీరులో తేజోమయంగా వ్యక్తమవుతుంది. సహజసిద్ధమైన మానసిక అందాన్ని కోరే సంస్కారులు ఎల్లవేళలా సహనంతోనే చరిస్తారు. ఆనందమయులై తరిస్తారు.
పంచమ వేదంగా పేర్కొనే మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి, ఎనలేని సహనానికి ప్రతీకగా నిలిచాడు. దుర్యోధనుడు అధర్మవర్తనకు, అసహనానికి నిలువెత్తు ఉదాహరణ. తన సహన శక్తితో నిజమైన రాజనీతిని ప్రపంచానికి చాటడమే కాక మహితమైన లోకరీతీ ఎలా ఉండాలో చాటిచెప్పిన కమనీయ చరిత ధర్మజునిది. ధర్మ నిర్మాణ చణుడైన విదుర మహాత్మునితో పాటు, సర్వ ధర్మ ప్రబోధకమైన వేదాలను విభజించిన వేద వ్యాసుడు, భీష్మ ద్రోణాదులు సైతం ధర్మజుని సహన పరాయణత్వాన్ని ప్రశంసించడం కానవస్తుంది.

మహా భారతమంతా ధర్మజుడు శాంతి, సహనం అన్నివేళలా పాటించడమే కాక, అత్యంత పరాక్రమవంతులైన తన తమ్ముళ్లను సైతం అదే పంథాలో పయనించేలా హితబోధ చేస్తాడు. పెద్దలతో మాట్లాడే విషయంలోనూ, దుష్ట దుర్యోధనునికి పంపే శాంతి సందేశంలోనూ సహనంతో చరించడం- అతని నిజమైన జీవన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. 'అజాత శత్రువు' అనే యశశ్చంద్రికలకు నిజమైన ఉపమానం ధర్మజుడే! తనను, తన సోదరులను, పతివ్రతా శిరోమణియైన ద్రౌపదిని కడగండ్లు పెట్టిన కౌరవులతోనే కాక ఈ భూమండలంలోని ఎవరిపట్లా శతృత్వం లేని ఘనమైన శీలం పుట్టుకతోనే ప్రాప్తించిన మహామహితాత్ముడు అజాత శత్రువైన ధర్మరాజు. అణువణువునా సహనమే తన జీవనశైలిగా నిలువెల్లా నిండిపోగా, హృదయంగమమైన వ్యక్తిత్వానికి, గంగా తరంగాంతరంగ జలమంతటి స్వచ్ఛమైన హృదయానికి ఉత్తమ ఉదాహరణగా ఉదాత్తుడైన ధర్మనందనుడు నిలుస్తాడు.

సహనం విలువను, అది సాధించిపెట్టే శుభాలను, సుఖాలను రోమశ మహర్షి ధర్మరాజుకు తేటతెల్లం చేయటం మహాభారతంలో మనకు అతి మనోహరంగా సాక్షాత్కరిస్తుంది. 'నాయనా! సహనం ఈ చరాచర జగత్తులోని జీవుల్లో ఎవరైనా అనుసరించదగిన అతి ముఖ్యమైన సుగుణం. దేవతలను రాక్షసులతో పోల్చి చూసినప్పుడు దేవతలు ధర్మవర్తనులే కాక విపత్కర పరిస్థితుల్లోనూ సహనాన్ని వీడకుండా ఉండటమే వారి నిత్య కల్యాణ శోభకు, పచ్చతోరణంలా విలసిల్లే ప్రభకు కారణం. నిశితంగా విశ్లేషిస్తే, అధర్మ ప్రవర్తన కలవారిలోనే గర్వం ఉద్భవిస్తుంది. గర్వంవల్ల స్వాభిమానం ఏర్పడుతుంది. స్వాభిమానం వలన కోపం ఉదయిస్తుంది. కోపం వలన సిగ్గు, బిడియం పోయి వారి నడవడిక చెడుతుంది. సిగ్గూ, సత్ప్రవర్తనా లేనివారు సహనాన్ని సమూలంగా కోల్పోతారు. సహనం కోల్పోయినవాడిని సమస్త సంపదలు విడిచిపెడతాయి' అంటూ రోమశుడు ధర్మసూక్తులతో సహనం అపార శక్తిని అనుభవ ప్రోక్తంగా, అత్యంత యుక్తంగా తెలియజెబుతాడు.

సహన భావన సహృదయ హృదయైకవేద్యం. క్షమాగుణం, సహనం అనే దివ్యమైన లక్షణాలు సజ్జన జీవనం జగతికి నవ్యంగా అందించే భవ్యనైవేద్యం. అది నిశ్చల మనస్కులకే సుసాధ్యమవుతుంది.

- వెంకట్ గరికపాటి