ᐅసాధన- సాధ్యం
ᐅసాధన- సాధ్యం
సాధన అంటే ప్రయత్నం. మానవ ప్రయత్నం లేనిదే ఏ కార్యమూ నెరవేరదు. ప్రతి కార్యానికీ ఒక కారణం ఇదివరకే నిర్ణయం అయి ఉంటుంది. అయినా మన ప్రయత్నం మనం చేయాలి. ఈ పురుష ప్రయత్నం మానవ ధర్మం. సాధనవల్ల అన్ని అభీష్టాలూ సమకూరతాయని ఆప్తవాక్యం. సాధన రెండు రకాలు. ప్రవృత్తి మార్గంలో సాధన చేసి లబ్ధి పొందటం మొదటిది. ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసే ప్రయత్నం రెండోది. భౌతిక జీవితంలో ఎంతో కష్టపడి ధనాన్ని, కీర్తిని ఆర్జించినా ఆనందాన్ని, తృప్తినీ చాలామంది పొందలేకపోతున్నారు. ఏదో వెలితి, అర్థంకాని ఆవేదన వాళ్ల జీవితాలను పెనవేస్తున్నది. ఇందుకు భిన్నంగా కొంతమంది అవసరాల మేరకు జీవిస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవనయానం సాగిస్తున్నారు. దీన్నిబట్టి, ఆధ్యాత్మిక సాధనవల్ల శాశ్వతమైన ఆనందం, పరమశాంతి పొందే అవకాశం ఉందని గ్రహించవచ్చు. శాంతి, సుఖం- ఈ రెండూ కవలపిల్లల్లాంటివి. సుఖంగా ఉండాలంటే మనశ్శాంతి ఉండాలి. 'శాంతము లేక సౌఖ్యము లేదు' అన్నాడు త్యాగరాజు. అశాంతులకు సుఖమెక్కడిదన్న గీతావాక్యాన్ని సంగీత రూపంలో మనకు అందజేశాడు ఆ రాగరాజు.
మన అశాంతికి, అసంతృప్తికి మనలో అనాదిగా పాగా వేసిన రాగద్వేషాలే కారణం. మనసులో రకరకాల కోరికలు ఈరికలెత్తుతూ ఉంటాయి. సముద్రంలోని అలల్లా కోరిక వెంట కోరిక జాతర జరుగుతూనే ఉంటుంది. కోరికలు నెరవేరితే ఆనందం కలుగుతుంది. అవి తీరకపోతే పుట్టెడు దుఃఖం మిగులుతుంది.
సాధన వల్ల సుఖదుఃఖాలు మనసును కలచివేయకుండా జీవించటం సాధ్యమేనని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మనిషి అంటే మనసని, ఆ మనసే బంధానికి, మోక్షానికి కారణం అవుతున్నదని చెబుతున్నది గీతాగ్రంథం. మనిషిగా పుట్టడమే ఒక మహాభాగ్యం అయితే సుఖదుఃఖాలు అనుభవించటం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే చెప్పేయవచ్చు. కర్మ. అది చేయటానికి తగ్గ పనిముట్లు కూడా ప్రసాదించాడు భగవంతుడు. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, వాటిని సవ్యంగా వాడుకోవటానికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతఃకరణాలూ ఇచ్చాడు. కాబట్టి, కర్మ ఎలా చేయాలో నిర్ణయించుకునే అధికారం మన చేతుల్లో పెట్టాడు ఆ భగవంతుడు. ఏ పని చేయవచ్చో, ఏది చేయకూడదో చెప్పడానికి అవసరమైన శాస్త్రం ఉండనే ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ, జీవితంలో ఏదో లోటు ఉన్నట్లు ఎందుకు అనిపిస్తోంది?
అసలు రహస్యం ఇక్కడే ఉంది. మనం కర్మజీవులం కాబట్టి కర్మ చేయటం వరకే మన బాధ్యత. దానికి తగిన ఫలితం ఆ భగవంతుడి చేతుల్లో ఉంది. కర్మయోగం అంటే ఇదే. కర్మలు చేస్తూ చేస్తూ ఈ సత్యాన్ని గ్రహించగలిగినవాడే కర్మయోగి. అలా మనసుకు అంటకుండా కర్తవ్య కర్మలు చేపడితే కర్మవాసనలు అంటవు. శరీరం ఉన్నంత కాలం కర్మలు తప్పవు. ఫలితం గురించి ఆలోచిస్తే మాత్రం అంతరంగంలో పోరాటం, ఆరాటం తప్పవు.
నివృత్తి సాధన అంటే కర్మయోగమే. దీనిద్వారా ఆత్మజ్ఞానం సాధ్యం. అంటే కర్మవల్ల జ్ఞానం సాధ్యం. కర్మయోగం ద్వారా జ్ఞానం పొందటమే సన్యాసం. యోగి, సన్యాసి ఇద్దరూ ఒకటే. కర్మయోగం ద్వారా ఆత్మజ్ఞానం పొందాక కర్మలతో పని లేదు. కానీ, వేషం మార్చుకుని అన్ని కార్యాలను వదిలేయటం సన్యాసం కాదు. ఫలాపేక్ష ఎలాగూ లేదు కనక పనులు మానేయటం యోగమూ కాదు. నిజమైన సన్యాసి ప్రజాహితం, జగద్ధితం అయిన కర్మలు చేస్తూనే ఉంటాడు. నిజమైన యోగి కర్తృత్వం తప్ప భోక్తృత్వం గురించి ఆలోచించడు.
కర్మ సాధనం - జ్ఞానం సాధ్యం
- ఉప్పు రాఘవేంద్రరావు